వ్యాట్ బాదుడుకు రంగం సిద్ధం | Taxes targeted in vote on account budget | Sakshi
Sakshi News home page

వ్యాట్ బాదుడుకు రంగం సిద్ధం

Published Tue, Feb 11 2014 4:17 AM | Last Updated on Mon, May 28 2018 4:15 PM

వ్యాట్ బాదుడుకు రంగం సిద్ధం - Sakshi

వ్యాట్ బాదుడుకు రంగం సిద్ధం

రాష్ట్ర ప్రజలపై ఈ ఏడాది అదనంగా రూ. 10 వేల కోట్ల భారం
 మొత్తం టార్గెట్ రూ. 61, 950 కోట్లు

 
 రాష్ట్ర ప్రజలపై విలువాధారిత పన్ను(వ్యాట్) భారం పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వాణిజ్య పన్నుల రూపంలో రూ. 61,950 కోట్ల వ్యాట్‌ను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత ఏడాదితో పోలిస్తే ఇది రూ. 9450 కోట్లు ఎక్కువ. దీంతోపాటు గత సంవత్సరం తగ్గిన వ్యాట్ వసూళ్లను కూడా ఈ ఏడు వాణిజ్య పన్నుల శాఖ టార్గెట్‌లో చేర్చారు.

  ఇబ్బడి ముబ్బడిగా పన్నులు పెంచడంతో గత ఏడాది కొనుగోళ్ళు తగ్గాయి. ఈ లెక్కన టార్గెట్ తగ్గాలి. కానీ తాజా బడ్జెట్‌లో లక్ష్యాన్ని మరో రూ. 9450 కోట్లు పెంచింది. అయితే  ప్రభుత్వం మాత్రం గత ఏడాదితో పోలిస్తే 18 శాతం మాత్రమే పన్నులు పెంచినట్టు చెబుతోంది.
  2013-14 ఆర్థిక సంవత్సరంలో వ్యాట్ వసూళ్ళు దాదాపు రూ. 6 వేల కోట్లు తగ్గాయి. ఆ తగ్గిన మొత్తం, పెంచిన రూ. 9,450 కోట్లు కలుపుకుంటే దాదాపు రూ. 15 వేల కోట్లు వాణిజ్య పన్నుల శాఖ నిర్థాక్షిణ్యంగా పేద, మధ్యతరగతి వర్గాల నుంచి వసూలు చేయాల్సి ఉంటుంది. దానికి, మరికొన్ని వస్తువులను అధిక వ్యాట్ (14.5) శాతం పరిధిలోకి తేవడమే మార్గమని అధికారులు అంటున్నారు.
  రాష్ట్రంలో మొత్తం 2.10 కోట్ల కుటుంబాలున్నాయి. ప్రతీ కుటుంబంపై  2013-14 వార్షిక బడ్జెట్ లెక్కల ప్రకారం రూ. 26 వేలకు పైగా పన్నుల భారం మోపారు. తాజా బడ్జెట్‌లో మరో రూ. 10 వేల కోట్ల బాదుడు కారణంగా, ఒక్కో కుటుంబం ఏడాదికి రూ. 5 వేలకు పైగా పన్నుల రూపంలో అదనంగా ఖజానాకు చెల్లించాల్సి ఉంటుంది.


  2005లో వచ్చిన వ్యాట్ పరిధిలోకి ఇప్పటికే  592 వస్తువులను చేర్చారు. కేవలం 20 శాతం వస్తువులను మాత్రమే 5 శాతం పన్నుల పరిధిలో ఉంచి, మిగతా 80 శాతం 14.5 శాతం పన్నుల పరిధిలోకి తెచ్చారు. బియ్య, పప్పు, ఉప్పు వంటి నిత్యావసరాలపైనా వ్యాట్ బాదుడు బాదారు. ఇందులో 87 శాతం కిరణ్‌కుమార్ సర్కారు వచ్చిన తర్వాత జరిగినవే కావడం విశేషం.
  ఇప్పుడు మరికొన్ని నిత్యావసర వస్తువులు 14.5 శాతం పరిధిలోకి వచ్చే పరిస్థితి ఉంది. వాటితో పాటు, మధ్యతరగతి కొనుగోలు చేసే ఎలక్ట్రానిక్, గృహోపకరణాలకు సంబంధించిన 70 వస్తువులను అధిక పన్ను పరిధిలోకి చేర్చే ఆలోచనలో ఉన్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. దిగుమతి అయ్యే దుస్తుల్లో మరికొన్నింటిపైనా పన్ను బాదుడు తప్పదని భావిస్తున్నారు.
  అక్రమ రవాణాను నిరోధించడం ద్వారా పన్నుల భారం తగ్గించవచ్చని అంతర్గత నివేదికలు పేర్కొంటున్నా, ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. నిఘా వ్యవస్థను పటిష్టం చేయడంలేదు. కేవలం ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది.
 
 ఉన్నత విద్య.. కేటాయింపు మిథ్య  
 
 టెక్విప్‌కు కోత.. ‘రూసా’కు అరకొర నిధులు!

 
 సాంకేతిక విద్యలో నాణ్యత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో కొనసాగే పథకం టెక్నికల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రాం (టెక్విప్)కు రాష్ట్రం ఈసారి బడ్జెట్‌లో కోతపెట్టింది. ఈ పథకం కింద ప్రభుత్వ పాలిటెక్నిక్ కశాశాలల భవన నిర్మాణాలకు  నిధులు వెచ్చించాల్సి ఉంది. కోత విధించడంతో భవననిర్మాణాలకు ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే కేంద్ర ప్రాయోజిత పథకమైన రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్‌కు (రూసా) కూడా నిధులను అరకొరగానే విదిల్చింది. సోమవారం ఆర్థికమంత్రి ప్రవేశపెట్టిన 2014-15 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌లో ఉన్నతవిద్యకు గత ఏడాదితో పోల్చితే అదనంగా ఒక్క పైసా కేటాయించలేదు.
     టెక్విప్‌కు గత ఏడాది రూ. 105 కోట్లు కేటాయించగా ఈసారి వాటికి కోత పెట్టింది.
     సాంకేతిక విద్య ప్రధాన కార్యాలయానికి వెచ్చించాల్సిన రూ. కోటి, ప్రభుత్వ పాలిటెక్నిక్ భవనాల నిర్మాణాలకు రూ.4.86 కోట్లు కలిపి మొత్తం  రూ. 111 కోట్లకు కోత విధించింది.
     రాష్ట్రంలో  ‘రూసా’అమలుకు రూ.2,600 కోట్లతో ప్రణాళిక ఉండగా, ఇందులో రాష్ట్రం వాటా రూ. 910 కోట్లకుగాను కేటాయించింది మాత్రం అత్తెసరే.

 ఫీజులకు ‘లోటు’
 
 పేద విద్యార్థులకు ఉన్నత విద్యనందించే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి మళ్లీ కష్టాల బడ్జెట్టే దిక్కయ్యింది. ఎప్పటిలాగే ఈ పథకం అమలుపై ప్రభుత్వం నిరాసక్తతను, నిర్లిప్తతను చూపుతూ మళ్లీ ‘లోటు’ బడ్జెట్‌నే ప్రతిపాదించింది. 2014-15 సంవత్సరానికిగానూ ఫీజుల పథకానికి ప్రభుత్వం రూ. 4,444 కోట్లు కేటాయించారు. ఇందులో ఎస్సీలకు రూ. 610 కోట్లు, ఎస్టీలకు రూ. 610 కోట్లు, బీసీలకు రూ. 1,985 కోట్లు, ఈబీసీలకు రూ. 600 కోట్లు, మైనార్టీకు రూ. 630.16 కోట్లు, వికలాంగులకు రూ. 9 కోట్లు ఇస్తున్నట్లు చూపెట్టారు. 13వ ఆర్థిక సంఘం నిధుల నుంచి ఎస్టీ విద్యార్థులకు రూ. 320 కోట్లు ఫీజుల పథకానికి కేటాయించారు. ఎస్సీ విద్యార్థులకు 2013- 14 బడ్జెట్‌లో కేంద్రం వాటాతో కలిపి కేటాయించిన రూ. 638 కోట్లు ఈసారి చూపించలేదు. అలాగే ఎస్టీలకు కేంద్రం ఇచ్చిన రూ. 290.51 కోట్లు, బీసీ స్కాలర్‌షిప్పులు రూ. 100 కోట్లు కూడా ఈసారి బడ్జెట్‌లో కనిపించలేదు. కేంద్ర బడ్జెట్ ఇంకా ప్రవేశపెట్టనందున వీటిని కలపలేదు. ఈబీసీలను గత ఏడాది తరహాలోనే ఈసారి కూడా ట్యూషన్‌ఫీజుకు మాత్రమే పరిమితం చేశారు. వారికి స్కాలర్‌షిప్ కింద రూపాయి కూడా కేటాయించలేదు.

 మిగిలేది రూ. 1,800 కోట్లే..

 కేటాయింపుల సంగతి పక్కనబెడితే.. 2013-14 సంవత్సరానికి ఫీజుల పథకానికి అవసరమైన రూ. 4,500 కోట్లలో రూ. 1,805.87 కోట్లు మాత్రమే విడుదల చేశారు. వీటిని కూడా ఇంకా విద్యార్థుల ఖాతాలకు జమ చేయలేదు. అంటే ఈ ఏడాదికి సంబంధించినవే దాదాపు రూ. 2,700 కోట్లు బకాయిలుంటాయి. వచ్చే ఏడాదికి కేటాయించిన వాటిలో ఈ బకాయిలు పోతే మిగిలేవి రూ. 1,800 కోట్లే. కేంద్రం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ. 1,000 కోట్లు విడుదల చేస్తే ఈ మొత్తం రూ. 2,800 కోట్లకు పెరుగుతుంది. ఇక వచ్చే ఏడాది అంచనా రూ. 5,000 కోట్ల వరకు ఉండవచ్చు. ఏకీకృత ఫీజులు వృత్తివిద్యా కళాశాలలన్నింటికీ వర్తింపజేస్తే మరింత పెరిగే అవకాశముంది. ఈ పరిస్థితుల్లో మరో రూ. 2,000 కోట్లు ఇచ్చి ఉంటే వచ్చే ఏడాది ఫీజులు కూడా పూర్తిస్థాయిలో చెల్లించే అవకాశముండేది.
 
 
 ట్రిపుల్ ఐటీలపై శీతకన్ను
 
  2014-15 ఆర్థిక సంవత్సరంలో ట్రిపుల్ ఐటీల అభివృద్ధికి రూ. 620 కోట్లకు పైగా కావాలని కోరగా రూ. 353 కోట్లు మాత్రమే కేటాయించారు. దీంతో రాష్ర్టంలోని ట్రిపుల్ ఐటీలు ఆర్థిక ఇబ్బందులు తప్పేలా లేవు.  మరిన్ని వివరాలు...
     2013-14 బడ్జెట్‌లో ఆర్జీయూకేటీకి ప్రణాళిక వ్యయం కింద రూ. 722 కోట్లు అడిగితే కేవలం రూ. 353 కోట్లు మాత్రమే కేటాయించారు. 2014-15 బడ్జెట్‌లోనూ అంత మొత్తమే కేటాయించి సర్కారు చేతులు దులుపుకుంది.
     వర్సిటీ నిర్వహణ భారమవుతోందని అధికారులు పదేపదే విజ్ఞప్తులు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. కనీస వసతులు, అధ్యాపక సిబ్బంది లేకున్నా అదనంగా పైసా ఇవ్వకపోవడంతో బాసర, నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ కేంద్రాలు సమస్యల వలయంలో నుంచి బయటపడే పరిస్థితి లేకుండా పోయింది.
     సీఎం, డిప్యూటీ సీఎం జిల్లాల్లో గత ఏడాది కొత్తగా ఏర్పాటు చేసిన జేఎన్‌టీయూ కాలేజీలకు మాత్రం గత ఏడాదిలాగే భారీగా నిధులు కేటాయించారు. చిత్తూరు జిల్లా కలికిరి జేఎన్‌టీయూకు రూ. 100 కోట్లు, మెదక్ జిల్లా సుల్తాన్‌పూర్ జేఎన్‌టీయూకు రూ.121 కోట్లు కేటాయించడం గమనార్హం.
 నాలుగేళ్లుగా కేటాయింపులిలా...
     2010-11లో ఆర్జీయూకేటీకి  రూ. 400 కోట్లు బడ్జెట్‌లో కేటాయించినా యూనివర్సిటీకి ఇచ్చింది రూ. 219 కోట్లే.
     2011-12 ఆర్థిక సంవత్సరంలో రూ. 425 కోట్లు కేటాయించినా విడుదల చేసింది రూ. 245 కోట్లు మాత్రమే.
     2012-13లో రూ. 600 కోట్లు బడ్జెట్ కేటాయింపుల్లో చూపినా ఇచ్చింది రూ. 386 కోట్లే.
     2013-14లో రూ. 722 కోట్లు అడిగితే రూ. 353.50 కోట్లు మాత్రమే కేటాయించారు.
     2014-15లోనూ రూ. 353.50 కోట్లకే పరిమితం చేసింది.
 
 తలసరి ఆదాయం రూ. 78,564
 
 రాష్ట్రంలో తలసరి ఆదాయం ఏటా పెరుగుతోంది. 2011-12 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2012-13లో తలసరి ఆదాయం 13.29 శాతం పెరిగి రూ.78,564 చేరింది. శాసనసభ, మండలికి ప్రభుత్వం సోమవారం సమర్పించిన సామాజిక, ఆర్థిక సర్వేలో ఈ అంశాన్ని పేర్కొన్నారు.

 
 మాటలకు అంకెలకు పొంతన ఎక్కడ?
 
 రాష్ట్రంలో వ్యవ‘సాయం’ 3.65 శాతమే!

 
 కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఓట్‌ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రతి అంకెలోనూ... మొక్కుబడి వైఖరి ప్రతిఫలించింది. వ్యవసాయ, అనుబంధ రంగాలకు బడ్జెట్ కేటాయింపు తగ్గింది. గత ఏడాది వార్షిక బడ్జెటలో వ్యవసాయ అనుబంధ రంగాల వాటా 3.80 శాతం ఉండగా, ప్రస్తుతం (2014-15) బడ్జెట్‌లో ఇది 3.65 శాతానికి పడిపోయింది. ఏటా సగటున 10 శాతంగా ఉంటున్న ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకుంటే ఈ తగ్గుదల కనీసం 15 శాతం ఉంటుందని ఆర్థికరంగ నిపుణులు చెబుతున్నారు.
  గత ఏడాది ధరల స్థిరీకరణకోసం ప్రవేశపెట్టిన ‘ఆలంబన’ పథకానికి రూ.100కోట్లు ప్రకటించిన ప్రభుత్వం ఈసారి ఆ ఊసే ప్రస్తావించలేదు.
  వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఆర్థిక మంత్రి చెప్పినప్పటికీ, అంకెల్లో  ఆ సంగతే లేదు.
  చాలా అంశాల్లో ప్రభుత్వం చెప్పినదానికి, కేటాయింపులకు పొంతన కనిపించలేదు.
  రైతులకు పంటరుణాలపై వడ్డీ చెల్లింపులకు సంబంధించిన కేటాయింపులు ఒక్క రూపాయి కూడా పెంచలేదు.
  గత బడ్జెట్‌లో వడ్డీ లేని రుణాల కోసం రూ.500 కోట్లు, పావలా వడ్డీకి రూ.60 కోట్లు కేటాయిస్తే.. ఈసారి అవే అంకెలను యథాతథంగా ఉంచారు.
  బ్యాంకులు ఇస్తున్న 80 వేల కోట్ల పంటరుణాలకు జీరో వడ్డీ వర్తింపజేయూలంటే బడ్జెట్‌లో కనీసం 1600 కోట్లరుునా కేటాయించాల్సి ఉందని వ్యవసాయూధికారులే చెబుతున్నారు.
  వ్యవసాయ అనుబంధ రంగాలకు  వివిధ పథకాలకు గత ఏడాది బడ్జెట్ కేటాయింపులను యథాతథంగా ఉంచేశారు.
  జాతీయ పంటల బీమా పథకానికి  ఇటీవల ప్రీమియం మొత్తాన్ని  కేంద్రం 11 శాతానికి పెంచింది.  దీనికి రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపులు పెంచాలి. అయితే గత ఏడాది కేటాయించిన రూ.410 కోట్లే యథాతథంగా ఉంచేశారు.
 
