
సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా మళ్లీ తమ్మినేని!
రాబోయే మూడేళ్లకు సీపీఎం తెలంగాణ రాష్ర్ట కమిటీ కార్యదర్శిగా తమ్మినేని వీరభద్రం పునర్నియామకం లాంఛ నం కానుంది.
సాక్షి, హైదరాబాద్: రాబోయే మూడేళ్లకు సీపీఎం తెలంగాణ రాష్ర్ట కమిటీ కార్యదర్శిగా తమ్మినేని వీరభద్రం పునర్నియామకం లాంఛ నం కానుంది. పార్టీ రాష్ట్ర తొలి మహాసభల్లో భాగంగా బుధవారం ఆయన పేరును ప్రకటించనున్నారు. దాదాపు 60 మందితో రాష్ట్ర కమిటీ ఏర్పాటుకానుంది. ప్రస్తుతం రాష్ట్ర కార్యదర్శివర్గంలో ఏడుగురు సభ్యులుండగా.. ఇప్పుడది 14కు పెరిగే అవకాశమున్నట్లు సమాచారం.
రాష్ట్ర విభజన నిర్ణయం వెలువడినప్పుడు గత ఏడాది ఫిబ్రవరిలో తెలంగాణ రాష్ర్ట కార్యదర్శిగా తమ్మినేని వీరభద్రం నియమితులయ్యారు. కొత్త కమిటీ ఏర్పడి ఏడాది మాత్రమే అయినందున దాన్నే కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటివరకు రాష్ర్టంలో జరిగిన పరిణామాలు, పార్టీ పరిస్థితిపై ప్రస్తుత రాష్ర్ట కమిటీ బుధవారం చివరిసారి సమావేశమై చర్చించనుంది. ఈ సందర్భంగా వెల్లడైన అభిప్రాయాలపై తమ్మినేని సమాధానమిస్తారు. ఆ తర్వాత కొత్త కమిటీ, కారదర్శివర్గం ఎన్నిక, కొత్త కార్యదర్శి ఎన్నిక జరగనుంది. ఆ తర్వాత మహాసభల ముగింపు సందర్భంగా పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు సీతారాం ఏచూరి, బీవీ రాఘవులు ప్రసంగించనున్నారు. సాయంత్రం 4 గంట లకు నిజాం కాలేజీ మైదానంలో జరగనున్న బహిరంగ సభలోనూ పార్టీ నేతలంతా ప్రసంగించనున్నారు. అంతకుముందు మధ్యాహ్నం 2 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి నిజాం కాలేజీ వరకు ‘ఎర్రసేన కవాతు’ కార్యక్రమం ఉంటుంది. కాగా, తెలంగాణ ఏర్పడ్డాక చేపట్టిన కార్యక్రమాల ద్వారా పార్టీ బలపడిందని ఈ మహాసభల్లో సీపీఎం నాయకత్వం అభిప్రాయపడింది. మహాసభల నేపథ్యంలో చేపట్టిన ఇంటింటికి సీపీఎం ద్వారా మంచి ఫలితాలు వచ్చాయని అంచనా వేసింది.
ఈ కార్యక్రమాన్ని జిల్లా స్థాయిల్లో కూడా ప్రతి ఏటా నిర్వహించాలని నేతలు అభిప్రాయపడ్డారు. రాష్ర్టంలో విద్య, వైద్య రంగాల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మహాసభలో తీర్మానించారు. ఈ రంగాల పరిరక్షణకు మూడు నెలలపాటు రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.