సాక్షి, విశాఖపట్నం: మహమ్మారి స్వైన్‌ఫ్లూతో విశాఖలో గత రెండు రోజుల్లో ముగ్గురు మృతి చెందినట్లు సమాచారం. కొన్నాళ్ల నుంచి నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వీరి పరిస్థితి విషమించడంతో మరణించినట్టు తెలిసింది. అయితే వీరు విశా ఖ జిల్లాకు చెందిన వారు కాదని, ఇతర జిల్లాల వారై ఉండవచ్చని వైద్యారోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. రెండ్రోజులక్రితం తమ ఆస్పత్రిలో చేరిన స్వైన్‌ఫ్లూ రోగి ఒకరు మరణించినట్టు ప్రభుత్వ ఛాతి, అంటువ్యాధుల ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి. సాంబశివరావు ‘సాక్షి’కి చెప్పారు. కాగా మంగళవారం స్వైన్‌ఫ్లూ లక్షణాలతో ఓ రోగి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడని, అక్కడ చికిత్స అందుతోందని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ ఎస్.తిరుపతిరావు తెలిపారు. ప్రస్తుతం విశాఖలో స్వైన్‌ఫ్లూతో ప్రభుత్వ ఛాతి, అంటువ్యాధుల ఆస్పత్రిలో ఒకరు, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇద్దరు చికిత్స పొందుతున్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment