కేశంపేట, న్యూస్‌లైన్: ఆధునిక యుగంలో ప్రజలు మూఢ నమ్మకాలను నమ్మవద్దని, తాగుడుకు బానిసైన వారికే దెయ్యాల ధ్యాస ఉంటుందని ఎమ్మెల్సీ నాగేశ్వర్ పేర్కొన్నారు. కేశంపేట మండలంలోని కాకునూరులో కొన్ని రోజులుగా దెయ్యం పుకార్లు రావడంతో, జనానికి అవగాహన కల్పించేందుకు సోమవారం రాత్రి జన విజ్ఞాన వేదిక (జేవీవీ) ఆధ్వర్యంలో జన చైతన్య సభను ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రపంచంలో దెయ్యాలంటూ ఏమీ లేవన్నారు.
మనిషిలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లితే శరీరంలో వణుకు పుట్టడంతో పాటు దెయ్యాలు, భూతాలు ఉన్నట్లు అనిపిస్తుందన్నారు. తాగుడుకు బానిసైన వారికి ఒక్క పూట మందు లేకపోతే లేనిపోని ఆలోచనలు వస్తాయని, అలాంటి ఆలోచనల్లో పుట్టినదే దెయ్యం, భూతమన్నారు. అనంతరం అరచేతిలో మంటను మండించడం, ఇనుపచువ్వలను నాలుకకు కుచ్చుకోవడం, నూనెలో బజ్జీలు వేసి చేతితో తీయడం వంటి విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు వెంకటరమణ, సర్పంచ్ లక్ష్మమ్మ, ఉపసర్పంచ్ జంగారెడ్డి, ఎస్‌ఐ సంజీవ్, తదితరులు పాల్గొన్నారు.
మూఢ నమ్మకాలను నమ్మొద్దు
Published Tue, Oct 1 2013 3:37 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement