ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఈ మధ్య ప్రజెంటేషన్ ల మీద ప్రజెంటేషన్ లు ఇచ్చేస్తున్నారు. మొత్తం మీద తనకు రాజకీయ సలహా సంస్థ ఏమి చెబితే అది చేస్తున్నట్లు ఉన్నారు. కాకపోతే అప్పడప్పుడు పప్పులో కాలు వేస్తున్నారనిపిస్తుంది. ఉదాహరణకు ఇసుకాసురుడు జగన్ అంటూ ఇచ్చిన ప్రజెంటేషన్ తీసుకోండి. ప్రస్తుతం ఆ పరిస్థితి ఉందా?లేదా? అన్నది పక్కనబెడితే, ఆయన చెప్పిన విషయాలు వింటే అవన్నీ ఆయన ప్రభుత్వానికి కూడా వర్తిస్తాయన్న సంగతి మర్చి పోయి మాట్లాడేస్తున్నారని స్పష్టం అవుతుంది. ఎవరైనా కాస్త ఆలోచనపరులు ఉంటే ఇట్టే తెలిసిపోతుంది.
సహజంగానే తెలుగుదేశం మీడియాగా ఉన్న ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి సంస్థలు విపరీతమైన ప్రాముఖ్యతను ఇచ్చి ఆయన ప్రజెంటేషన్ ను ప్రచారం చేశాయి. వాటిలో వచ్చిన వార్తలను చదివితే కొన్ని సందేహాలు వచ్చాయి. అన్నిటికన్నా ముందుగా గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన అధికారిక నివాసానికి సమీపంలోనే అనుమతులు లేకుండా ఇష్టారీతిన ఇసుక తవ్వి తరలించినందుకు హరిత ట్రిబ్యునల్ వంద కోట్ల జరిమానా విధించిందా? లేదా? అంటే దాని అర్దం అక్కడ జరిగిన ఇసుక తవ్వకాలలో ఆయనకు వాటా ఉందని ఒప్పుకుంటారా?. ఆయన టరమ్‌లో ఇసుకను పేరుకు ఉచితంగా ఇచ్చారు తప్ప, ప్రజలకు ఒరిగింది పెద్దగా ఏమీ లేదు. తెలుగుదేశం నేతలు ఇసుక మాఫియాగా మారి ప్రజలను వేధించడం కూడా ప్రభుత్వ ఓటమికి ఒక కారణం అని అందరికి తెలుసు. తన పార్టీ ఎమ్మెల్యేలు ఎలాగైతే అరాచకాలు చేసి అప్రతిష్టపాలయ్యారో, అదే మాదిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను కూడా బదనాం చేయాలన్న లక్ష్యంతో మాట్లాడినట్లు అనిపిస్తుంది.
✍️ ఏ ప్రభుత్వం ఉన్నా ఇసుకను అక్రమంగా తవ్వితే తప్పు పట్టవలసిందే. ఈ ప్రభుత్వం అతీతమని ఎవరూ చెప్పరు. కానీ.. ప్రతిపక్ష నేతగా ఉన్నవారు కనుక తోచిన కాకిలెక్కలు చెప్పి జనాన్ని మాయ చేయాలనుకోవడమే పెద్ద తప్పు అని చెప్పాలి. ఎందుకంటే ఎపిలో ఇసుక కొత్త విధానం తీసుకురావడానికి గాను కొద్దికాలం ఇసుక తవ్వకాలను ఆపితే..ఇంకేముంది.. రాష్ట్రంలో అభివృద్ది అంతా ఆగిపోయిందని ఇదే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటివారు ప్రచారం చేశారు. ఎవరు ఎలా చనిపోయినా దానిని ఇసుక లేకపోవడం వల్ల జరిగిన ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేశారు. ఆ విషయాలు అప్పట్లోనే సాక్ష్యాలతో సహా వెలుగులోక వచ్చాయి. తదుపరి ప్రభుత్వం ఇసుక విదానం తీసుకువచ్చి ప్రజలకు అందుబాటులో పెట్టి. కొంత నిర్దిష్ట రేటు పెడితే దానిపై కూడా విమర్శలు చేశారు. ఏడాదికి ఇప్పుడు 700 కోట్లకు పైగా ప్రభుత్వాన్ని ఆదాయం ఇసుక ద్వారా సమకూరుతోంది. అందరికి అందుబాటులో ఇసుక నిల్వలు ఉంచారు. గతంలో ఇలా ఎన్నడూ తేలికగా దొరికేది కాదు. అదే సమయంలో బలహీనవర్గాలవారి ఇళ్లకు ఉచితంగా ఇసుకను సరఫరా చేస్తున్నారు. ఇసుక తవ్వకాలు నిలిపినప్పుడు గగ్గోలు పెట్టిన ప్రతిపక్షం, ఇప్పుడు అందరికి ఇసుక అందుబాటులో తేవడంపైన ద్వజమెత్తుతోంది. ఇందులో అవినీతి ఉందని, తవ్వకాలు అక్రమంగా జరుగుతున్నాయని ఆరోపిస్తోంది.
ప్రభుత్వం నిర్దిష్ట విదానంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా టెండర్ పిలిచి ఒక సంస్థకు ఇసుక తవ్వకం, అమ్మకం బాధ్యతలు అప్పగించింది. ఆ సంగతి దాచిపెట్టి ఆ ప్రైవేటు సంస్థకు ఏదో నేరుగా జగన్ పిలిచి కాంట్రాక్టు ఇచ్చినట్లు చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. ఆయన కాకిలెక్కలు చూద్దాం.
