అమరావతి: ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు భాగ్యరాజాపై తమిళనాట పెద్ద దుమారం రేగుతోంది. తెలుగు ప్రేక్షకులకు కూడా చిరపరిచితుడైన భాగ్యరాజా మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ కూడా భాగ్యరాజా వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భాగ్యరాజాపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ తమిళనాడు మహిళా కమిషన్‌కు ఆమె లేఖ రాశారు. రేప్ ఘటనల్లో మహిళలను తప్పుబట్టేలా మాట్లాడటం ఎంతమాత్రం మానవత్వం కాదని, చిన్నపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు వీరికి కనిపించడం లేదా? అని ఆమె నిలదీశారు. ప్రభుత్వాలు, మహిళా సంస్థలు, పోలీసులు, న్యాయవ్యవస్థ మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఆపేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుంటే కొందరు సెలబ్రిటీలు మాత్రం మహిళలను కించపరచడం, దారుణాలకు మద్దతు పలుకడమేమిటని ఆమె నిలదీశారు.
ఈమధ్య తమిళనాడులో ప్రకంపనలు సృష్టించిన పొలాచీ రేప్ కేసు గురించి భాగ్యరాజా ఓ సినీ ఈవెంట్‌లో ప్రస్తావిస్తూ.. ఆ ఘటన వెనుక మగవాళ్ల తప్పులేదని, వివాహేతర సంబంధాల కోసమే ఈ రోజుల్లో మహిళలు భర్తలను, పిల్లలను చంపుతున్నారని దారుణ వ్యాఖ్యలు చేశారు. సెల్‌ఫోన్‌ల వల్లే మహిళలు చెడిపోతున్నారని, రెండేసి సిమ్ కార్డులు వాడుతున్నారని, మహిళలపై అత్యాచారాలు, వేధింపులకు కూడా సెల్‌ఫోన్లు కారణమని ఆయన చెప్పుకొచ్చారు. పోలాచీ కేసులో అమ్మాయి అవకాశం ఇచ్చినందువల్లే రేప్ జరిగిందని భాగ్యరాజా తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment