ఈసీ చూస్తోంది | Election commission observers on all party candidates during elections | Sakshi
Sakshi News home page

ఈసీ చూస్తోంది

Published Thu, Mar 27 2014 1:12 AM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM

ఈసీ చూస్తోంది - Sakshi

ఈసీ చూస్తోంది

* అభ్యర్థుల ఖర్చుపై నిశిత దృష్టి
* పక్కాగా లెక్కగట్టేందుకు ఏర్పాట్లు
* ప్రతి నియోజకవర్గంలో పరిశీలకులు
* అభ్యర్థుల వెన్నంటి ‘షాడో పార్టీలు’
* అడుగడుగునా వీడియో కెమెరాలు

 
 ఎన్నికల ఖర్చు విషయంలో వున రాష్ట్రానిది దేశంలోనే తొలి స్థానం. ప్రతి ఎన్నికల్లోనూ సంచులకొద్దీ దొరుకుతున్న డబ్బు కట్టలే ఇందుకు రుజువు. ఈ జాడ్యంపై ఎన్నికల సంఘం నిశితంగా దృష్టి సారించింది. ఈ ఎన్నికల్లో అక్రవు నగదు ప్రవాహానికి పూర్తిగా అడ్డుకట్ట వేసేందుకు పకడ్బందీ వ్యూహం రచించింది. అభ్యర్థుల కదలికలపై అడుగడుగునా నిఘా పెట్టడం మొదలుకుని పలు చర్యల సిద్ధమవుతోంది. ఒకవైపు నియంత్రణ చర్యలకు పదును పెడుతూనే, మరోవైపు ఓటర్లలో కూడా చైతన్యం తీసుకొచ్చే దిశగా వినూత్న ప్రయత్నాలకు తెర తీసింది...
 
 బి.గణేష్‌బాబు, ఎలక్షన్ సెల్:  ఎన్నికల్లో డబ్బు ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు ఈసీ నడుం బిగించింది. అందుకోసం అభ్యర్థుల ఎన్నికల ఖర్చును ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరిం చింది. మొదటిది పరి మితి మేరకు చట్టం అనుమ తించే ప్రచార సభలు, పోస్టర్లు, బ్యానర్లు, కరపత్రాలు తదితరాల ఖర్చు. ఇక రెండోది ఓటర్లను ప్రలోభపెట్టేం దుకు చేసే ఖర్చు. డబ్బు, వుద్యం పంచడం, గుడి, చర్చి, మసీదు నిర్మాణాలు తదితరాలన్న మాట. మొదటిదాన్ని పరిమితి దాట నీయకుండా, రెండోదానిపై ఉక్కుపాదం మోపేలా పకడ్బందీ ప్రణాళికను ఈసీ రూపొందిం చింది. దాని స్వరూప స్వభావాలు...
 
ఎన్నికల ఖర్చు పరిశీలకులు
గరిష్టంగా ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక ప్రధాన ఎన్నికల ఖర్చు పరిశీలకుని చొప్పున కేంద్ర ఎన్నికల సంఘం నియమిస్తుంది. ఆయూ సెగ్మెంట్లలో ఎన్నికల ఖర్చుకు సంబంధించిన ప్రతి అంశాన్నీ వారు నిశితంగా పరిశీలిస్తారు.
 
 సహాయ ఎన్నికల ఖర్చు పరిశీలకులు
వీరు ‘గ్రూప్-బి’ స్థాయి అధికారులు. అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకరుంటారు. జిల్లా ఎన్నికల అధికారి (కలెక్టర్) వీరిని నియమిస్తారు. నియోజకవర్గంలో అభ్యర్థుల కదలికలను, వారి ఎన్నికల ఖర్చును నిశితంగా పరిశీలిస్తుంటారు. వీరి పనితీరు పట్ల అనుమానముంటే ప్రధాన ఎన్నికల ఖర్చు పరిశీలకుడు వీరిని మార్చవచ్చు.  
 
 వీడియో నిఘా బృందం
 ప్రతి నియోజకవర్గంలో ఒక అధికారి, ఒక వీడియోగ్రాఫర్‌తో కూడిన బృందం ఉంటుంది. అవసరమనుకుంటే ఒక్కో నియోజకవర్గంలో రెండు మూడు బృందాలనూ ఏర్పాటు చేస్తారు. అభ్యర్థుల వాస్తవ ఖర్చును బేరీజు వేసుకునేందుకు వీడియో బృందాలు సేకరించే విజువల్సే కీలకం. మీటింగ్‌కు 100 వాహనాలను తీసుకొచ్చి 20 వాహనాలనే లెక్క చూపితే వీడియోలు పట్టించేస్తాయి. ఈ బృందాల పనితీరును సహాయ ఎన్నికల ఖర్చు పరిశీలకులు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు.
 
 వీడియోలు చూసే బృందం
-     వీడియోల్లోని దృశ్యాలను పరిశీలిస్తూ, అక్రమాలు చోటు చేసుకున్న దృశ్యాలను క్రోడీకరించి నివేదిక అందించేందుకు ప్రతి నియోజకవర్గంలోను ఒక అధికారి, ఇద్దరు గుమాస్తాలతో కూడిన బృందం ఉంటుంది.
 
 కౌంటింగ్ బృందం
 ట్రెజరీ, అకౌంట్స్ శాఖల నుంచి ఒక అధికారి, ఇద్దరు సిబ్బందితో కూడిన అకౌంటింగ్ బృందం నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఉంటుంది. అభ్యర్థులు సమర్పించే రోజువారీ ఖర్చుల వివరాలను పరిశీలిస్తుంటుంది.
 
 ఫిర్యాదు స్వీకరణకు టోల్ ఫ్రీ నంబర్
     ఫిర్యాదుల స్వీకరణకు ప్రతి జిల్లా కేంద్రంలోనూ 24 గంటలు పనిచేసే టోల్ ఫ్రీ కాల్ సెంటర్ ఉంటుంది. ఓ సీనియర్ అధికారి దీని ఇన్‌చార్జిగా ఉంటారు. వివిధ వర్గాల నుంచి వచ్చే ఫిర్యాదులను రికార్డు చేయడం, అక్రమాలపై సమాచారం అందగానే ఆయా ప్రాంతాల్లోని నియంత్రణ సిబ్బందిని అప్రమత్తం చేయడం వీరి పని.
 
 మీడియా సర్టిఫికేషన్, పర్యవేక్షణ కేంద్రం

     జిల్లా ఎన్నికల అధికారి నేతృత్వంలో కేంద్ర, రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖల అధికారులతో ఈ బృందం పని చేస్తుంది. పత్రికల్లో, చానళ్లలో వచ్చే ప్రకటనలు, ‘పెయిడ్ న్యూస్’ వగైరాలను పరిశీలిస్తుంటుంది.
 
 ఫ్లయింగ్ స్క్వాడ్స్
     ప్రతి నియోజకవర్గంలో మూడు, లేక అంతకన్నా ఎక్కువ ఉంటాయి. సీనియర్ ఎగ్జిక్యుటివ్ మేజిస్ట్రేట్ స్థాయి అధికారి నేతృత్వంలో సీనియర్ పోలీసు అధికారి, వీడియోగ్రాఫర్, నలుగురు సాయుధ పోలీసులుంటారు. డబ్బు, మద్యం పంపిణీ జరుగుతున్నట్టు సమాచారమందగానే అక్కడికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేయడం వీరి పని.
 
 చెక్‌పోస్టులు
  ప్రతి నియోజకవర్గంలోనూ కీలక రహదారుల్లో మూడు గానీ అంతకన్నా ఎక్కువ గానీ చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తారు. ఒక్కో చెక్‌పోస్టు వద్ద ఒక మేజిస్ట్రేట్, ముగ్గురు, నలుగురు సాయుధ పోలీసులుంటారు. లెక్కాపత్రం లేని డబ్బు, మద్యం తదితరాల రవాణాపై కన్నేసి ఉంచుతారు. విసృ్తతంగా తనిఖీలు నిర్వహిస్తారు
 
వ్యయ పర్యవేక్షణ విభాగం

అకౌంటింగ్ శాఖలకు చెందిన సీనియర్ అధికారి నోడల్ ఆఫీసర్‌గా, నియోజకవర్గ స్థాయిలోని అన్ని కమిటీల అధిపతులు, ఎన్నికల అధికారులు సభ్యులుగా ఉంటారు
 
