నల్ల సూరీడే న్యాయ నిర్ణేత | Singareni workers will make justice in General elections | Sakshi
Sakshi News home page

నల్ల సూరీడే న్యాయ నిర్ణేత

Published Thu, Mar 27 2014 1:24 AM | Last Updated on Sun, Sep 2 2018 4:23 PM

నల్ల సూరీడే న్యాయ నిర్ణేత - Sakshi

నల్ల సూరీడే న్యాయ నిర్ణేత

జన పథం: సార్వత్రిక ఎన్నికల వేళ అందరి దృష్టి సింగరేణి కార్మికుడిపైనే. నాలుగు జిల్లాల పరిధిలో విస్తరిం చి ఉన్న సింగరేణి ‘కుటుంబం’ ఇప్పుడు ఎన్ని కలపై తన ప్రభావాన్ని చూపించనుంది. ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని పది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో వీరి ఓటే కీలకం కానుండడంతో నేతలంతా ఇప్పుడు సింగరేణి సమస్యల జపం పఠిస్తున్నారు.  వారి కరుణాకటాక్షాల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. మేనిఫెస్టోలో సింగరేణి సమస్యలుండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
 
భూపతిరవి, శ్రీరాంపూర్: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నల్ల సూరీడే న్యాయ నిర్ణేత కానున్నాడు. ఈ ఎన్నికల్లో కోల్‌బెల్ట్ ఓటరు తీర్పు అన్ని పార్టీల అభ్యర్థులకు కీలకం కానుంది. సింగరేణి గనులు ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో విస్తరించి ఉన్నాయి. ఈ నాలుగు జిల్లాల్లో 10 అసెంబ్లీ స్థానాలపై సింగరేణి ఓటర్లు ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఇక్కడ బరిలో నిలిచే అభ్యర్థుల గెలుపోటములపై సింగరేణి సమస్యలు ప్రభావం చూపుతాయి. కంపెనీ మొత్తంలో 11 డివిజన్లుండగా ఒక్కో డివిజన్‌ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌పై ప్రభావం చూపుతుంది.  
 
 ఆదిలాబాద్ జిల్లాలో బెల్లంపల్లి సెగ్మెంట్‌పై బెల్లంపల్లి డివిజన్, చెన్నూర్‌పై  మందమర్రి, మంచిర్యాలపై  శ్రీరాంపూర్ డివిజన్  కార్మికుల ప్రభావం ఉంటుంది. కరీంనగర్‌లోని రామగుండం, మంథని సెగ్మెంట్ల పరిధిలో ఆర్జీ-1, ఆర్జీ-2, ఆర్జీ-3, ఆడ్రియాల డివిజన్లు ఉన్నాయి. వరంగల్ జిల్లాలో భూపాలపల్లి డివిజనే నియోజకర్గ కేంద్రం కావడం విశేషం. ఇక సింగరేణి పుట్టిన ఖమ్మం జిల్లాలో  ఇల్లందు, కొత్తగూడెం నియోజకవర్గాలపై ఆ డివిజన్ ఓటర్ల ప్రభావం ఉంటుంది. మణుగూరు డివిజన్ పినబాక నియోజకవర్గంలో పరిధిలో ఉంటుంది. ఈ పది నియోజకవర్గాలే కాకుండా పెద్దపల్లి పార్లమెంట్ స్థానంపై అధికంగా, ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాలపై స్వల్పంగా సింగరేణి ప్రభావం ఉంటుంది.
 
 సింగరేణిలో లక్షల ఓట్లు
 సింగరేణిలో 65వేల మంది కార్మికులు ప్రత్యక్షంగా పనిచేస్తున్నారు. వీరి కుటుంబాల ఓట్లు కూడా కలుపుకుంటే సుమారు రెండులక్షలపైమాటే. వీరితో పాటు 20వేల మం ది కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలు, 30వేల మంది రిటైర్డ్ కార్మికుల కుటుంబాల ఓట్లు ఉన్నాయి. సింగరేణిని నమ్ముకుని చిరు వ్యాపారాలు, కులవత్తులు చేసుకొనే ఓటర్లు మరో రెండు లక్షల మంది ఉంటారు.
 