✍️ నాలుగేళ్లలో ఇసుక పేరుతో నలభైవేల కోట్ల దోపిడీ జరిగిందని చంద్రబాబు అంటున్నారు. నలభై కోట్ల టన్నుల ఇసుకను అక్రమంగా తవ్వారని ఆయన అంటున్నారు. పోనీ కొద్ది సేపు దీనిని నిజం అని అనుకుంటే చంద్రబాబు గతంలో చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని అంగీకరిస్తారా?. ఏపీలో అసలు ఇసుకే దొరకడం లేదని, తద్వారా అభివృద్ది నిలిచిపోయిందని చెబుతూ వచ్చిన ఆయన ఇప్పుడు ఇబ్బడి,ముబ్బడిగా ఇసుక ఎపిలో దొరుకుతోందని చెప్పినట్లే కదా?ఆ మేరకు రాష్ట్రంలో భవన నిర్మాణం, ఇతర నిర్మాణ పనులు, అభివృద్ది జరుగుతున్నట్లు ఒప్పుకున్నట్లే అవుతుంది కదా?. అంతేకాదు. నిజంగానే నలభై కోట్ల టన్నుల ఇసుక నాలుగేళ్లలో తీసి ఉంటే, చంద్రబాబు పాలన ఐదేళ్లలో అసలు లెక్కాపత్రం లేకుండా సాగిన ఇసుక తవ్వకాలలో అంతమేర దోపిడీ జరిగినట్లు ఆయన చెప్పకనే చెబుతున్నారు కదా?
ఆ రోజుల్లో ఒకసారి పొరపాటున ఈనాడు పత్రిక లోపలి పేజీలో ఇసుక దోపిడీ ఎలా సాగుతోందో.. టీడీపీ ఎమ్మెల్యేల పేర్లు రాయకుండా ఇచ్చిన కథనాన్ని ఆయన ఒప్పుకున్నట్లే కదా?. అప్పట్లో ఎమ్మెల్యేలు ప్రైవేట్ టోల్ గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేశారా? లేదా?. డ్వాక్రా మహిళల పేరుతో ఇసుక రీచ్ లు తీసుకుని ,వారికి తృణమో,పణమో అప్పగించి మొత్తం ఇసుకను దోచేసిన మంత్రులు కూడా టిడిపి పాలనలో ఉన్నారు కదా?. ఆ అనుభవంతోనే చంద్రబాబు ఇప్పుడు మాట్లాడుతున్నారా? అప్పుడు అలా జరిగింది కనుక, ఇప్పుడు ఈ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే సరిపోతుందని అనుకుంటున్నారా?.
✍️ ఎక్కడైనా ఒకటి,అరా జరిగితే దాని గురించి ప్రతిపక్ష నేతగా విమర్శించడాన్ని ఎవరూ తప్పు పట్టరు. కాని అడ్డగోలు ఆరోపణలు చేయడం వల్ల ఆయన చెప్పేవాటికి విలువ లేకుండా పోతుంది కదా! ఇప్పటికే ఈనాడు వంటి పత్రికలు రాస్తున్న అడ్డగోలు కథనాలను ఎవరూ నమ్మడం లేదు. చంద్రబాబు పరిస్థితి అలాగే ఉంటుంది. చంద్రబాబు హయాంలో ఒక్క రూపాయి ప్రభుత్వానికి ఆదాయం రాకపోగా, టీడీపీ నేతలు ఇష్టానుసారం దోచుకున్న విషయాన్ని ఎవరూ మర్చిపోలేరు. చంద్రబాబు ఇప్పుడు కాకిలెక్కలు చెబుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఒక ఇసుక రీచ్ లో రోజుకు పదివేల టన్నుల ఇసుక తవ్వకం జరుగుతోందని ,దానిని స్వయంగా చూశానని ఆయన అంటున్నారు. దాని వెనుక వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఉన్నారని ఆయన ఆరోపించారు నిజానికి ఒక రీచ్లో రోజుకు పదివేల టన్నుల ఇసుక తీయడం ఎంతవరకు సాధ్యమో ఆయనకే తెలియాలి. అక్కడ పెద్ద కొండలా తీసి పోశారని ఆయన అన్నారు. అందులో తప్పు ఏమి ఉంది? వానాకాలంలో ఇబ్బంది రాకుండా ఉండడానికి ఇసుక నిల్వ చేస్తే నష్టం ఏమిటి?. నలభై కోట్ల టన్నులు, నలభైవేల కోట్ల రూపాయలు అంటూ చెబుతున్నవన్ని పిచ్చి లెక్కలే అని తేలిపోతోంది. ఈయనకు ఇది అలవాటే.
గతంలో జగన్ పై కక్ష కట్టి కేసులు పెట్టిన సందర్భంలో ఎంత ఆరోపణ చేయాలన్నదానిపై పార్టీలో చర్చ జరిగిందట. అప్పుడు మాజీ ఎంపీ మైసూరారెడ్డి రెండు,మూడువేల కోట్లు అందామని సూచించారట. దానికి నో చెప్పిన చంద్రబాబు ‘‘లక్ష కోట్లు’’ అని ఆరోపిస్తూ ప్రకటన చేయాలని అన్నారట. ఈ విషయాన్ని ఆ తర్వాత రోజుల్లో మైసూరానే టీవీ చర్చలలో చెబుతుండేవారు. ఇదే కాదు.. దేనినైనా అతిగా చెప్పడం , తన గురించి అతిశయోక్తులు చెప్పుకోవడం ఆయనకు అలవాటే. ఇప్పుడు అదే రీతిలో చంద్రబాబు మరోసారి ఇసుక పై ప్రజెంటేషన్ ఇచ్చినట్లుగా ఉంది. తద్వారా తన పాలనలో జరిగిన అక్రమాలన్నింటిని ఆయనే గుర్తు చేసినట్లు అనిపించడం లేదూ!
:::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment