
జనాన్ని బాదుడే!
బడ్జెట్‌లో స్పష్టమైన సంకేతాలు
రాష్ట్ర సొంత ఆదాయ అంచనాలు భారీగా పెంపు
ఏకంగా 15- 18 శాతం పెరుగుదల చూపిన ప్రభుత్వం
ప్రజలపై పెద్దఎత్తున భారం మోపేందుకు సిద్ధం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వాస్తవిక ఆదాయం రోజురోజుకీ తగ్గిపోతున్నప్పటికీ గొప్పలు పోయేందుకు ప్రభుత్వం రూపొందించిన తాజా బడ్జెట్... అంతిమంగా ప్రజలపైనే భారీ భారం మోపనుంది. ఒకవైపు వ్యాట్ ఆదాయం పడిపోతున్నా ప్రభుత్వం మాత్రం వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారీగా ఆదాయం వస్తుందని అంచనా వేసింది. తద్వారా ప్రజలపై భారీగా వ్యాట్ వడ్డన ఉండనుందని తెలుస్తోంది. గతంలో వ్యాట్ ఆదాయం పెంచుకునేందుకు సర్కారు కొత్తకొత్త వస్తువులపై పన్ను భారం మోపింది. తాజా బడ్జెట్‌లో కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా 12 శాతం మాత్రమే పెరుగుతుందని అంచనా వేసిన ప్రభుత్వం... సొంత ఆదాయంలో మాత్రం ఏకంగా 18 శాతం వరకూ పెరుగుతుందని పేర్కొంది. అంటే ప్రజలపై పెద్ద ఎత్తున పన్నుల భారం మోపేందుకు సిద్ధపడిందన్నమాట!
ఇవీ ఆదాయం వివరాలు..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పన్నుల్లో వాటా రూ.24,132 కోట్లు వస్తుందని అంచనా వేయగా 2014-15లో ఈ మొత్తం 27,028 కోట్లు అని లెక్కకట్టింది. అంటే పెరుగుదల 12 శాతం మాత్రమే.
రాష్ట్ర పన్నుల ఆదాయం మాత్రం 15 నుంచి 18 శాతం వరకూ పెరుగుతుందని అంచనా వేసింది.
2013-14లో వ్యాట్ రూ.52,500 కోట్లు కాగా వచ్చే ఏడాదిలో ఏకంగా రూ.61,950 కోట్లకు పెరుగుతుందని లెక్కకట్టింది. పెరుగుదల 18 శాతంగా ఉంది. వాస్తవానికి ఇప్పటివరకు వచ్చిన వ్యాట్ ఆదాయం రూ.36 వేల కోట్లు మాత్రమే. దీనితో లెక్కిస్తే ఏకంగా రూ.50 శాతం పెంపును ప్రభుత్వం ప్రతిపాదించిందన్న మాట.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ ఆదాయం రూ.7,500 కోట్లు కాగా, వచ్చే ఏడాది 15 శాతం పెరిగి రూ.8,625 కోట్లు వసూలు చేస్తామని పేర్కొంది.
ప్రస్తుతం మోటార్ వెహికల్ పన్ను ద్వారా వచ్చే ఆదాయం రూ.4,352 కోట్లు అయితే... ఇది కూడా 15 శాతం పెరిగి 2014-15లో రూ.5,005 కోట్లకు చేరుతుందని లెక్కగట్టింది.
స్టాంపులు, రిజిస్ట్రేషన్లు ద్వారా ప్రస్తుతం ఉన్న రూ.6,414 కోట్ల ఆదాయం 15 శాతం పెరిగి రూ.7,377 కోట్లకు చేరుతుందని అంచనా. అంటే రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు తప్పదన్నమాట!
ఓటాన్ అకౌంట్ ఎందుకంటే...?
ఎన్నికల సమయంలో కేంద్రంలో కానీ, రాష్ట్రాల్లో కానీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఆర్థిక సంవత్సరం మధ్యలో ఎన్నికలు జరుగుతాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడేదాకా ప్రభుత్వపాలన సక్రమంగా సాగేందుకు ఆర్థిక సంవత్సరంలోని మొదటి నాలుగు నెలలు లేదా ఆరు నెలల కాలానికిగానీ నిధులను ఖర్చు చేసేందుకు సభ ఆమోదాన్ని పొందుతారు. ఈ ఆమోదం తీసుకోకపోతే ఒక్కపైసా కూడా నిధులు విడుదల చేయలేని పరిస్థితి. ఉద్యోగుల జీతభత్యాలకు కూడా నిధులు ఇవ్వలేని దుస్థితి ఏర్పడుతుంది. అందుకే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్-206 ప్రకారం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆమోదం తీసుకుంటారు. ఎన్నికల అనంతరం మళ్లీ పూర్తిస్థాయి బడ్జెట్‌ను కొత్త ప్రభుత్వం ప్రవేశపెడుతుంది.