
సాక్షి కడప/కడప రూరల్ : ఎప్పుడూ లేని విధంగా.. ఎన్నడూ చూడని విధంగా కొత్త కొత్త వ్యాధులు ప్రజలను భయకంపితులను చేస్తున్నాయి. స్వైన్ ఫ్లూ వ్యాధి రెండు, మూడేళ్ల నుంచి రాష్ట్రాన్ని వణికిస్తోంది. తాజాగా ప్రొద్దుటూరుకు చెందిన 42 ఏళ్ల వ్యక్తి ఈనెల 13న కర్నూలు సర్వజన వైద్యశాలలో మృతి చెందారు. ఈ ఏడాది జులైలో జమ్మలమడుగుకు చెందిన ఒక మహిళ హైదరాబాదులోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. గత ఏడాది కూడా జిల్లా వైద్య ఆరోగ్యశాఖను స్వైన్‌ఫ్లూ భయపెట్టిందనే చెప్పవచ్చు. చిత్తూరు జిల్లాతోపాటు సరిహద్దు ప్రాంతాల్లో స్వైన్‌ఫ్లూ కేసులు కనిపిస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది.
2017లోనూ భారీగా కేసులు నమోదు
జిల్లాలో గత ఏడాది స్వైన్‌ఫ్లూ కేసులు భారీగా నమోదయ్యాయి. తెలంగాణ, కేరళతోపాటు రాష్ట్రంలోని వైఎస్సార్ జిల్లాలో కూడా స్వైన్‌ఫ్లూ ఎక్కువగానే కనిపించింది. వైద్య ఆరోగ్యశాఖ అధికారిక లెక్కల ప్రకారం 50 కేసులు నమోదయ్యాయి. కొంతమంది రిమ్స్‌లోని ప్రత్యేక వార్డులో, మరికొంతమంది తిరుపతి స్విమ్స్, బెంగళూరు, హైదరాబాదులలో చికిత్స పొందారు. అనధికారికంగా కూడా ఎర్రగుంట్ల పరిధిలోని చిలంకూరులో చిరు వ్యాపారం చేసుకొనే 45 సంవత్సరాల ఒక వ్యక్తి ఈ వ్యాధి కారణంగా చనిపోయాడు. దీంతో ఆ గ్రామస్తులు భయపడి అతని మృత దేహన్ని గ్రామంలోకి రానీయలేదు. ఈ నేపథ్యంలో అధికారులు రంగప్రవేశం చేయాల్సివచ్చింది. ప్రొద్దుటూరులోని విజయనగరం వీధికి చెందిన ఒక ప్రభుత్వ ఉద్యోగి బెంగళూరులో చికిత్స పొందుతూ మరణించారు. వీరిద్దరూ వైద్య ఆరోగ్యశాఖ జాబితాలో లేరు. వ్యాధి సోకి చనిపోయినప్పటికీ అనధికారికంగానే చెప్పుకోవాల్సి వస్తోంది. అంతకు ముందు జనవరిలో ఓబులవారిపల్లె మండలం చిన్నఓరంపాడు గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు మరణిం చింది.. ఈమె ఒక్కరే స్వైన్‌ఫ్లూ బారిన పడి చనిపోయినట్లు అధికారుల లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.
సరిహద్దుల్లో అలజడి
వైఎస్సార్ జిల్లా ఆనుకుని ఉన్న చిత్తూరు జిల్లాలో స్వైన్‌ఫ్లూ కలవరపెడుతోంది. ఇప్పటివరకు 11 మంది వ్యాధికి గురికాగా వారందరూ వివిధ ఆస్పత్రుల్లో కోలుకుంటున్నారు. ఒక వ్యక్తి స్వైన్‌ఫ్లూతో మరణించినట్లు అక్కడి అధికారులు పేర్కొంటున్నారు. జిల్లా సరిహద్దులోని చిత్తూరుకు ఇవతలపక్క ఉన్న ప్రాంతాల్లో స్వైన్‌ఫ్లూ కనిపిస్తుండడంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
హెచ్ 1, ఎన్ 1 వైరస్ కారణంగా...
