ఇసుక అక్రమ రవాణాను అరికట్టండి
నెల్లూరు(రెవెన్యూ): జిల్లాలో గుర్తించిన రీచ్‌ల నుంచి ఇసుక అక్రమ రవాణా కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎం. జానకి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం తన చాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. మీ-సేవ కేంద్రాల ద్వారా ఈ నెల 5 నుంచి ఇసుక విక్రయాలు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వేబిల్లులు లేకుండా ఇసుక రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు.
రాత్రి సమయాల్లో రీచ్‌లలో ఇసుక రవాణా చేస్తే సంబంధిత వ్యక్తులపై చర్చలు తీసుకుంటామని హెచ్చరించారు. రీచ్‌ల వద్ద ప్రత్యేక సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి నిత్యం ఇసుక రీచ్‌లను పరిశీలించేలా సంబంధిత తహశీల్దార్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతక ముందు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మణం, పుట్టంరాజువారికండ్రిగ అభివృద్ధి తదితర కార్యక్రమాలపై వివిధ మండలాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జేసీ జి.రేఖారాణి, డీఆర్‌డీఏ పీడీ చంద్రమౌళి, డ్వామా పీడీ ఎం.గౌతమి, హౌసింగ్ పీడీ వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.
పీఆర్‌కండ్రిగను ఆదర్శంగా తీర్చిదిద్దండి
క్రికెట్ దేవుడు, రాజ్యసభ సభ్యుడు సచిన్‌టెండూల్కర్ దత్తత తీసుకున్న పుట్టంరాజు వారి కండ్రిగను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జానకి సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం తన చాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. రోడ్లు, మరుగుదొడ్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
గ్రీవెన్స్ డేకు 9.30కే హాజరు కావాలి
కలెక్టరేట్‌లో నిర్వహించే గ్రీవెన్స్‌డేకు అధికారులందరూ ఉదయం 9.30 గంటలకే హాజరుకావాలని కలెక్టర్ ఎం.జానకి సూచించారు. సోమవారం గ్రీవెన్స్ డే హాల్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఉదయం 9.30 గంటలకు వస్తే గత వారం గ్రీవెన్స్‌లో వచ్చిన అర్జీలపై చర్చించనున్నట్లు తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన వినతులు ఎన్ని పరిష్కరించారో అవి ఏ స్థితిలో ఉన్నాయే తదితర వివరాలు ప్రతి వారం అందజేయాలన్నారు.
సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయల చుట్టూ ప్రజలను తిప్పించుకోకుండా వారి సమస్య పరిష్కారం అవుతుందా కాదా.. తదితర వివరాలు వారికి తెలియజేయలన్నారు.