 మేనిఫెస్టోలో ‘సింగరేణి’
 నాలుగు జిల్లాల్లో అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపే సింగరేణి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో సింగరేణి సమస్యలను చేర్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో ప్రత్యేకంగా వాటిని ప్రస్తావించి ఓట్లు రాబట్టుకునేందుకు సమాయత్తమవుతున్నాయి. మరోవైపు అన్ని రాజకీయ పార్టీలకు సింగరేణిలో అనుబంధ కార్మిక సంఘాలుంన్నాయి. కాబట్టి వాటి ఉనికి కోసం, గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలవడం కోసమైనా మేనిఫెస్టోలో సింగరేణి సమస్యలు చేర్చాలంటూ తమ అధినాయకత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. కాంగ్రెస్‌కు ఐఎన్‌టీయూసీ, టీఆర్‌ఎస్‌కు టీబీజీకేఎస్, సీపీఐకి ఏఐటీయూసీ, బీజేపీకి బీఎంఎస్, సీపీఎంకు సీఐటీయూ, టీడీపీకి టీఎన్టీయూసీ, వైఎస్సార్ సీపీకి వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ అనుబంధంగా ఉన్నాయి. టీఆర్‌ఎస్ తయారు చేస్తున్న ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలను టీబీజీకేఎస్ నేతలు ఇప్పటికే కేసీఆర్‌కు వినతిపత్రం రూపంలో అందించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలను ఐఎన్‌టీయూసీ నేతలు సిద్ధం చేశారు. ఇలా అన్ని యూనియన్లు పార్టీల మేనిఫెస్టో రూపకల్పనలో భాగస్వామ్యం అవుతున్నాయి.
 
 హామీ కోరుతున్న కార్మికులు
 ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తమ ప్రధాన డిమాండ్లు తీర్చాలని కార్మికులు కోరుతున్నారు. ఆగిపోయిన వారసత్వ ఉద్యోగాలు తిరిగి మొదలు పెట్టాలని,కొత్త భూగర్భ గనులు తవ్వాలని, కార్మికులను ఐటీ పరిధి నుంచి మినహాయించాలని, పెన్షన్‌ను 40 శాతానికి పెంచాలని, గని ప్రమాదంలో చనిపోయిన వారికి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా,  కార్మికులకు విద్య, వైద్యం, సంక్షేమం మెరుగుపరచాలని డిమాండ్ చేస్తున్నారు.  సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చే పార్టీలకే పట్టం కడతామని కోల్‌బెల్ట్ ఓటర్లు ముక్త కంఠంతో చెబుతున్నారు.
 
 సింగరేణికి వైఎస్ అండ..
 పందిళ్ల శ్యాంసుందర్, గోదావరిఖని
 *  17 వేల ఇళ్ల క్రమబద్దీకరణ
 గోదావరిఖనిలో  1961లో తొలిసారిగా  బొగ్గుగనిని ప్రారంభించగా...అప్పటి కార్మికులు, బతుకుదెరువు కోసం వచ్చిన ప్రజలు సింగరేణి స్థలాల్లోనే ఇళ్లు నిర్మించుకున్నారు. పాత ఇళ్లకు మరమ్మతులు చేసుకోవాలంటే సింగరేణి యాజమాన్యం నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవి. వైఎస్సార్ హయాంలో స్థానిక నేతలు ఆయనను కలిసి ఈ ఇళ్లను క్రమబద్ధీకరించాలని  కోరారు.  స్పందించిన వైఎస్ తక్షణమే చర్యలు తీసుకోవాలని అప్పటి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ సుల్తానియాను ఆదేశించారు. రామగుండం మున్సిపాలిటీ పరిధిలోని సింగరేణి స్థలంలో నిర్మించుకున్న ఇళ్లను 10 రోజుల్లో  సర్వే చేయించారు.  ఇంటి స్థలాలను క్రమబద్ధీకరిస్తూ  2009 ఫిబ్రవరి 23న 17 వేల మందికి వైఎస్ స్వయంగా పట్టాలను అందజేశారు. దేశ చరిత్రలోనే ఇంత భారీ సంఖ్యలో ఇళ్లను క్రమబద్ధీకరించిన ఘనత  వైఎస్‌కే దక్కుతుంది.
 
 *  మరణించిన కార్మికులకు రూ.7 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లింపు
  2003 జూన్ 16న జీడీకే 7 ఎల్‌ఈపీ గనిలో 17 మంది, అదే ఏడాది ఆగస్టు 16న  జీడీకే 8ఏ గనిలో 10 మంది కార్మికులు ప్రమాదవశాత్తు మరణించగా అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ఒక్కో కుటుంబానికి రూ.6 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించారు. 2006 నవంబర్ 11న కొత్తగూడెం వీకె-7 గనిలో నలుగురు కార్మికులు మరణించగా అప్పడు అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్ ఒక్కో కుటుంబానికి రూ.ఏడు లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించి కార్మిక కుటుంబాలను ఆదుకున్నారు. కిరణ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఇటీవల ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలకు రూ.ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా మాత్రమే చెల్లించింది.  
 
 కార్మికులపై ఉక్కు పాదం
 -    కోల్‌ఇండియాలో ఎక్కడా లేని విధంగా చంద్రబాబు సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల విధానాన్ని 1998లో ప్రవేశపెట్టి కార్మికులు తమకు ప్రాతినిధ్యం వహించే సం ఘం ఆధ్వర్యంలో పోరాడే అవకాశం లేకుండా చేశారు.
 -    గుర్తింపు సంఘం యాజమాన్యంతో రాజీ పడితే కార్మికుల హక్కులకు విఘాతం కలిగే పరిస్థితి వస్తుందని విమర్శలు వచ్చినా బేఖాతరు చేశారు.  ఇతర సంఘాలు  సమ్మె చేపడితే ఉక్కుపాదం మోపారు. ఎస్మా ప్రయోగించడంతో పాటు  వేతనాల నుంచి కోత విధించేలా చట్టాలను అమలు చేయించారు.
 -    {పతీ ఏటా 10 శాతం మంది కార్మికులను తగ్గించాలని 2000లో నిర్ణయించి, ఇప్పటి వరకు కొనసాగిస్తున్నారు.  యంత్రీకరణను వేగవంతం చేయడం, భూగర్భ గనులకు బదులు ఓపెన్‌కాస్ట్‌లను ప్రవేశపెట్టడం, కార్మికులు, ఉద్యోగులతో బదులు కాంట్రాక్టు సంస్థలతో మట్టి తొలగించడం లాంటి  పనులను అప్పగించడం ద్వారా ఉద్యోగాల్లో కోత పెట్టారు.
 -    గనులలో పనిచేసే కార్మికులకు ఆరోగ్యం  దెబ్బతిని విధులకు గైర్హాజరైతే, సుమారు పదివేల మందికి నోటీసులు జారీ చేసి ఉద్యోగాల నుంచి తొలగించారు. డిస్మిస్డ్ కార్మికులు తమకు తిరిగి ఉద్యోగాలివ్వాలంటూ ఇంకా ఉద్యమిస్తూనే ఉన్నారు.
 -    పీరియాడికల్ మెడికల్ ఎగ్జామినేషన్ (పీఎంఈ) నిబంధనలను కఠినతరం చేశారు. చిన్న జబ్బు ఉన్న వారు కూడా ఉద్యోగం కోల్పోయారు.
 -    సింగరేణిలో  నియామకాలను పూర్తిగా నిలిపివేశారు. అది నాలుగు జిలాల్లో  నిరుద్యోగులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. వారసత్వ ఉద్యోగాలమీద యువకులు పెట్టుకున్న  ఆశలు వమ్మయ్యాయి.
 
 హామీలు సరే.. అమలు సాధ్యమేనా?
 గెస్ట్ కాలమ్/శివ: మొత్తం మీద చూస్తే సింగరేణికి ఉజ్వల భవిష్యత్ ఉండే అవకాశం ఉంది. కొత్త ప్రభుత్వం మీద కొత్త విద్యుత్ కర్మాగారాలు ఏర్పాటు చేసే బాధ్యత ఉంది. కనుక దీనిని ఆచరణలో చూపే క్రమంలో సింగరేణిలో కొత్త గనులు, కొత్త టెక్నాలజీ, కొత్త ఉద్యోగాలతో కొత్త శోభ సంతరించుకునే అవకాశం ఉంది. రానున్న కాలంలో ఇదే తెలంగాణ కొంగుబంగారం కానుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.                       
 