ఈ వ్యాధికి దోమలతో ఎలాంటి సంబంధంలేదు. గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుంది. అంటే ఇది అంటు వ్యాధి లాంటిది. ఇది హెచ్ 1, ఎన్ 1 వైరస్ గాలి ద్వారా ప్రయాణించి వ్యాప్తి చెందుతుంది. గతంలో ఈ వ్యాధికి సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు సీజన్‌గా ఉండేది. ఇప్పుడా పరిస్థితిలేదు. ఏడాది పొడుగునా సీజన్‌గా మారింది. పరిసరాల అపరిశుభ్రత, వాతావరణంలో అనూహ్యంగా చేసుకుంటున్న మార్పులు ఇవన్నీ వైరస్‌కు వరంగా మారాయి. ఫలితంగా ప్రజలు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. గతంలో ఈ వైరస్ పందుల ద్వారా సంక్రమించేది. అనగా ‘స్వైన్’అంటే పంది ‘ఫ్లూ’అంటే జలుబు. ఇప్పుడా పరిస్థితి మారింది. పందుల స్థానాన్ని మనుఘలు ఆక్రమించారు. అంటే తుమ్ములు, దగ్గుల ద్వారా ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది.
అందుబాటులో మందులు...
జిల్లా వ్యాప్తంగా కడప రిమ్స్‌తో పాటు వైద్య ఆరోగ్య శాఖలో 75 పీహెచ్‌సీలు, 11 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, వైద్య విధాన పరిషత్‌లో 14 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు పనిచేస్తున్నాయి.వ్యాధిని నిర్ధారించన తరువాత వైద్యఆరోగ్యశాఖ అధికారులు ఉచితంగా ఖరీదైన మందులను అందుబాటులో ఉంచారు. వ్యాధి తీవ్రతను బట్టి ‘ట్యామీ ఫ్లూ’మాత్రలను వాడుతారు. ఆ మేరకు పెద్దలకు 75 ఎంజీ, చిన్న పిల్లలకు 30 ఎంజీ, చిన్నారులకు సిరప్‌ను అందిస్తారు. అలాగే పీపీ కిట్స్ (పర్సనల్ ప్రొటక్షన్ ఎక్విప్‌మెంట్) ఉన్నాయి.
వ్యాధి లక్షణాలు...
జలుబు, దగ్గు ఉంటుంది. జ్వరం తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది. ఒళ్లు నొప్పులు ఉంటాయి.ఊపిరి తిత్తుల్లో నెమ్ము చేరుతుంది. వాంతులు, విరేచనాలు అవుతాయి.
ఎవరికి సోకే అవకాశం ఉందంటే...
65 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, 5 సంవత్సరాల లోపు చిన్నారులు, గర్భిణులు, ఘగర్, బీపీ, గుండె, కిడ్నీ తదితర దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన వారికి, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి ఈ వ్యాధి సోకే అవకాశం ఉంటుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు...
తుమ్మినా, దగ్గినా ముఖానికి చేతి రుమాలును అడ్డం పెట్టుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి. అనారోగ్య సమస్యలు తలెత్తితే వైద్యులను సంప్రదించాలి.
మందులను సిద్ధం చేశాం
ఈ వ్యాధిపై ఎలాంటి ఆందోళన అవసరంలేదు.అవగాహన పెంచుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి.కర్నూలు ఆసుపత్రిలో చనిపోయిన వ్యక్తికి టీబీ ఉంది. ఇతనికి స్వైన్‌ఫ్లూ పాజిటివ్ వచ్చినా దీర్ఘకాలికంగా టీబీవ్యాధి బాధిస్తోందని, దానితోనే చనిపోయాడన్నారు. ముం దు జాగ్రత్తగా స్వైన్‌ఫ్లూ వ్యాధికి సంబంధించిన మందులను సిద్ధం చేశాం. ప్రభుత్వ హాస్పిటల్స్‌లో వైద్య సదుపాయాన్ని ఉచితంగా పొందవచ్చు. నిర్ధారణకు పరీక్షలు మాత్రం రిమ్స్‌లో చేస్తారు.
– డాక్టర్ ఉమా సుందరి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి
జిల్లాలో స్వైన్ ఫ్లూ కేసుల నమోదు వివరాలు
సంవత్సరం కేసులు
2012 03
2013 01
2014 02
2015 19
2016 03
2017 50
2017లో అధికారుల లెక్కల ప్రకారం ఒకరు మృతి చెందగా అనధికారికంగా మరో ఇద్దరు మృతి చెందారు. 2018 జనవరి నుంచి ఇప్పటి వరకు ఒక్కరు మృతి చెందారు.