మందుల వ్యాపారంపై పన్నుపోటు
వజ్రపుకొత్తూరు: వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ) దెబ్బకు పలు రంగాల్లో వ్యాపారం కుదేలవుతోంది. ఇప్పటికే వస్త్రాలు, గ్రానైట్ వ్యాపారులు పన్ను సడలింపు కోరుతూ ఆందోళన బాట పట్టారు. తాజాగా జీఎస్‌టీ ప్రభావం మందుల వ్యాపారంపైనా పడింది. జూలై 1 నుంచి జీఎస్‌టీ బాదుడుకు రంగం సిద్ధం కావడంతో చాలా ఏజెన్సీలు స్టాకును తిప్పి పంపుతున్నాయి. దీంతో మందుల కొరత ఏర్పడి విక్రయాలు 25 శాతం మేర పడియాయి. షాపుల్లో ఇప్పటికే ఉన్న స్టాక్‌పై కూడా పన్ను భాగం పడుతుండడంతో ఏజన్సీలు స్టాక్‌ను ఆయా ఫార్మా కంపెనీలకు తిప్పి పంపుతున్నాయి. కేంద్రం ప్రవేశపెట్టిన నూతన పన్ను విధానంతో రోజూ కీలకంగా అవసరమయ్యే మందులు మెడికల్ దుకాణాల్లో లభించడం లేదు. దీంతో చేసేది లేక కాంబినేషన్‌తో ఉన్న ఇతర కంపెనీల మందులను ప్రజలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. ఇప్పటికే 30 వాతం మేర మందులు మార్కెట్‌లో లభించడం లేదని సమాచారం.
5 నుంచి 28 శాతం పన్ను..
జిల్లాలో దాదాపు 2136 మంది ఔషధ విక్రయదారులు ఉన్నారు. ఇందులో సుమారు 195 దుకాణాలు హోల్‌సేల్ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయి. రోజుకు సగటున రూ.1.86 కోట్ల వ్యాపారం జరగుతోందని అంచనా. జీఎస్టీ ప్రభావంతో మందులపై పన్ను వ్యత్యాసం కనిపిస్తోంది. ప్రస్తుతం ఔషధాలపై 5 శాతం పన్ను విధిస్తుండగా జీఎస్టీ వస్తే నాలుగు స్థాయిలుగా పన్ను విధించనున్నారు. వివిధ కేటగిరీల ఔషధాల టర్నోవర్ ఆధారంగా 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతంగా పన్ను చెల్లించి వ్యాపారులు మందులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ నెలాఖరు వరకు దుకాణాల్లో మిగిలిన సరుకులకు కూడా జీఎస్టీ పన్నును ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. దీంతో దుకాణదారులు ఆందోళన చెందుతున్నారు. పైగా ఈ మొత్తాన్ని ఒకేసారి చెల్లించాల్సి ఉండటం పెద్ద సమస్యగా మరిందని పలువురు దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అదనపు బాదుడు..
జీఎస్టీ ప్రభావం ఔషధ వ్యాపారంపై తీవ్రంగా పడుతోంది. జూలై ఒకటి నుంచి 80 శాతం ఔషధాలపై 12 శాతం, షుగర్‌ను నియంత్రించే ఇన్సులిన్‌పై 5 శాతం, మెడికేటెడ్ సోపులు, టూత్‌పేస్ట్‌లపై 18 శాతం, ఔషధ ఆహార పదార్థాలపై 28 శాతం పన్ను పడనుంది.