MLC Nageshwar
-
బంగారు తెలంగాణ గిట్లుండాలె..
కాగజ్‌నగర్ రూరల్: నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడంతోనే రాష్ట్రం పరిపూర్ణం అవుతుందని ఎమ్మెల్సీ నాగేశ్వర్ అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలో ‘బంగారు తెలంగాణ అంటే ఎట్లుండాలే’అనే అంశంపై నిర్వహించిన సెమినార్లో ఆయన ప్రసంగించారు. ప్రస్తుతం కేవలం భౌగోళికంగా మాత్రమే రాష్ట్రం ఏర్పడిందని, తెలంగాణ రాష్ట్రంలో సస్యశ్యామల, పారిశ్రామిక, పర్యాటక, విజ్ఞాన రంగాలు అభివృద్ధి సాధ్యమైనప్పుడే సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు మారుతాయన్నారు. ప్రాంతీయ అసమానతలు అధిగమించి తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలు అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని చెప్పారు. రాష్ట్రంలోని కరువు ప్రాంతాల్లో గల ప్రాజెక్టులను పూర్తి చేయాలని, తక్కువ ఖర్చుతో తొందరగా పూర్తయ్యే ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. రాష్ట్రం ఏర్పాటు తరువాత మన చరిత్ర, సంస్కతి గురించి గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావన లేకపోవడం బాధకరమన్నారు. భవిష్యత్‌లో అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందితేనే ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న మాటకు అర్థం చేకూరుతుంది’ అని అన్నారు. -
మల్కాజ్‌గిరిలో పోటీకీ నాగేశ్వర్ సై
హైదరాబాద్: మల్కాజ్గిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్న ఎమ్మెల్సీ కె. నాగేశ్వర్ ఈ దిశగా కసరత్తు ముమ్మరం చేశారు. ఈ నెల 30న ఆయన సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. స్థానిక ప్రజల అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. తనకు మద్దతు తెలపాలని ఆయన కోరనున్నారు. సన్నిహితులు, మిత్రులతో ఇప్పటికే సంప్రదింపుల పర్వం పూర్తి చేసిన నాగేశ్వర్.. ఏదో ఒక పార్టీ తరపున కాకుండా, తన పంథా, వైఖరి రీత్యా అన్ని వర్గాల మద్దతు పొందేందుకు స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేయాలని నాగేశ్వర్ నిర్ణయించుకున్నారు. నాగేశ్వర్‌కు మద్దతు ఇచ్చేందుకు సీపీఎం సుముఖంగా ఉన్నట్టు కనబడుతోంది. -
మూఢ నమ్మకాలను నమ్మొద్దు
కేశంపేట, న్యూస్‌లైన్: ఆధునిక యుగంలో ప్రజలు మూఢ నమ్మకాలను నమ్మవద్దని, తాగుడుకు బానిసైన వారికే దెయ్యాల ధ్యాస ఉంటుందని ఎమ్మెల్సీ నాగేశ్వర్ పేర్కొన్నారు. కేశంపేట మండలంలోని కాకునూరులో కొన్ని రోజులుగా దెయ్యం పుకార్లు రావడంతో, జనానికి అవగాహన కల్పించేందుకు సోమవారం రాత్రి జన విజ్ఞాన వేదిక (జేవీవీ) ఆధ్వర్యంలో జన చైతన్య సభను ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రపంచంలో దెయ్యాలంటూ ఏమీ లేవన్నారు. మనిషిలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లితే శరీరంలో వణుకు పుట్టడంతో పాటు దెయ్యాలు, భూతాలు ఉన్నట్లు అనిపిస్తుందన్నారు. తాగుడుకు బానిసైన వారికి ఒక్క పూట మందు లేకపోతే లేనిపోని ఆలోచనలు వస్తాయని, అలాంటి ఆలోచనల్లో పుట్టినదే దెయ్యం, భూతమన్నారు. అనంతరం అరచేతిలో మంటను మండించడం, ఇనుపచువ్వలను నాలుకకు కుచ్చుకోవడం, నూనెలో బజ్జీలు వేసి చేతితో తీయడం వంటి విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు వెంకటరమణ, సర్పంచ్ లక్ష్మమ్మ, ఉపసర్పంచ్ జంగారెడ్డి, ఎస్ఐ సంజీవ్, తదితరులు పాల్గొన్నారు. -
