సరెం‘డర్’ | Surrender | Sakshi
Sakshi News home page

సరెం‘డర్’

Published Mon, Apr 6 2015 2:22 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

Surrender

విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించినా చార్జి మెమోలు జారీ
ఉన్నతాధికారులను సరెండర్ చేస్తూ ఉత్తర్వులు
ఎప్పుడు ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందోనని ఉద్యోగుల్లో ఆందోళన

 
 
విధి నిర్వహణలో తప్పులు చేస్తే ఏమాత్రం క్షమార్హం కాదు. అయితే విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించిన పాపానికి జిల్లా ఉన్నతాధికారి నుంచి మెమోలు.. సరెండర్ ఉత్తర్వులు అందుకోవాల్సిన దుస్థితి జిల్లాలోని ఉద్యోగులకు దాపురించింది. ఇప్పటికే చేయని నేరానికి వివిధ శాఖలకు చెందిన ముగ్గురు ఎస్‌ఈలు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి సరెండర్ కాగా, నలుగురు సిబ్బంది అకారణంగా ఛార్జి  మెమోలు అందుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందోనని ఉద్యోగులు వణుకుతున్నారు.
 
సాక్షి ప్రతినిధి, కడప : ఇటీవల జిల్లాలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన సమీక్షకు హాజరయ్యారని జీఎన్‌ఎస్‌ఎస్, మైనర్ ఇరిగేషన్ ఎస్‌ఈలను ఇరువుర్ని సరెండర్ చేస్తూ ఉత్తర్వులు అందాయి. గ్రీవెన్స్‌సెల్‌కు సక్రమంగా హాజరు కాలేదని ఆర్ అండ్ బి ఎస్‌ఈని సరెండర్ చేస్తూ ఉత్తర్వులు అందాయి.

శాఖాపరంగా అవినీతి చోటుచేసుకుందని సంబంధంలేని వ్యవహారంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని సరెండర్ చేశారు.ఇలా ఒకరి తర్వాత మరొకరిపై వేటు పడటమనేది జిల్లాలో క్రమం తప్పకుండా జరుగుతోంది. దీంతో ఉద్యోగులు భయం భయంగా విధులు నిర్వర్తించాల్సి వస్తోంది.

చేయని తప్పుకు ఛార్జి మెమోలు...

రిమ్స్ రేడియాలజీ విభాగానికి వివిధ  పరికరాలు కొనుగోలు విషయమై రూ.15లక్షలు వెచ్చించాలని అందులో అడ్వాన్సు ట్యాక్స్ రూపేనా 90శాతం చెల్లించాలని గత నెల 19న కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. 20వతేదీన రిమ్స్ అధికారులు ఫైల్ సమర్పించాలని ఆదేశించారు. 21,22 తేదీలు సెలవులు వచ్చాయి.

23న ఫైల్ రాసి, 24న ఆమేరకు బిల్లులు చెల్లించారు. కలెక్టర్ ఉత్తర్వులు అందగానే 90శాతం అడ్వాన్సు బిల్లులు చెల్లించలేదని నాలుగురోజులు ఆలస్యం చేశారనే కారణంగా రిమ్స్ డీడీ, ఏఓ, సూపరింటెండెంటు, సీనియర్ అసిస్టెంట్‌లకు చార్జి మెమో జారీ చేశారు. చేయని నేరానికి  రిమ్స్ ఉద్యోగులు శిక్ష అనుభవించారు. ఇంతవరకూ ఇలాంటి విపత్కర పరిస్థితిని ఎప్పుడూ చవిచూడలేదని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు.

కలెక్టర్‌కు శృంగభంగం....

జెడ్పీ వ్యవహారంలో కలెక్టర్‌కు శృంగభంగం తప్పలేదు. ఎంపీడీఓల బదిలీల వ్యవహారంలో అవినీతి చోటుచేసుకుందని సీఈఓ ఇచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేయాలని ప్రభుత్వానికి సిఫార్సులు చేశారు. ఈ కారణంగా 26 మంది ఎంపీడీఓల బదిలీలను నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉత్తర్వులపై జెడ్పీ చైర్మన్ గూడూరు రవి హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తిరస్కరిస్తూ ఎంపీడీఓల బదిలీలు చెల్లుబాటు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. దాంతో కలెక్టర్ చర్యలకు బ్రేకులు పడ్డాయి. ఇప్పటికే ఇరువురు సరెండర్ అయినా జీఎన్‌ఎస్‌ఎస్, మైనర్ ఇరిగేషన్ ఎస్‌ఈలను అదే స్థానాలకు కేటాయిస్తూ ఆయా శాఖల ఉన్నతాధికారులు ఉత్తర్వులిచ్చారు. కడప ఆర్‌అండ్‌బి ఎస్‌ఈగా బాధ్యతలు చేపట్టిన నాలుగు మాసాల్లోపే వెంకటేశ్వరరావును సరెండర్ చేస్తూ  ఉత్తర్వులివ్వడంపై ఉద్యోగవర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

జిల్లాలో వరుసగా ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకున్న కారణంగా ప్రభుత్వం అభాసుపాలవుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారి అందరినీ కలుపుకుని సమర్థవంతంగా యంత్రాంగాన్ని నడిపించాలని ఆ దిశగా చర్యలు ఉండాలని పలు ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement