సాక్షి, గుంటూరు : జిల్లాలో స్వైన్‌ఫ్లూ మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా ఆదివారం గుంటూరు ఐడీహెచ్‌లో బెల్లంకొండ మండలం ఎమ్మాజీగూడెంకు చెందిన తురకా ముసలయ్య(35)అనే యువకుడు మృతి చెందాడు. కొద్ది రోజుల కిందట వినుకొండ మండలం ఉమ్మడివరం గ్రామానికి చెందిన దివ్వెల ఆంజనేయులు(33) అనే యువకుడు ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురికి ఈ వ్యాధి ఉన్నట్టు నిర్ధారణ అయింది. దీనికి సంబంధించి గుంటూరులోని ప్రభుత్వ జ్వరాల ఆసుపత్రిలో స్వైన్‌ఫ్లూ వార్డు ఏర్పాటు చేసినా వ్యాధి నిర్ధారణ పరికరాలు లేవు.
అనుమానిత వ్యక్తుల శాంపిల్ తీసుకుని హైదరాబాద్‌లోని ఇండియన్ ప్రివెంటివ్ మెడి సిన్ ల్యాబ్(ఐపీఎం)కు పంపుతున్నారు. దీంతో నాలుగు రోజులకుగానీ వ్యాధి లక్షణాలు ఉన్నాయా లేదా అనేది తెలియడం లేదు. ఈ లోపు రోగి, రోగి కుటుంబ సభ్యులు, బంధువులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదిలావుంటే, నవ్యాంధ్ర జిల్లా కేంద్రంలో స్వైన్‌ఫ్లూ నిర్ధారిత సెంటర్ లేకపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
జిల్లాలో 16 స్వైన్‌ఫ్లూ అనుమానిత కేసులు...
జిల్లాలో ఇప్పటి వరకు 16 మంది స్వైన్‌ఫ్లూ అనుమానంతో గుంటూరు నగరంలోని ప్రభుత్వ జ్వరాల ఆసుపత్రికి వచ్చారు. వారికి చికిత్స అందించడం తోపాటు వ్యాధి నిర్ధారణ కోసం శాంపిల్స్‌ను హైదరాబాద్ లోని ఐపీఎంకు పంపాం. వారిలో ఏడుగురికి వ్యాధి లక్షణాలు ఉన్నట్లు నిర్ధారణ అయింది.
నరసరావుపేట నవోదయ కాలనీకి చెందిన రాగా అఖిల,మరో యువకుడికి స్వైన్‌ఫ్లూ నిర్ధారణ అయి చికిత్స పొందుతుండగా, బెల్లం కొండ మండలం ఎమ్మాజీగూడెం గ్రామానికి చెందిన తురకా ముసలయ్య(35) అనే యువకుడు మృతి చెందాడు. గతంలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన నాగమణి(45) అనే మహిళ ఇక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. మరో ముగ్గురు పూర్తిగా కోలుకోవడంతో వారి ఇళ్లకు పంపించాం.
- డాక్టర్ రాజేంద్రకుమార్, ఐడీహెచ్ సూపరింటెండెంట్, గుంటూరు
స్వైన్ ఫ్లో..!
Published Tue, Feb 24 2015 1:51 AM | Last Updated on Sat, Sep 2 2017 9:47 PM
Advertisement
Advertisement