పెదవాల్తేరు(విశాఖ తూర్పు): నగరంలో స్వైన్ ఫ్లూ మళ్లీ విజృంభిస్తోంది. నగరవాసులను హడలెత్తిస్తోంది. చలికాలం కావడంతో స్వైన్‌ఫ్లూ అధికంగా సోకే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకుతగ్గట్టుగానే చినవాల్తేరులో గల ప్రభుత్వ టీబీ ఆస్పత్రిలో బుధవారం ఒకే రోజు ముగ్గురు రోగులు చేరడం కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు మొత్తం ఐదుగురు చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరు గురువారం డిశ్చార్చి అయ్యారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ముగ్గురికీ పాజిటివ్‌గా రిపోర్టు వచ్చిందని వైద్యులు చెప్పారు. ఇక గత ఏడాది జిల్లాలో 8 మంది స్వైన్‌ఫ్లూ లక్షణాలతో చనిపోవడం తెలిసిందే. కేజీహెచ్‌లో ప్రస్తుతం రోగులు ఎవరూ లేరని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తిరుపతిరావు ‘సాక్షి’తో మాట్లాడుతూ ఆర్టీసీ బస్టాండ్లలో సెంటర్లు కొనసాగిస్తున్నామని తెలిపారు. నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్సు, రైల్వేస్టేషన్‌లో సెంటర్లు ఉన్నాయని తెలిపారు. స్టికర్లు, హోర్డింగుల ద్వారా విస్త్రతంగా ప్రచారం చేస్తున్నామన్నారు. టీబీ ఆస్పత్రిలో ముగ్గురు, ప్రైవేట్ ఆస్పత్రులలో ఐదుగురు చికిత్స పొందుతున్నారని తెలిపారు.
ఎయిర్‌పోర్టులో కానరాని స్క్రీనింగ్ సెంటర్
రైల్వేస్టేషన్‌లో జ్ఞానాపురం వైపు ప్రవేశమార్గం వద్ద స్క్రీనింగ్ సెంటర్ లేకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అలాగే ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి సందర్శకులు, పర్యాటకులు అధికసంఖ్యలో వచ్చే ఎయిర్‌పోర్టులో స్క్రీనింగ్ సెంటర్ లేకపోవడం గమనార్హం. అక్కడ పరీక్షలు లేకపోవడంతో వారి ద్వారానే నగరవాసులకు స్వైన్‌ఫ్లూ సోకుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంత జరుగుతున్నా సరే వైద్య – ఆరోగ్యశాఖ అధికారులు కనీసం స్పందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పత్రికా సమావేశం కాదు కదా... కనీసం హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేయడం లేదని నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment