
ఏ ముఖంతో మళ్లీ వచ్చావ్?
‘‘రాష్ట్రాన్ని, కాంగ్రెస్ పార్టీని నాశనం చేసిన నువ్వు ఏ ముఖం పెట్టుకుని మళ్లీ ఇక్కడికి వచ్చావ్?’’ కేంద్ర ఆరోగ్య మంత్రి గులాంనబీ ఆజాద్‌ను నిలదీస్తూ పీసీసీ కార్యదర్శి టి.నిరంజన్ చేసిన వ్యాఖ్యలివి.
సాక్షి, హైదరాబాద్: ‘‘రాష్ట్రాన్ని, కాంగ్రెస్ పార్టీని నాశనం చేసిన నువ్వు ఏ ముఖం పెట్టుకుని మళ్లీ ఇక్కడికి వచ్చావ్?’’ కేంద్ర ఆరోగ్య మంత్రి గులాంనబీ ఆజాద్‌ను నిలదీస్తూ పీసీసీ కార్యదర్శి టి.నిరంజన్ చేసిన వ్యాఖ్యలివి. బుధవారం గాంధీభవన్‌కు వచ్చిన నిరంజన్.. ఆజాద్‌ను చూడగానే ఆవేశానికి లోనై ‘‘మీ వల్ల కాంగ్రెస్ పార్టీ సర్వనాశనమవుతోంది. మాబోటి కార్యకర్తలను పట్టించుకోవడమే మానేశారు. పదేళ్లుగా నామినేటెడ్ పదవులిస్తామని ఆశ చూపుతున్నారే తప్ప ఇప్పటి వరకు ఆ పనిచేయలేదు.
ఈ లోపు నువ్వు రెండుసార్లు రాష్ట్ర ఇన్‌చార్జ్‌గా ఎంజాయ్ చేసి పోయావ్ ’’ అని మండిపడ్డారు. ఈ పరిణామంతో ఆజాద్ తెల్లమొహం వేయగా, అక్కడున్న వాళ్లంతా విస్తుబోయారు. ‘‘రాష్ట్ర ఇన్‌చార్జ్‌గా ఉన్నంత కాలం నువ్వు (ఆజాద్‌ను ఉద్దేశించి) పీసీసీ సమన్వయ కమిటీ చైర్మన్‌గా ఉన్నావ్ కదా! నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని సీఎంను ఎందుకు ఆదేశించలేకపోయావ్? ఇక కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తదనే ఆశ కూడా చచ్చిపోయింది. మేం ఇప్పుడు ముసలోళ్లమైపోతిమి. రాహుల్ ఏమో యువకులకే పెద్దపీట వేస్తున్నామని చెబుతుంటే రేపు మాకు పదవులిచ్చేదెవరు? మీకంటే బొత్సనే చాలా నయం. తన చేతిలో ఉన్నంత మేరకు కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శుల పదవులన్నీ నాయకులకు ఇచ్చిండు. మీ సీఎం కనీసం విశ్వవిద్యాలయాల పాలక మండళ్లను కూడా భర్తీ చేయలేని దౌర్భాగ్యుడిగా మారాడు’’ అని ఆవేశంతో ఊగిపోతూ మాట్లాడారు.