 
 వడ్డీ లేని రుణాలకు అరకొరే
 
 గ్రామీణానికి రూ.650 కోట్లు, పట్టణాలకు 150 కోట్లే

 
 సాక్షి, హైదరాబాద్: మహిళా సంఘాలకు భారీగా రుణాలు ఇప్పిస్తున్నామని, వారు వడ్డీ కట్టాల్సిన అవసరం లేదంటూ గొప్పలు చెబుతున్న ప్రభుత్వం ఈసారి వడ్డీ లేని రుణాలకు కేటాయించిన మొత్తం చూస్తే వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వడ్డీకింద బ్యాంకులకు దాదాపు రూ.1,400 కోట్లు కావాల్సి ఉండగా ఇప్పటివరకు 650 కోట్లు మాత్రమే ఇచ్చిన సర్కారు వచ్చే ఆర్థిక సంవత్సరానికి కూడా అంతే మొత్తాన్ని కేటాయించింది. మరిన్ని వివరాలు...
  గడిచిన మూడు నెలలుగా వడ్డీలేని రుణాల బకాయిలను ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో బ్యాంకర్లు మహిళా సంఘాల నుంచి అసలుతోపాటు వడ్డీ కూడా కట్టించుకుంటున్నారు.
  వచ్చే ఆర్థిక సంవత్సరానికి వడ్డీ లేని రుణాల కింద కనీసం రూ.1,500 కోట్లు కావాల్సి వస్తుందని అంచనాలున్నాయి. అయితే అందుకు తగ్గట్టుగా కేటాయింపులు లేకపోవడంతో మహిళా సంఘాలకు ఇక్కట్లు తప్పవని తెలుస్తోంది.
  పట్టణ ప్రాంతాల్లోని మహిళా సంఘాలకు వడ్డీలేని రుణం కింద ఈ సంవత్సరం సుమారు రెండువేల కోట్ల మేరకు రుణాలిప్పించారు. అంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆ సంఘాలకు కనీసం 280 కోట్ల మేరకు వడ్డీ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. కానీ కేవలం 150 కోట్లే కేటాయించారు.
  కేంద్రంలో వచ్చే కొత్త ప్రభుత్వం జాతీయ పట్టణ నవీకరణ పథకాన్ని అమలు చేస్తుందో లేదో తెలియదు కానీ ఈ పథకం కింద కేంద్రంనుంచి రూ.1,855 కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఈ పథకం కింద రాష్ట్రానికి 150 కోట్లు మించి రాకపోవడం గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement