మేయర్ టార్గెట్ ఆనం వర్గం
నగరపాలక సంస్థలో ఉద్యోగుల బదిలీల అంశం రోజురోజుకు హాట్‌టాపిక్‌గా మారుతోంది. అధికార పార్టీతో సన్నిహితంగా ఉండే అధికారులకు అనుకూలంగా బదిలీలు జరగబోతున్నాయని అందరూ భావించారు. అయితే పార్టీలో రెండు వర్గాలు ఉండటంతో సీన్ మారిపోయింది. మేయర్ అబ్దుల్ అజీజ్ ఆనం వివేకానందరెడ్డి అనుకూల వర్గాన్ని టార్గెట్ చేశారు. బదిలీల్లో త మార్కు చూపించాలని నిర్ణయించారు.
నెల్లూరు, సిటీ : టీడీపీ అధికారంలోకి వచ్చాక కార్పొరేషన్ వ్యవహారాల్లో ఆ పార్టీ నేతల జోక్యం ఎక్కువైందనేది ఒప్పుకోవాల్సిన నిజం. మాట వినని అధికారులను, సిబ్బందిని బదిలీ చేయడం ఇక్కడ పరిపాటిగా మారిపోయింది. తాజాగా అంతర్గత బదిలీలు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. దీంతో అధికార కార్పొరేటర్లు తమకు అనుకూలంగా ఉండే వారికి మంచి స్థానాలు ఇప్పించేందుకు పావులు కదిపారు. జాబితాను సిద్ధం చేసేశారు. అయితే ఇటీవల టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి కార్పొరేషన్‌లో తన మార్కు చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ ఎంతోమంది అధికారులు, సిబ్బంది ఆయనకు అనుకూలంగా వ్యవహారిస్తారు. కొద్దిరోజుల నుంచి ఆయన వర్గం, కుమారుడైన కార్పొరేటర్ ఆనం రంగమయూర్‌రెడ్డి బహిరంగంగానే మేయర్, కార్పొరేషన్ పాలనపై విమర్శలు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై మేయర్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఫిర్యాదు చేశారు. అయినా వారు మేయర్‌ను టార్గెట్ చేయడం మానలేదు. దీంతో మేయర్ వర్గం కార్పొరేషన్‌లో అంతర్గత బదిలీలను వేదికగా చేసుకొని ఆనం వర్గాన్ని దెబ్బకొట్టాలని ప్రయత్నాలు ప్రారంభించింది.
ఎవరెవరు ఉన్నారు?
వివేకానందరెడ్డి టీడీపీలో చేరడంతో కార్పొరేషన్‌లో చక్రం తిప్పాలని చూస్తున్న అధికారులు, సిబ్బందికి బదిలీల్లో స్థానచలనం కలిగించాలని నిర్ణయించారు. ఆనం వర్గీయుడైన 7వ డివిజన్ కార్పొరేటర్ కిన్నెరప్రసాద్ రంగమయూర్‌రెడ్డితో కలిసి మేయర్‌పై విమర్శల దాడి చేశారు. కిన్నెర ప్రసాద్ సోదరుడు కిన్నెర మాల్యాద్రి శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. దీంతో మాల్యాద్రిని మరో డివిజన్‌కు బదిలీ చేయాలని మేయర్ వర్గం భావిస్తోంది. ఇంజనీరింగ్, శానిటేషన్, రెవెన్యూ, టౌన్‌ప్లానింగ్ విభాగాల్లోని సిబ్బం దిలో ఆనంకు అనుకూలంగా ఉన్న అధికారులు, సిబ్బంది జాబితాను మేయర్ వర్గం ఇప్పటికే సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా కార్పొరేషన్‌లో జరిగే వ్యవహారాలను ఆనం చెవిన వేసేవారికి ప్రాధాన్య త లేకుండా చేయాలని భావిస్తున్నారు. సదరు అధికారులను, సిబ్బందిని గుర్తించే పని ముమ్మరంగా జరుగుతున్నట్లు సమాచారం. వారి ఆటలు సాగనివ్వకండా చేస్తే తమపై విమర్శలు చేసేందుకు విషయాలు దొరకవనేది మేయర్ వర్గం ఆలోచన. ఇప్పటికే మలుపు తీసుకున్న బదిలీల అంశం ఇంకా ఏయే మలుపులు తీసుకుంటుందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.