సినీ దర్శక, నిర్మాత తమ‍్మారెడ్డి భరద్వాజ
సాక్షి, విజయవాడ : ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని సినీ దర్శక, నిర్మాత తమ‍్మారెడ్డి భరద్వాజ మరోసారి స్పష్టం చేశారు. తాను ఏ పార్టీకి చెందినవాడిని కాదని, అయితే తెలుగు ప్రజలకు మంచి జరగాలన్నదే తన ఆకాంక్ష అని అన్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గురువారం విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడారు. హోదా ఉద్యమానికి తెలుగు చిత్రసీమ అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం ఎందుకు స్పందించదని తమ్మారెడ్డి సూటిగా ప్రశ్నించారు.
ఇంత ఉద్యమం జరుగుతున్నా హోదా ఇవ్వడంపై కేంద్రం ఎందుకు వెనకడుగు వేస్తోందో అర్థం కావడం లేదన్నారు. నేతలు పరస్పరం విమర్శలు చేసుకోవడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. రాష్ట్రానికి నిధులు ఉత్తపుణ్యానికి ఇస్తున్నట్లు బీజేపీ నేతలు మాట్లాడటం సరికాదన్నారు. అలాగే కథువాలో ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటనతో పాటుగా తెలుగు సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్, తాజా పరిణామాలపై కూడా తమ్మారెడ్డి స్పందించారు.
కాస్టింగ్ కౌచ్‌పై తమ్మారెడ్డి స్పందన
టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్‌పై తమ్మారెడ్డి స్పందించారు. సినిమా ఇండస్ట్రీ గురించి నీచంగా మాట్లాడుకోవడం బాధ కలుగుతుందన్నారు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని తాము ఒప్పుకుంటామని అయితే అది కొందరి వల్లే జరుగుతోందని ఆయన అన్నారు. ’ కొంతమంది అన్నట్లు సినీ పరిశ్రమ అంత దరిద్రంగా లేదు. అలా ఉంటే ఎందుకు సినిరంగానికి చెందిన వారి పిల్లలను సినిమా రంగంలోకి దించుతాము. హీరోలు హీరోయిన్లను ఎందుకు పెళ్లిళ్లు చేసుకుంటారు. సినిమా వాళ్ళు అంటే అందరికి లోకువ అయిపోతున్నారు. మీడియా, సినిమా రంగం రెండు సమన్వయంతో పని చేయాలి. పవన్ కళ్యాణ్ ను తిట్టడానికి వీళ్లు ఎవరు. సంధ్యా, దేవి లాంటి వారు కొంతమంది ట్రాప్లో పడ్డారని నేను అనుకుంటున్నాను.
రకుల్ ప్రీత్ సింగ్ చెప్పుతో కొడతామని ఎలా అంటారు.. ఎవరికైనా అన్యాయం జరిగితే సినీ ఇండస్ట్రీలో పెద్దలకు చెప్పాలి. లేదంటే పోలీసులకు, లేదంటే షీ టీమ్స్ కు పిర్యాదు చేయాలి. ఎవరైనా సినిమా రంగంలో అవకాశాలు ఇస్తామని చెప్పి అమ్మాయిలను ఇబ్బంది పెడితే అటువంటి వారిని కొట్టండి. ఎవరైనా వారి హక్కులను హరిస్తే వారిపై తిరుగుబాటు చేయండి. సినీ పరిశ్రమలో అసలు దేని గురించి మాట్లాడదలచుకున్నారు. బాధితులుంటే ఫిల్మ్ ఛాంబర్‌కు వచ్చి ఫిర్యాదు చేయమంటున్నాం. కానీ మీడియాలోకి వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదు.
సినీ పరిశ్రమ అంటే అందరికీ లోకువైపోయింది. అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలన్న పవన్ కల్యాణ్‌పై శ్రీరెడ్డి విమర్శలు చేయడం సరికాదు. సాక్ష్యాలు ఉంటే కేసు పెట్టాలి. త్వరలో ఏర్పాటు కాబోయే క్యాష్ కమిటీ పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటాం. రెండు, మూడు రోజుల్లో కమిటీ సభ్యుల పేర్లు వెల్లడిస్తాం. ఇక అమరావతికి సినీ ఇండస్ట్రీని రమ్మని ఎవరు పిలవలేదు. మాకు ఏమీ రాయితీలు ఇవ్వనక్కర్లేదు. మాకు సహాయ సహకారాలు అందిస్తే చాలు.’ అని తమ్మారెడ్డి తెలిపారు.
ప్రధానికి తన పదవి గురించి మాత్రమే బాధ
దేశంలో ముక్కుపచ్చలారని చిన్నారులపై జరుగుతున్న అకృత్యాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు స‍్పందించరని తమ్మారెడ్డి ప్రశ్నించారు. ఈ ఘటనలు తన మనసును కలిచివేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రధాని మాత్రం.. బీసీని అయిన నా మీద కుట్ర చేస్తున్నారు.. నన్ను పదవి నుంచి దించేయడానికి ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. మోదీ కేవలం తన పదవిని గురించి మాత్రమే బాధపడ్డారని విమర్శించారు. మోదీ ప్రభుత్వంలో ఉన్న మహిళా మంత్రులు... కథువా, ఉన్నావ్ ఘటనలపై ఎందుకు స్పందించరని ఆయన డిమాండ్ చేశారు. పైపెచ్చు ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మాట్లాడటం సరికాదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment