ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయండి
కలెక్టర్లు, ఎస్పీల వీడియో కాన్ఫరెన్స్‌లో సీఈవో భన్వర్‌లాల్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లూ పకడ్బందీగా చేయాలని అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) భన్వర్‌లాల్ ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్లపై ఆయన సోమవారం సాయంత్రం సీమాంధ్రలోని 13 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఎన్నికల నియమావళి విషయంలో కఠినంగా వ్యవహరించాలని, ఈ విషయంలో అధికారులు, ఉద్యోగులు గీత దాటితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎండలను దృష్టిలో పెట్టుకుని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు తాగునీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. అలాగే వరండాలు లేని పోలింగ్ కేంద్రాల ఎదుట క్యూలైన్లలో ఉండే ఓటర్లకోసం షామియానాలు ఏర్పాటు చేయాలని భన్వర్‌లాల్ ఆదేశించారు.