శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం 15వ స్నాతకోత్సవాన్ని ఈనెల 27వ తేదీ నిర్వహిస్తున్నట్టు వర్సిటీ వీసీ రత్నకుమారి తెలిపారు.
తిరుపతి: శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం 15వ స్నాతకోత్సవాన్ని ఈనెల 27వ తేదీ నిర్వహిస్తున్నట్టు వర్సిటీ వీసీ రత్నకుమారి తెలిపారు. మహిళా యూనివర్సిటీలోని సెనేట్ హాల్‌లో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత స్నాతకోత్సవం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (హైదరాబాద్) డెరైక్టర్ ఎం.లక్ష్మీకాంతంకు గౌరవ డాక్టరేట్ ఇస్తున్నామన్నారు. ఆమె స్నాతకోపన్యాసం చేస్తారని చెప్పారు.
గవర్నర్ నరసింహన్ ఈ కార్యక్రమానికి హాజరై చాన్సలర్ హోదాలో డిగ్రీలు ప్రదానం చేస్తారన్నారు. ఈ సందర్భంగా 1,948 మందికి వివిధ రకాల డిగ్రీలు ఇస్తున్నామని తెలిపారు. 71 మందికి బంగారు పతకాలు, 13 మందికి బుకే ప్రైజ్‌లు, 13 మందికి నగదు బహుమతులు, 117 మందికి పీహెచ్‌డీలు, 986 మందికి పీజీలు, 588 మందికి డిగ్రీలు, 242 మందికి దూరవిద్య డిగ్రీలు, ఎంఫిల్ డిగ్రీలు 15 మందికి ఇస్తున్నామన్నారు. ఈ ఏడాది నుంచి ఎంకాం, ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ కోర్సులు ప్రవేశపెట్టినట్టు వీసీ పేర్కొన్నారు.