కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో ఈ నెల 28వ తేదీ సోమవారం 6 గంటలకు ఎన్నికల ప్రచారాన్ని ముగించాలని రాజకీయ పార్టీలకు, పోటీ చేసే అభ్యర్థులకు రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్లపై ఆయన జిల్లా కలెక్టర్లతో ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ప్రచారం చేసేందుకు వచ్చిన ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఆయా నియోజకవర్గాలను విడిచి వెళ్లిపోవాలన్నారు. 28వ తేదీ సాయంత్రం 6 గంటల తర్వాత అభ్యర్థుల ఇంటింటి ప్రచారాన్ని కూడా నిషేధించామన్నారు. 28వ తేదీ ప్రచారం ముగిసిన అనంతరం ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా రాజకీయ ప్రకటనలను నిషేధిస్తున్నామన్నారు.
అలాగే బల్క్ ఎస్‌ఎంఎస్‌లను కూడా నిషేధిస్తున్నట్టు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటర్ల సామర్థ్యం, తాగునీరు, ఎండ నుంచి ఉపశమనం పొందేలా టెంట్లు లేదా ఇతర వసతులు కల్పించాలని ఆదేశించారు. 28, 29 తేదీలు అత్యంత కీలకమైనందున ఎంసీసీ, ఎన్‌ఎస్‌టీ బృందాలు చురుగ్గా పనిచేయాలని సూచించారు. సమావేశంలో కలెక్టర్ స్మితా సబర్వాల్, జేసీ శరత్, డీఆర్‌ఓ దయానంద్ తదితరులు పాల్గొన్నారు.
ఓటు వేస్తే నిత్యావసర వస్తువుల కొనుగోలుపై రాయితీ
కలెక్టరేట్: ఈనెల 30వ తేదీన ఓటు హక్కు వినియోగించుకున్న ఓటరుకు ప్రతి వంద రూపాయల నిత్యావసర వస్తువుల కొనుగోలుపై మూడు రూపాయల రాయితీ అందిస్తున్నట్టు కలెక్టర్ స్మితా సబర్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 95 శాతం ఓటింగ్‌ను వినియోగించుకొనేందుకు జిల్లా పాలనా యంత్రాంగం చేపట్టిన పలు కార్యక్రమాలు జిల్లాలో ఫుడ్ గ్రెయిన్స్ హోల్‌సేల్ దుకాణ దారులు పూర్తి స్థాయిలో మద్దతు పలికి మూడు శాతం రాయితీ ఇచ్చేందుకు అంగీకరించారని చెప్పారు.
జిల్లాలో 501 హోల్‌సేల్ దుకాణాలు ఈ రాయితీ కల్పిస్తాయని తెలిపారు. ఈనెల 30న మే 1,2 తేదీల్లో వంద రూపాయల నుంచి మూడు వేల రూపాయల వస్తువులు కొనుగోలు చేసిన వారికి మూడు శాతం రాయితీ అందజేస్తారని ఆమె చెప్పారు. ఓటు హక్కు వినియోగించుకున్న ఓటరుకు 30వ తేదీన జిల్లాలోని 151 పెట్రోల్ బంక్‌లలో లీటరుపై ఒక రూపాయి రాయితీ కల్పించనున్నట్టు కలెక్టర్ తెలిపారు. గరిష్టంగా మూడు లీటర్ల వరకు ఈ రాయితీ అందిస్తారని అన్నారు. జిల్లాలోని ప్రతి ఓటరు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు.
నేటి సాయంత్రం 6 గంటలతో ప్రచారం ముగించాలి
Published Mon, Apr 28 2014 12:24 AM | Last Updated on Sat, Sep 2 2017 6:36 AM
Advertisement