అర్థిక అక్రమాలు జరిగే నియోజకవర్గాల గుర్తింపు
ఆర్థిక అక్రమాలు ఎక్కువగా జరిగే అవకాశమున్న నియోజకవర్గాలను గత ఉదంతాలు, ఫిర్యాదుల ఆధారంగా ప్రధాన ఎన్నికల అధికారి గుర్తింస్తారు. వాటిలో నిఘా బృందాలను రెట్టింపు, అవసరమైతే ఇంకా ఎక్కువగా పెంచుతారు. నియోజకవర్గ పరిధిలోని ఒక మండలంలో గానీ, కొన్ని గ్రామాల్లో గానీ ఆర్థిక అక్రమాలు ఎక్కువగా జరిగే ఆస్కారమున్నట్టు గుర్తిస్తే అక్కడ కూడా ప్రత్యేక బృందాలను మోహరిస్తారు. అక్కడి ఫ్లయింగ్ స్క్వాడ్స్, పోలీసుల పనితీరును పర్యవేక్షించేందుకు ఇతర రాష్ట్రాలకు చెందిన డీఐజీ ర్యాంకు పోలీసు అధికారిని ప్రత్యేకంగా నియమిస్తారు
 
షాడో పార్టీలు
ఏ నియోజకవర్గంలోనైనా డబ్బు పంపిణీ తదితరాలకు పాల్పడతారన్న అనుమానమున్న అభ్యర్థులను, వారి ఏజెంట్లను వెన్నంటి ఉండేలా ప్రత్యేక పోలీసులతో ఈ షాడో పార్టీలను ఏర్పాటు చేస్తారు
 
 షాడో రిజిస్టర్
  ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి అభ్యర్థి ఎన్నికల ఖర్చుకూ సంబంధించి ఒక షాడో రిజిస్టర్‌ను నిర్వహిస్తారు. అభ్యర్థి సమర్పించే రోజువారీ ఎన్నికల ఖర్చు వివరాలను ఈ షాడో రిజిస్టర్‌లోని లెక్కలతో పోల్చి లోటుపాట్లను పసిగడతార. అభ్యర్థి దాచిన ఖర్చలపై వారికి నోటీసులిస్తారు. సకాలంలో స్పందించకుంటే తగిన చర్యలు తీసుకుంటారు
 
 వాయు మార్గంపైనా కన్ను
గత ఎన్నికల్లో హెలికాప్టర్లు, విమానాల ద్వారా భారీగా డబ్బు తరలించిన ఉదంతాల నేపథ్యంలో ఈసారి మారుమూల హెలిప్యాడ్‌లు, చిన్నపాటి విమానాశ్రయాలపై కూడా ప్రత్యేక నిఘా ఉంచుతున్నారు. వైమానిక శాఖ అధికారులతో నిరంతర సమన్వయంతో పని చేస్తారు.
 
 ఖాతాలపైనా కన్ను
ఎన్నికల్లో ఆర్థిక అక్రమాల అడ్డుకట్టకు తీసుకోవాల్సిన చర్యలపై ఎన్నికల సంఘం దాదాపు 300 పేజీల్లో సవివరమైన సూచనలు చేసింది. ఎన్నికల ఖర్చు నిర్వహణకు ప్రతి అభ్యర్థీ ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా తెరవాలని, అన్ని లావాదేవీలూ దాని ద్వారానే జరపాలని ఈసీ ఆదేశించింది. ప్రతి నియోజకవర్గంలోనూ ఏటీఎం సెంటర్లకు డబ్బు తరలించే వాహనాలకు సంబంధించి కూడా నిర్దిష్టమైన విధి విధానాలను ఖరారు చేసింది. అనుమా నాస్పద లావాదేవీలు జరిగే బ్యాంక్ ఖాతాలు, స్వయం సహాయ బృందాల బ్యాంకు ఖాతాలపై నిఘా ఉంచాలని సిబ్బందిని ఆదేశించింది. ‘కొన్నిచోట్ల అభ్యర్థులు నేరుగా డబ్బు పంచకుండా, అభ్యర్థి సంతకమో మరో గుర్తో ఉండే టోకెన్లు పంచుతారు. వాటిని తీసుకెళితే వేరే చోట (షాపులు, వ్యాపార సంస్థల వద్ద) చూపితే డబ్బో, వస్తువులో ఇచ్చే ఏర్పాట్లుంటాయి. వీటిపైనా తగు నిఘా పెట్టండి’ అని ఈసీ ఆదేశించడం విశేషం. మద్యం అమ్మకాలు, పంపిణీ, సరఫరాలపైనా ప్రత్యేక దృష్టి సారించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement