సుష్మా వ్యాఖ్యలపై మండిపాటు
Published Mon, Sep 30 2013 12:51 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
కాకినాడలో సమైక్య రాష్ర్ట పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. ఎంపీలు పదవులకు రాజీనామా చేయక పోవడాన్ని నిరసిస్తూ ఉపాధ్యాయులు జెడ్పీ సెంటర్‌లో గుంజీలు తీసి నిరసన తెలిపారు. సమైక్య ఉద్యమంపై బీజేపీ అగ్రనేత సుష్మా స్వరాజ్ వ్యాఖ్యలకు నిరసనగా కాకినాడలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ర్యాలీగా వెళ్లి బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించారు. పార్టీ ఫ్లెక్సీలను ధ్వంసం చేసి, అగ్రనేతల బొమ్మలకు పేడ, మట్టి పూశారు.
కార్యాలయంలో ఉన్న బీజేపీ నాయకులు బయటకొచ్చి దుర్భాషలాడడంతో ఆగ్రహంతో కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. సీఐ జి.దేవకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకొని జేఏసీ జిల్లా చైర్మన్ బూరిగ ఆశీర్వాదం, కార్యదర్శి పితాని త్రినాథ్, ఉపాధ్యాయ జేఏసీ నేతలు కవిశేఖర్, ప్రదీప్‌కుమార్ సహా 100 మందిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించిన అనంతరం సొంత పూచీ కత్తుపై విడిచిపెట్టారు. రాజానగరంలో మహిళలు సుష్మా స్వరాజ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీజేపీ నేతలు పద్ధతి మార్చుకోకపోతే సీమాంధ్రలో తిరగనివ్వబోమంటూ అమలాపురంలో సమైక్యవాదులు ర్యాలీ చేశారు.
Advertisement
Advertisement