ఫైరింగ్‌పై ‘ఫైర్’
ఏపీ ప్రభుత్వంపై తమిళనాట ఆగ్రహం
బస్సులపై దాడులు సీఎం చంద్రబాబు చిత్రపటం దహనం
చిత్తూరు జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌పై తమిళనాడులో ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడ్డాయి. మృతుల్లో 12 మంది తమిళనాడుకు చెందినవారు కాగా.. వీరిలో 9 మంది తిరువన్నామలై, ముగ్గురు వేలూరు జిల్లాకు చెందినవారున్నారు. దీంతో తమిళనాడు అంతటా ఈ ఎన్‌కౌంటర్‌పై నిరసనలు వెల్లువెత్తాయి. వివిధ పార్టీల కార్యకర్తలు రోడ్లపైకి వచ్చారు. నిరసన ప్రదర్శనలకు దిగారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బస్సులు, సంస్థలపై దాడులకు పాల్పడ్డారు.
చెన్నై కోయంబేడు బస్‌స్టేషన్‌లో ఏడు బస్సులను పాక్షికంగా ధ్వంసం చేశారు. కంచి, వేలూరులో మరికొన్ని బస్సులను ముట్టడించేందుకు ప్రయత్నించారు. తమిళర్ వాళ్వురిమై కట్చి నేత వేల్ మురుగన్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆంధ్రా సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్(ఆస్కా) వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకుని ఏపీ సీఎం చంద్రబాబు చిత్రపటాన్ని దహనం చేశారు. ఈ సందర్భంగా మురుగన్ మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు విచక్షణారహితంగా కాల్పులు జరిపించి అమాయకుల ప్రాణాలను బలిగొన్నారని ధ్వజమెత్తారు.