 దేశంలోని బొగ్గు ఉత్పత్తి సంస్థల్లో సింగరేణికి అనేక ప్రత్యేకతలున్నాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సింగరేణి తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాల ఉమ్మడి సంస్థగా రూపాంతరం చెందింది. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్న క్రమంలో సింగరేణి కార్మికులు దాదాపు 40రోజులు సంపూర్ణంగా సమ్మెచేశారు. ఇన్ని రోజులపాటు తమ సమస్యల కోసం సమ్మె చేసిన దాఖలాలు ఎక్కడా లేవు. 80వ దశకంలో సుదీర్ఘ సమ్మె చేపట్టినా అది సింగరేణి అంతటా జరగలేదు. కార్మికేతర సమస్యలపై జరిగిన తొలి సమ్మెగా సకల జనుల సమ్మెను పేర్కొనవచ్చు. అయితే ప్రస్తుతం ఎన్నికల సందర్భంగా వివిధ పార్టీలు ఇచ్చిన హామీలు, తెలంగాణ ఏర్పాటుతో సంస్థకు, కార్మికులకు కలిగే ప్రయోజనాలపై నేడు సర్వత్రా చర్చ జరుగుతోంది.  
 
 వరాల జల్లులు
 ఎన్నికల సమయంలో తెలంగాణ అనుకూల పార్టీలు గతంలో ఎన్నో వరాలు ప్రకటించాయి. వాటిలో..  ఓపెన్‌కాస్ట్ మైనింగ్ నిలుపుదల, డిపెండెంట్ ఉద్యోగాల కల్పన, కొత్త బావుల నిర్మాణం, గోదావరి తీరం వెంబడి కొత్త విద్యుత్ కార్మాగారాల ఏర్పాటు, సింగరేణి ప్రాంతంలో మరో మైనింగ్ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు, మరీ ముఖ్యంగా అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాల్లో స్థానికులకు అవకాశం, క్రమంగా వారిని పర్మినెంటు చేయడం, రాష్ట్రేతర బడా కాంట్రాక్టర్లకు ఓబీ పనుల్లో అవకాశం నిరాకరించడం వంటివి ఉన్నాయి. వేతనాల పెంపుదల, మృతిచెందిన కార్మికులకు రూ.30లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లింపు, అవినీతి కుంభకోణాలపై విచారణ వంటివి అందులో కొన్ని.  
 
 కొన్ని సాధ్యం..మరికొన్ని అసాధ్యం
 గోదావరి తీర ప్రాంతంలో కొత్త విద్యుత్ కేంద్రాల ఏర్పాటు, కొత్త బావుల నిర్మాణం, మెడికల్ కాలేజీ, ఇంజినీరింగ్ కాలేజీల నిర్మాణం కొత్త ప్రభుత్వాలకు అంత కష్టమేమీకాకపోవచ్చు. అయితే నాయకులు ఇస్తున్న హామీల్లో కొన్నింటిని నెరవేర్చడం అసాధ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఓపెన్‌కాస్టు గనుల వల్ల తెలంగాణ బొందలగడ్డగా మారిందనీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే వాటిని మూసేస్తామని, కొత్తవాటికి అనుమతులు రాకుండా చూస్తామని ఇచ్చిన హామీలు నెరవేర్చడం దాదాపు అసాధ్యమని చెబుతున్నారు. ఎందుకంటే సింగరేణి బొగ్గు ఉత్పత్తిలో 70శాతం ఓసీ గనుల నుంచే వస్తుంది. లాభాలు వస్తున్నది కూడా ఓసీ గనుల వల్లనే. వాటిని మూసేస్తే సుమారు 20వేలమంది కార్మికులకు ప్రత్యామ్నాయం చూపాలి. లేదంటే బయటకు పంపాలి. ఈ రెండింటిలో ఏది చేసినా కార్మికులు ఒప్పుకునే అవకాశం లేదు. కాబట్టి అది అసాధ్యం. ఇక డిపెండెంట్లకు ఉద్యోగాలు కూడా ఆచరణ సాధ్యం కాకపోవచ్చని భావిస్తున్నారు. కార్మికుల పిల్లలు ఇప్పుడు ఉన్నత చదువులు చదువుతున్నారు. వారిలో ఎక్కువ మంది ఐటీరంగంపై ఆసక్తి చూపుతున్నారు. కాబట్టి వారి నుంచి ఈ హామీకి అంత ప్రోత్సాహం ఉండకపోవచ్చని సింగరేణి అధికారులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement