శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్ :జిల్లాకు పొంచి ఉన్న ‘పై-లీన్’ పెను తుపాను ముప్పును ఎదుర్కొని సహాయ చర్య లు చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసిందని జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ చెప్పారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తుపాను ప్రభావం వల్ల గంటకు 250 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉందన్నారు. సముద్ర తీరంలో ఇప్పటికే 3 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుతో కెరటాలు వస్తున్నాయన్నారు. పెనుగాలుల ధాటికి చెట్లు, టెలిఫోన్, విద్యుత్ స్తంభాలు, ఇళ్లు కూలిపోయి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరిం చారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లో 24 గంటలూ పనిచేసే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందవచ్చని తెలిపారు.
మండల కేంద్రాల్లో కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటు చే యటంతోపాటు సహాయ చర్యలు చేపట్టేందుకు ప్రత్యేకాధికారులను నియమించామని చెప్పారు. అత్యంత ప్రమా దం ఉన్న 49 తీరప్రాంత గ్రామాలను ఖాళీ చేయించి ప్రజలను సురక్షితప్రాంతాలకు తరలించామన్నారు. మొత్తం 47 వేల మందిని తరలించాల్సి ఉండగా ఇప్పటివరకు 12,500 మందిని 37 పునరావాసకేంద్రాలకు తరలించామని చెప్పారు. అయితే కొంతమంది ఇళ్లు విడిచి రావడానికి ఇష్టపడడం లేదన్నారు. పిల్లలు, వృద్దులు, మహిళలను ప్రత్యేక వాహనాల్లో తీసుకువెళుతున్నారని తెలిపారు. తుపాను వల్ల 2.60 లక్షల మంది ఇబ్బంది పడే అవకాశం ఉందన్నారు. జాతీయ విపత్తు రక్షణ దళాలను ఇచ్ఛాపురం, సోంపేట, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి మండలాల్లో ఉంచామన్నారు. ఆర్మీ, నేవీ, కోస్టుగార్డు అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని వెల్లడించారు.
సీఐఎస్‌ఎఫ్, బీఎస్‌ఎఫ్, ఆర్మడ్ రిజర్‌వ పోలీస్ బృందాలు జిల్లాలో ఉన్నాయని తెలిపారు. సకాలంలో అవగాహన కల్పించడం వల్ల మత్స్యకారులు రెండు రోజులుగా వేటకు వెళ్లలేదని, దీనివల్ల ప్రాణనష్టం నివారించగలిగామన్నారు. ప్రతి మండల కేంద్రంలోనూ జనరేటర్‌తోపాటు 3 రోజులకు సరిపడా బియ్యం, నూనె, చింతపండు, పప్పు ఇతర నిత్యావసర సామగ్రిని నిల్వ చేశామన్నారు. అవసరమైన మేరకు పోలీసు వైర్‌లెస్ సెట్‌లను ఉపయోగించుకుంటున్నామని తెలిపారు. జిల్లాకు ప్రత్యేకాధికారిగా గతంలో కలెక్టర్‌గా పనిచేసిన వెంకట్రామిరెడ్డి వచ్చారని తెలిపారు. తుపాను సమాచారం లైజనింగ్ అధికారిగా డీఆర్‌ఓ నూర్‌బాషాఖాసీం వ్యవహరిస్తారని, పునరావాస కేంద్రాలకు సామగ్రి పంపిణీని ఏజేసీ రాజ్‌కుమార్ సమన్వయం చేస్తారని తెలిపారు.
టెక్కలి డివిజన్‌పై ప్రత్యేక శ్రద్ధ
తుపాను ప్రభావం టెక్కలి డివిజన్‌పై ఎక్కువగా ఉండవచ్చని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారని, దీంతో ఈ డివిజన్‌ను జిల్లా అధికారుల పర్యవేక్షణలో ఉంచామని కలెక్టర్ వివరించారు. డివిజన్‌లోని ఆరు మండలాల్లో పెట్రోల్, గ్యాస్, డీజిల్, నీరు, పాలు, మోటారు వాహనాలు, ఇతర సామగ్రిని అధికంగా అందుబాటులో ఉంచామని, ప్రత్యేక అంబులెన్‌సలు సిద్ధం చేశామని వెల్లడించారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై రాకపోకలను నిలిపివేయాలని ఆదేశించామన్నారు. వైద్య సేవలందించేందుకు 52 మంది డాక్టర్లు, 120 మంది స్టాఫ్ నర్సులు, మరికొంతమంది సిబ్బంది, రెడ్‌క్రాస్ సహాయకులు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలను నియోగించామని చెప్పారు.
వ్యాపార, విద్యా సంస్థలు మూసివేయాలి
తుపాను కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశాలున్నందున శనివారం, అవసరమైతే ఆది వారం వ్యాపార, వాణిజ్య సంస్థలు, పాఠశాల లు, కళాశాలలు, సినిమాహాళ్లు, దుకాణాలను మూసివేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ నవీన్‌గులాఠీ మాట్లాడుతూ విపత్తును ఎదుర్కొనేందుకు పోలీస్ యంత్రాం గం సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటికే ఆర్‌మడ్ పోలీస్, బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, స్పెషల్ పోలీ సుల సహాయం తీసుకుంటున్నామని చెప్పారు. టెక్కలి డివిజన్‌లో ప్రతి సహాయ బృందానికి ఒక సీఐని కేటాయించి బాధ్యతలు అప్పగించామన్నారు. సమావేశంలో కమాం డెంట్ విశ్వప్రశాంత్, ఏజేసీ ఆర్.ఎస్.రాజకుమార్, డీఆర్‌ఓ నూర్‌బాషా ఖాసీం పాల్గొన్నారు.
సహాయ చర్యలకు సర్వం సిద్ధం
Published Sat, Oct 12 2013 2:10 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
Advertisement
Advertisement