పురపాలన..పడుతుందా గాడిన!
Published Sun, Jan 26 2014 2:28 AM | Last Updated on Tue, Oct 16 2018 6:44 PM
సాక్షి, ఏలూరు:ఎన్నో ఏళ్లుగా ప్రజా శ్రేయస్సును పక్కన పెట్టేసిన ప్రభుత్వానికి ఎన్నికల భయం పట్టుకుంది. నగరాలు, పట్టణాల్లో ఓట్లను రాబట్టుకోవడానికి ఇప్పటినుంచే ఎత్తుగడలు వేస్తోంది. దానిలో భాగంగా పురపాలక శాఖలో రోజుకో మార్పు తీసుకువస్తోంది. నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేసి వాటిని ప్రక్షాళన చేయడానికే ఈ మార్పులు అంటూ చెప్పుకొస్తోంది. ఇది రాజకీయ, నాయకుల స్వప్రయోజ నాలను దృష్టిలో ఉంచుకుని చేస్తున్న ప్రయత్నాలనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇవేమీ తమకు అవసరం లేదనుకుంటున్న ప్రభుత్వం తాజాగా సిబ్బందిపై ఉన్నతాధికారుల కర్రపెత్తనానికి ముందుకు కదులుతోంది.
కుంటుపడిన అభివృద్ధి
ఏలూరు నగరపాలక సంస్థకు రూ.వంద కోట్లకు పైగా బడ్జెట్ ఉంది. భీమవరం,నిడదవోలు, తణుకు, పాలకొల్లు, కొవ్వూరు, నరసాపురం, తాడేపల్లిగూడెం పురపాలక సంఘాల బడ్డెట్ రూ.30 కోట్లు దాటిపోతోంది. ఇటీవలే ఈ జాబితాలో జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ చేరింది. బడ్జెట్ భారీగా ఉంటున్నా అభివృద్ధి మాత్రం ఆ స్థాయిలో ఎక్కడా కనిపించదు. జిల్లాలోని ఏకైక నగరపాలక సంస్థ, జిల్లా ఉన్నతాధికారుల నిలయమైన ఏలూరులో ప్రధాన రహదారులు, డ్రెరుున్లను చూస్తే పాలన ఎంత అద్వానంగా ఉందో ఇట్టే అర్థమవుతుంది. మునిసిపాలిటీల్లో పార్కుల నిర్వహణ దగ్గర్నుంచి వీధి దీపాలు, తాగునీటి సరఫరా, పారిశుధ్యం.. ఇలా ఏది చూసినా సమస్యల వలయంలోనే ఉన్నాయి. దీనికి కారణం పురపాలక వర్గాలకు ఎన్నికలు జరగకపోవడమే.
మూడేళ్లుగా ప్రత్యేకాధికారుల పాలనే
2010 సెప్టెంబర్‌తో నగరపాలక, పురపాలక సంఘాలకు గడువు ముగిసింది. దీంతో ప్రత్యేకాధికారులను నియమించి అప్పటినుంచీ ప్రతి ఆరు నెలలకోసారి పొడిగిస్తూ వస్తున్నారు. ప్రత్యేకాధికారులు పాలనను పట్టించుకున్నదే లేదు. ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో కమిషనర్లే వ్యవహారాలను నడిపిస్తున్నారు. పాలకవర్గాలు లేకపోవడంతో కమిషనర్లపై అటు పరిపాలన, ఇటు నిర్వహణ భారం పడింది. దీంతో పలుచోట్ల ప్రజలకు సేవలు అందడం లేదు. అభివృద్ది కుంటుపడింది. ఇప్పుడున్న పరిస్థితిని ఇలాగే కొనసాగిస్తూ ఎన్నికలకు వెళితే ఘోరపరాభవం తప్పదని కాంగ్రెస్ ప్రభుత్వానికి అర్థమైంది.
గాడినపెట్టే ప్రయత్నం
ప్రజల్లో వెల్లువెత్తుతున్న వ్యతిరేకతను తగ్గించడానికి ఎన్నికలు వచ్చేలోగానే నగర, పురపాలనను గాడిన పెట్టాలని పురపాలక శాఖ భావిస్తోంది. అందులో భాగంగా ముందుగా ఉద్యోగుల్లో మార్పులకు శ్రీకారం చుట్టింది. కమిషనర్ల అధికారాలను పరిమితం చేస్తూ వారి పనితీరును పర్యవేక్షించేందుకు, అవసరమైతే వారిపై చర్యలు తీసుకునేందుకు మునిసిపల్ రీజినల్ డెరైక్టర్ స్థాయి అధికారులకు అధికారాలను కట్టబెట్టింది.దీనికి సంబంధించి పురపాలక శాఖ బి.జనార్ధనరెడ్డి నుంచి వచ్చిన మౌఖిక ఆదేశాలు మినహా అధికారిక జీవో ఏదీ విడుదల చేయకపోవడం గమనార్హం. పర్యవేక్షణ చేస్తున్నమాట వాస్తవమేనని, ఆర్థిక వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి సారించామని, అయితే దానికి ఎటువంటి లిఖిత పూర్వక ఆదేశాలు రాలేదని మునిసిపల్ రీజినల్ డెరైక్టర్ (రాజమండ్రి రీజియన్) రవీంద్రబాబు ‘సాక్షి’కి చెప్పారు.
కమిషనర్లపై కర్రపెత్తనం
సంక్షేమ పథకాల అమలులో కిందిస్థాయి సిబ్బంది అలసత్వం వహించినా ఇకనుంచి కమిషనర్లనే బాధ్యుల్ని చేస్తారు. కమిషనర్లు ఇకముందు తాత్కాలిక ఉద్యోగులకు ఎటువంటి రుణాలూ మంజూరు చేయకూడదు. ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి ఇచ్చే భవిష్య నిధిని జమ చేయడంలో జాప్యం జరగకుండా చేసుకోవాలి. ఆర్థిక వ్యవహారాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కుదరదు. జమా ఖర్చులు కచ్చితంగా ఉండాలి. దీనిని మీరితే మునిసిపల్ రీజనల్ డెరైక్టర్ వారిపై చర్యలు తీసుకుంటారు. దీంతో ఏ పనిచేయాలన్నా కమిషనర్లు భయపడే పరిస్థితి వచ్చింది. చెత్తపై కొత్త సమరం పేరుతో వంద రోజుల కార్యక్రమాన్ని చేస్తున్నారు. వీధి వ్యాపారాలలు చేసే వారెందరు, ఇల్లు లేనివారెందరు, మునిసిపల్ ఆస్తులు ఎక్కడున్నాయ్, ఎన్ని ఉన్నాయ్, అనధికార కట్టడాల సర్వే, పెండింగ్ కోర్టు కేసులపై ప్రత్యేక దృష్టి వంటి తలకు మించిన భారంతో కమిషనర్లు ఉంటే నిధుల దుర్వినియోగం, అవినీతిలో కిందిస్థాయి సిబ్బంది తలమునకలై ఉంటున్నారు. ఆంక్షల వల్ల అవినీతి తగ్గుతుందని ప్రభుత్వం చెబుతోంది.
Advertisement