దద్దరిల్లిన జీహెచ్ఎంసీ
సాక్షి, సిటీబ్యూరో: ఎమ్మెల్సీ నాగేశ్వర్ తదితరుల ఆందోళనలు.. పోలీసులతో వాగ్వాదం.. ఔట్‌సోర్సింగ్‌పై గుర్తింపు యూనియన్ కార్మికుల గడబిడ.. ఈ ఘటనలతో సోమవారం జీహెచ్ఎంసీలో ఉద్రిక్తత నెలకొంది. ప్రతి సోమవారం జరిగే ప్రజా ఫిర్యాదుల వేదిక ‘ప్రజావాణి’ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో తీవ్ర గందరగోళం రేపింది. ఎల్బీనగర్ సర్కిల్ పరిధిలోని పలు పార్కులు, ప్రభుత్వ స్థలాలు ప్రైవేటు వ్యక్తుల పరం కావడంపై ఫిర్యాదు చేసేందుకు ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ కాలనీస్ అండ్ అపార్ట్మెంట్స్ (ఫాకా) గౌరవాధ్యక్షులైన ఎమ్మెల్సీ నాగేశ్వర్‌తో సహా పలువురు సభ్యులు, కాలనీవాసులు వచ్చారు. అధికారుల నిర్లక్ష్యంపై నినదిస్తూ వారు ప్రజావాణి జరిగే ‘ఫేస్ టు ఫేస్’ హాల్లోకి వెళ్లబోగా ద్వారం వద్ద సెక్యూరిటీగార్డులు అడ్డుకొని గేటు మూసివేశారు. దాంతో ధర్నాకు దిగారు. వాగ్వాదాలు, ఘర్షణల అనంతరం ఐదుగురిని మాత్రం లోనికి అనుమతిస్తామని సిబ్బంది చెప్పారు. ప్రజా సమస్యల్ని ప్రస్తావించేందుకు వస్తే.. అడ్డుకోవడమే కాక, కమిషనర్ తనను అవమానపరిచారని నాగేశ్వర్ మండిపడ్డారు. కబ్జారాయుళ్లకు రెడ్‌కార్పెట్ పరిచే అధికారులు.. ప్రజల కోసం వచ్చిన తమను అడ్డుకొని అవమానించారని ధ్వజమెత్తారు. తనకు జరిగిన అవమానానికి నిరసనగా కింద బైఠాయించారు. ప్రజావాణిలో కమిషనర్ కృష్ణబాబు లేకపోవడంతో మరింత అసహనానికి గురయ్యారు. అడిషనల్ క మిషనర్ (ప్లానింగ్) రోనాల్డ్‌రాస్.. తగిన చర్యలు తీసుకుంటానని హామీనిచ్చి శాంతింపచేశారు. కాగా గేటు వద్ద గొడవ, ధర్నా జరుగుతుండటంతో కమిషనర్ కృష్ణబాబు వేరే ద్వారం నుంచి సచివాలయంలో జరిగే సమావేశానికి వెళ్లినట్లు సమాచారం. ఇవీ కబ్జాలు.. ఎల్బీన గర్ సర్కిల్లోని సహారా లేఔట్లో ప్రజావసరాల కోసం వదిలిన ఖాళీ స్థలాన్ని ఎకరానికి పైగా తగ్గించి ఫైనల్ అప్రూవల్ ఇచ్చారని ఫాకా ప్రతినిధులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. గ్రీన్ ఎస్టేట్‌కాలనీ పార్కును కబ్జాచేసిన వారికి ఎల్ఆర్ఎస్ ఇచ్చారని ఆరోపించారు. ఔట్సోర్సింగ్ ఆపకుంటే ఆమరణదీక్ష జీహెచ్ఎంఈయూ హెచ్చరిక పన్నులు, ఫీజుల వసూళ్లను ప్రైవేటుకిచ్చే ప్రక్రియను అధికారులు వెంటనే రద్దుచేయాలని, టెం డర్లను ఉపసంహరించుకోవాలని జీహెచ్ఎంసీ గుర్తింపు యూనియన్ జీహెచ్ఎంఈయూ ఆధ్వర్యంలో సోమవారం ఆందోళనకు దిగారు. ఓవైపు ఫేస్టు ఫేస్ హాల్లో ప్రజావాణి జరుగుతుండ గా, యూనియన్ అధ్యక్షడు యు.గోపాల్ ఆధ్వర్యంలో అక్కడకు చేరుకున్న కార్మికులు.. అధికారులకు వ్యతిరేకంగా నినదించారు. గోపాల్ మా ట్లాడుతూ జీహెచ్ఎంసీ ఉద్యోగులు కాని వారెవరికీ పన్నులు, ఫీజుల వసూళ్ల బాధ్యతలివ్వరాదని డిమాండ్ చేశారు. లేకుంటే అన్ని సేవలూ నిలిపివేసి ఆమరణ దీక్షలు చేస్తామని హెచ్చరించారు.