తిరుపతి : తిరుపతిలోని స్విమ్స్ యూనివర్సిటీ ప్రగతి పథంలో దూసుకుపోతూ, ప్రస్తుతం ఐదవ స్నాతకోత్సవానికి సిద్ధమైంది. మహతి వేదికగా సోమవారం స్విమ్స్ స్నాతకోత్సవం జరుగనుంది. రాయలసీమ ప్రజలకు మెరుగైన సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించేందుకు 1993 ఫిబ్రవరి 26న స్విమ్స్ ఆస్పత్రి ప్రారంభమైంది. 1995లో యూనివర్సిటీ హోదా పొంది 2003లో యూజీసీ, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు సాధించింది.
వైద్యం, విద్య, పరిశోధనల పరంగా అంచెలంచెలుగా ఎదిగి స్వతంత్ర ప్రతిపత్తి గలిగిన యూనివర్సిటీగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం స్విమ్స్ యూనివర్సిటీలో ఎం డీ, డీఎం, ఎంసీహెచ్ వంటి 60 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సుమారు 195 మంది నిష్ణాతులైన అధ్యాపకులు(ఫ్యాకల్టీ డాక్టర్లు) ఉన్నారు. స్విమ్స్‌కు అనుబంధంగా నర్సింగ్, ఫిజియోథెరపీ కళాశాలలు పనిచేస్తున్నాయి. డయాబెటాలజీ, బ్లడ్ బ్యాంకింగ్ అండ్ ట్రాన్స్‌ఫ్యూజన్ టెక్నాలజీ తదితర సర్టిఫికెట్ కోర్సులు, న్యూరో అండ్ కార్డియక్ ఆనస్తీషియా, గ్యాస్ట్రో ఎంటరాలజీ తదితర విభాగాలకు సంబంధించి డిప్లొమో కోర్సులు స్విమ్స్‌లో అందుబాటులో ఉన్నాయి.
టీటీడీ నిర్వహణలోని బాలాజీ ఆరోగ్యవరప్రసాదిని, ప్రాణదాన పథకాల ద్వారా రాయితీలు, కొన్ని సందర్భాల్లో ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న స్విమ్స్‌కు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక్కడ ఇప్పటి వరకు ఐదు కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు విజయవంతంగా జరిగాయి. సీటీ సర్జరీ, కార్డియాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, ఆంకాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, యూరాలజీ, మెడిసిన్ తదితర విభాగాలు పటిష్టంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్విమ్స్‌కు అనుబంధంగా శ్రీపద్మావతి మహిళా మెడికల్ కళాశాల కూడా మంజూైరై ఈ విద్యాసంవత్సరం నుంచి అడ్మిషన్లు, బోధన ప్రారంభించారు.
స్నాతకోత్సవంలో ఏడుగురికి మెడల్స్ ప్రదానం
తిరుపతి కార్పొరేషన్ : స్విమ్స్ యూనివర్సిటీ 5వ స్నాతకోత్సవంలో ఏడుగురికి మెడల్స్, నలుగురికి మెరిట్ సర్టిఫికెట్లు ఇవ్వనున్నారు. వీరికి సోమవారం తిరుపతి మహతి కళాక్షేత్రంలో నిర్వహించే స్నాతకోత్సవంలో వీటిని ప్రదానం చేయనున్నట్టు స్విమ్స్ డెరైక్టర్, వైస్‌చాన్స్‌లర్ డాక్టర్ బి.వెంగమ్మ ఆదివారం తెలిపారు. స్విమ్స్ యూనివర్సిటీలో వివిధ సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన బెస్ట్ ఔట్‌గోయింగ్ స్టూడెంట్స్ మొత్తం 11 మందికి మెడ ల్స్, మెరిట్ సర్టిఫికెట్లను అందిస్తామన్నారు. వీరితో పాటు వివిధ కోర్సుల్లో బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్స్‌కు మెరిట్ సర్టిఫికెట్లు ఇవ్వనున్నట్టు తెలిపారు.
స్విమ్స్ స్నాతకోత్సవానికి విశిష్ట అతిథి
తిరుపతి: తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సోమవారం జరిగే స్విమ్స్ 5వ స్నాతకోత్సవానికి పద్మవిభూషణ్ గ్రహీత, మణిపాల్ యూనివర్సిటీకి చెందిన జాతీయ పరిశోధనాచార్యులు డాక్టర్ మార్తాండ వర్మ శంకరన్ వలియాతన్ విశిష్ట అతిథిగా హాజరు కానున్నట్టు స్విమ్స్ డెరైక్టర్, వైస్ చాన్స్‌లర్ డాక్టర్ బి.వెంగమ్మ తెలిపారు. దేశంలోని ప్రముఖ మేధావుల్లో ఒకరైన మార్తాండ వర్మ కేరళ యూనివర్సిటీలో మెడిసిన్ పట్టభద్రులై, యునెటైడ్ కింగ్‌డమ్‌లో సర్జరీలో శిక్షణ పొందారని గుర్తుచేశారు. ఆపై యునెటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కార్డియాక్ సర్జరీ స్పెషలైజేషన్‌లో ప్రావీణ్యం పొందారని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో చండీఘర్, వాషింగ్‌టన్‌లలో బయోమెడికల్ ఇంజనీరుగా ఆయన విశిష్ఠమైన సేవలు అందించారని గుర్తుచేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో గౌరవ పురస్కారాలు అందుకున్న మార్తాండ వర్మను భారత ప్రభుత్వం 2005లో పద్మవిభూషణ్ పురస్కారంతో గౌరవించిందని అన్నారు. అంతటి గొప్ప వ్యక్తి స్విమ్స్ 5వ స్నాతకోత్సవానికి విశిష్ట అతిథిగా హాజరై స్నాతకోపన్యాసం ఇస్తుండటం గొప్ప విషయమని వెంగమ్మ తెలిపారు.
ప్రగతి పథంలో స్విమ్స్
Published Mon, Oct 13 2014 3:16 AM | Last Updated on Sat, Sep 2 2017 2:44 PM
Advertisement
Advertisement