
'రాజధాని ఏర్పాటుపై తొందరగా నిర్ణయం'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు భరోసాయిచ్చారు. ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్‌ను మొదటి సంవత్సరం కేంద్రమే భరిస్తుందని చెప్పారు. రాజధాని ఏర్పాటుపై తొందరగా నిర్ణయం తీసుకుంటే అంత మంచిదని అభిప్రాయపడ్డారు. పోలవరంపై సందేహం అక్కర్లేదన్నారు. విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. విజయవాడ -గుంటూరు- తెనాలి మధ్య మెట్రో రైల్‌కు సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు.
రేపు పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగం ఉంటుందన్నారు. 10,11 తేదీల్లో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ఉంటుందని చెప్పారు. పార్లమెంట్ చర్చ అనంతరం రెండు సభల్లో రాష్ట్రపతి ప్రసంగంపై ప్రధాని సమాధానాలిస్తారని తెలిపారు. పార్లమెంట్‌లో ప్రతిపక్ష హోదా కోసం కూటమిగా ఏర్పాడాలని కొన్ని పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయని వెల్లడించారు. ఏ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్నదానిపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని వెంకయ్య నాయుడు చెప్పారు.