వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో (2019లో) ఈ-ఓటింగ్ జరిగే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ చెప్పారు.
ఆదోని: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో (2019లో) ఈ-ఓటింగ్ జరిగే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ చెప్పారు. కర్నూలు జిల్లా ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహిస్తున్న ఓటరు కార్డుకు ఆధార్ సీడింగ్ కేంద్రాన్ని శనివారం ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు మేరకు ప్రభుత్వం ఎన్‌ఆర్‌ఐలకు ఈ-ఓటింగ్ అవకాశం కల్పించే చర్యలు తీసుకుంటోందని చెప్పారు.
దీన్ని స్థానిక ఓటర్లకు కూడా అమలు చేయవచ్చన్నారు. జనాభా కన్నా ఓటర్లు ఎక్కువ ఉన్నారనే ప్రచారంలో నిజం లేదన్నారు. ఆగస్టు 1న తప్పులు లేని ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తామని చెప్పారు. జనాభా ప్రాతిపదికన ఏపీలో అసెంబ్లీ స్థానాలను 175 నుంచి 225కు, తెలంగాణలో 119 నుంచి 153కు పెంచాల్సి ఉన్నా.. పెంచే అధికారం ఎన్నికల సంఘానికి లేదన్నారు. దీనిపై పార్లమెంటు మాత్రమే నిర్ణయం తీసుకోవాలని చెప్పారు.