‘వృద్ధులకు మనవడిలా సీఎం జగన్‌ భరోసా’ | Taneti Vanitha Speech In Vijayawada Over Old People | Sakshi
Sakshi News home page

‘వృద్ధులకు మనవడిలా సీఎం జగన్‌ భరోసా’

Published Tue, Oct 1 2019 1:28 PM | Last Updated on Tue, Oct 1 2019 2:35 PM

taneti vanitha speech in vijayawada over old people  - Sakshi

మాట్లాడుతున్న మంత్రి తానేటి వనిత

సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఎంతోమంది వృద్ధులను కలిశారని.. వారు కర్ర సాయంతో వచ్చి ఆయనకు భరోసా ఇచ్చారని స్త్రీ శిశుసంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. మంగళవారం ఎంవీకే భవన్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ డైరెక్టర్ కిషోర్‌లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వనిత..  వయోవృద్ధుల సంక్షేమం కోసం, వారి చట్టాలను వివరిస్తూ రూపొందించిన బ్రోచర్, పోస్టర్‌లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చాక వృద్ధుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ పెన్షన్ డబ్బులను పెంచారని తెలిపారు. రూ. 2000 ఉన్న పెన్షన్‌ను విడతల వారీగా రూ.3 వేల వరకు పెంచుతామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ‘కంటి వెలుగు’ కార్యక్రమం వృద్ధులకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని రెండు వేల వ్యాధులకు వర్తింప చేసేలా సీఎం నిర్ణయించారని వెల్లడించారు. ప్రతి చిన్న విషయంలో వృద్ధులకు మనవడిలా జగన్‌ వారికి భరోసా ఇస్తున్నారని పేర్కొన్నారు. వృద్ధుల కోసం ఆస్పత్రుల్లో జరియాట్రిక్ వార్డులు ఏర్పాటు చేశారని తెలిపారు. రైల్వే స్టేషన్‌లలో, బస్టాండ్‌లలో ర్యాంపులను ఏర్పాటుకు శ్రీకారం చుట్టామన్నారు. వృద్ధుల కోసం ‘స్టేట్ కౌన్సిల్’ ఏర్పాటు అంశాన్ని సీఎం జగన్‌  దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు.

సమావేశంలో మంత్రి వనిత మాట్లాడుతూ.. ‘ఈ రోజు చాలా మంచి రోజుగా భావిస్తున్నాను. ఎంతో మంది పెద్దలను కలిసే అవకాశం దక్కింది. నేటి సమాజంలో సీనియర్ సిటిజన్స్ అంటే చిన్న చూపు ఉంది. చిన్నచూపుతో చూడకుండా వారిని నేటి తరానికి దిక్సూచిగా చూడాలి. వృద్ధులతో పనేముంది అనుకోకూడదు. మనం ఈ స్థాయిలో ఉన్నామంటే మన తల్లితండ్రులే కారణం. కొందరు విదేశాలకు వెళ్లి తల్లిదండ్రులను వదిలేస్తున్నారు. వారు చనిపోయినా రావటంలేదు ఇది బాధాకరం. టెక్నాలజీతో యువత పరుగులు పెడుతున్నా.. వారి అడుగులు తప్పటడుగులు కాకుండా చూసేవారు పెద్దలే. నేటి సమాజంలో ఉమ్మడి కుటుంబాలు కనబడటంలేదు. ఉమ్మడి కుటుంబాల్లో రక్తసంబంధాల గురించి తెలుస్తుంది. నేటి యువత  కంప్యూటర్, సెల్ ఫోన్‌లకు బానిసలుగా మారుతున్నార’ని తెలిపారు.

విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. అక్టోబర్‌ ఒకటిన అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవాన్ని రాష్ట్ర స్థాయిలో నిర్వహించుకోవడం శుభపరిణామం అన్నారు. వయసు మీద పడిన వృద్ధులను అందరూ గౌరవించాలని పేర్కొన్నారు. వయో వృద్ధుల సంక్షేమ శాఖ డైరెక్టర్ కిషోర్ మాట్లాడుతూ.. వృద్ధులకు శుభాకాంక్షలు తెలుపుతూ.. సీఎం జగన్‌ అవ్వ తాతలకు పెద్ద పీట వేసేలా తీసుకున్న ఆశయాలను ముందుకు తీసుకువెళ్తా అన్నారు. వయో వృద్ధుల  సంఘాలు అనేక సమస్యలు తమ దృష్టి తీసుకువచ్చాయని వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సీనియర్‌ సిటీజన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా సేవలు అందిస్తామని వెల్లడించారు. వృద్ధుల సంఘాలు, ఎన్‌జీఓలలో రాష్ట్ర స్థాయి వర్క్‌ షాప్‌ నిర్వహించిన ఏకైక మంత్రి అని తానేటి వనితను ప్రశంసించారు. ‘నీవు దీర్ఘాయుష్మంతుడవు కావడానికి నీ తల్లిదండ్రులను గౌరవించు’ అని బైబిల్‌లో ఉందని గుర్తు చేశారు. వృద్ధులను గౌరవించి జాతి సంపదగా చూసుకోవాలని కిషోర్‌ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement