
సాక్షి, అమరావతి: ఇసుక అక్రమాలను కట్టడి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం గట్టి చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇసుక అక్రమంగా తవ్వినా, రవాణా చేసినా, పరిమితికి మించి నిల్వ చేసినా, అధిక ధరలకు విక్రయించినా కఠిన శిక్షలు అమలు చేస్తామంటూ ఇప్పటికే ప్రభుత్వం జీవో జారీ చేసింది. తాజాగా ఇలాంటి అక్రమాలపై ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ కోసం టోల్ ఫ్రీ నంబరును కూడా అందుబాటులోకి తెచ్చింది. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ 14500 టోల్‌ఫ్రీ నంబర్‌ను ప్రారంభించారు.
ఈ నంబర్‌కు కాల్‌చేసి కాల్ సెంటర్ ఉద్యోగులతో సీఎం మాట్లాడారు. టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్‌చేసి ఫిర్యాదులు చేసేవారి నుంచి ఎలాంటి సమాచారం సేకరించాలన్న అంశంపై కాల్ సెంటర్ ఉద్యోగులకు సీఎం కొన్ని సూచనలు చేశారు. మంత్రిపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, టాస్‌్కఫోర్స్ చీఫ్ సురేంద్రబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇసుక అక్రమాలపై కఠినంగా వ్యవహరించాలని టాస్క్ఫోర్స్ చీఫ్ సురేంద్రబాబును సీఎం ఆదేశించారు. ఎవరు తప్పు చేసినా తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని నొక్కి చెప్పారు.
వారోత్సవాలు విజయవంతం
వరద తగ్గడంతో అవసరాల మేరకు ఇసుకను అందుబాటులోకి తెచ్చేందుకు సీఎం జగన్ ఆదేశాల మేరకు ప్రారంభించిన ఇసుక వారోత్సవాలు సక్సెస్ అవుతున్నాయి. రోజువారీ ఉత్పత్తిని లక్ష టన్నుల నుంచి 2 లక్షల టన్నులకు పెంచాలన్న లక్ష్యాన్ని వారోత్సవాలు ప్రారంభమైన 48 గంటల్లోనే అధికారులు అధిగమించారు. వరదలు తగ్గుముఖం పట్టడం, ఉత్పత్తికి అనుగుణంగా రవాణాకు తగినన్ని వాహనాలను అందుబాటులోకి తేవడంతో ఇది సాధ్యమైందని అధికారులు పేర్కొన్నారు. శనివారం ఒక్కరోజే 2,03,387 టన్నుల ఇసుకను అందుబాటులోకి తేగా కేవలం 50,086 టన్నుల మేరకు మాత్రమే బుకింగ్‌లు వచ్చాయని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. ఆదివారం డిమాండ్ సగానికి తగ్గిపోయిందని వివరించారు. ఇక నుంచి రోజుకు సగటున 40వేల టన్నుల మేరకు ఇసుక డిమాండు ఉంటుందని భావిస్తున్నట్లు అధికారులు అంచనా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment