విషాదం తల్లిడిల్లిపోయి.. | Tallidillipoyi tragedy .. | Sakshi
Sakshi News home page

విషాదం తల్లిడిల్లిపోయి..

Published Thu, Oct 16 2014 2:26 AM | Last Updated on Sat, Sep 2 2017 2:54 PM

విషాదం తల్లిడిల్లిపోయి..

విషాదం తల్లిడిల్లిపోయి..

ప్రొద్దుటూరు క్రైం/ఎర్రగుంట్ల: ఎర్రగుంట్ల మండలం హనుమనగుత్తి గ్రామంలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చలివిండ్ల...

కాలిన గాయాలతో ఆ చిన్నారి విలవిలలాడింది.. కొద్దిసేపటికే శ్వాస ఆగిపోయింది.. ‘తాతా’ నొప్పిగా ఉందంటూ మరో పసిప్రాణం రోదించింది.. ‘ఏం కాదులే నాన్నా’ అంటూ ఉబుకుతున్న క న్నీళ్లను అదిమిపెట్టుకుని  ఆ తాత ఓదార్చాడు.. మెరుగైన వైద్యం కోసం  కర్నూలుకు తరలిస్తుండగా దారిలోనే కన్నుమూశాడు.. అత్తామామలు పెడుతున్న వేధింపులు తాళలేక ఎర్రగుంట్ల మండలం హనుమనగుత్తికి చెందిన కల్పన బుధవారం పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుంది.. తాను లేకుంటే తన పిల్లలను ఎవరు చూసుకుంటారని అనుకుందేమో.. వారిపైనా పెట్రోలు పోసి నిప్పంటించింది.. తీవ్రంగా గాయపడిన తల్లి కల్పన, చిన్నారులు విశాల్‌రెడ్డి (3), అక్షేశ్వరి(1) ఒకరి తర్వాత మరొకరు ఈలోకం నుంచి వెళ్లిపోయారు.
 
 ప్రొద్దుటూరు క్రైం/ఎర్రగుంట్ల:
 ఎర్రగుంట్ల మండలం హనుమనగుత్తి గ్రామంలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చలివిండ్ల కల్పన (25) కుమారుడు విశాల్‌రెడ్డి (3), కుమార్తె అక్షేశ్వరి (1)పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టింది. ఆ చిన్నారులు మంటల్లో కాలుతుండగానే  తనపై కూడా పెట్రోల్ పోసుకొని తగులబెట్టుకుంది. ముగ్గురిని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించగా కొద్ది సేపటికే తల్లీపిల్లలు తనువు చాలించారు. ఒకే కుటుంబానికి చెందిన  ముగ్గురు మృత్యువాత పడటంతో హనుమనగుత్తిలో విషాదం అలముకుంది.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు... హనుమనగుత్తికి చెందిన చలివెండ్ల మునిరెడ్డి ప్రొద్దుటూరులో వోడా సెల్‌ఫోన్ కంపెనీలో పని చేస్తున్నాడు. అతనికి ఐదేళ్ల క్రితం జమ్మలమడుగు మండలం బొమ్మేపల్లి గ్రామానికి చెందిన కల్పనతో వివాహమైంది. వివాహ సమయంలో కట్నకానుకల కింద సుమారు రూ.3.75 లక్షలు దాకా ఇచ్చారు.

మునిరెడ్డి తల్లి దండ్రులు లలితమ్మ, రాజగోపాల్‌రెడ్డి, తమ్ముడు, చెల్లెలు కూడా ఒకే ఇంట్లో కలిసే ఉంటున్నారు. భర్త బాగానే చూసుకుంటున్నప్పటికీ అత్తామామల వేధింపులపై కలత చెందేది. కొన్ని రోజుల నుంచి అత్తామామల వేధింపులు అధికమైనట్లు కల్పన తన సోదరుడికి ఫోన్ చేసి తెలిపేది. రెండు రోజుల క్రితం కూడా ఫోన్ చేయగా తాను వచ్చి మాట్లాడతానని చెప్పాడు. ఇంతలోనే ఘోరం జరిగి పోయింది.

 అధికమైన వేధింపులు
 ఇటీవల పిల్లలతో పాటు కల్పనకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ప్రొద్దుటూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఇందుకు గాను సుమారు రూ. 5 వేలు దాకా ఖర్చు అయింది. ఈ డబ్బు విషయమై అత్త లలితమ్మ రెండు మూడు రోజుల నుంచి అడుగుతుండేది. ఖర్చు అయిన డబ్బును పుట్టింటి నుంచి తీసుకుని రమ్మని వేధించేది. దీంతో కల్పన రెండు రోజుల క్రితం అన్న శౌరెడ్డికి ఫోన్ చేసింది.

వెంటనే డబ్బు పంపాలని కోరింది. తీసుకుని వస్తానని  చెల్లెలుకు అన్న భరోసా ఇచ్చాడు. మంగళవారం రాత్రి ఏం జరిగిందో కానీ బుధవారం ఉదయం కూడా తన అన్నకు కల్పన ఫోన్ చేసి రమ్మని చెప్పింది. ఇంతలోనే ఇంట్లో ఎవరూ లేనిది చూసుకుని బయట ఆడుకుంటున్న పిల్లలను ఇంట్లోకి పిలిచింది. పక్కనే ఉన్న పాడుబడ్డ ఇంట్లోకి తీసుకుని వెళ్లి పిల్లలపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టింది.

తర్వాత తాను కూడా ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. కాలుతున్న వాసన రావడంతో స్థానికులు లోపలికి వెళ్లి చూడగా ఘోరం వెలుగుచూసింది. హుటాహుటిన చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి వెళ్లే లోపే కల్పన మృతి చెందగా, కొద్ది సేపటి తర్వాత చిన్నారి అక్షేశ్వరి చనిపోయింది.

బాలుడి ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని భావించిన కుటుంబ సభ్యులు వైద్యుల సూచన మేరకు వెంటనే కర్నూలుకు తరలించారు. అయితే మార్గం మధ్యలోనే విశాల్‌రెడ్డి తనవు చాలించాడు. విషయం తెలియడంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకున్నారు. కల్పనతో పాటు పిల్లల మృత దేహాలను చూసి కంట తడిపెట్టారు.

 గాయాలతో పిల్లల రోదనలు
 కాలిన గాయాల బాధను భరించలేని చిన్నారులు రోదించారు. ఆస్పత్రికి చే ర్చిన కొద్ది సేపటి తర్వాత అక్షేశ్వరి శ్వాస ఆగిపోయింది. విశాల్‌రెడ్డి మాత్రం నొప్పిగా ఉందంటూ తాతతో చెబుతూ ఏడవసాగాడు. ఏం కాదులే నాన్నా.. బాగవుతుందిలే అంటూ మనువడికి ఆ తాత ధైర్యం చెప్పాడు.
   
  అత్తామామలపై కేసు నమోదు
 కల్పన సోదరుడు శౌరెడ్డి ఫిర్యాదు మేరకు మామ రాజగోపాల్‌రెడ్డి, అత్త లలితమ్మ, ఆడపడచు, మరిదిలపై వేధింపుల కేసు నమోదు చేసినట్లు ఎర్రగుంట్ల ఎస్‌ఐ భానుమూర్తి తెలిపారు.
 
 నా బంగారు బిడ్డా..వెళ్లిపోయావా..
 
 కల్పన మరణ వార్త విన్న తల్లి రామాంజులమ్మ, సోదరుడు శౌరెడ్డి బొమ్మేపల్లి నుంచి ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. వారు వచ్చేలోపే కల్పన, అక్షేశ్వరి మృతి చెందారు. కల్పన  మృత దేహాన్ని చూసిన తల్లి హృదయం తల్లడిల్లి పోయింది. నా బంగారు బిడ్డా వెళ్లిపోయావా.. ఎంత కష్టం వచ్చిందే తల్లి నీకు.. ఇంత అఘాయిత్యం ఎలా చేసుకున్నావంటూ రోదించింది. ఊరికి రమ్మంటే దీపావళి పండుగకు వస్తానని చెప్పావే.. ఇంతలోనే ఇలా చేశావే అంటూ విలపించసాగింది. కల్పన తండ్రి 12 ఏళ్ల క్రితం కరెంట్ షాక్‌తో చనిపోయాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement