ఆబద్ధాలను ఆధారంగా చేసుకొని టీడీపీ బతుకీడుస్తోందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు దుయ్యబట్టారు.
సాక్షి, హైదరాబాద్: ఆబద్ధాలను ఆధారంగా చేసుకొని టీడీపీ బతుకీడుస్తోందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు దుయ్యబట్టారు. టీడీపీ ప్రజల అభిమానం పొందలేక ఇతర పార్టీలపై బురద చల్లడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. గోబెల్స్ ప్రచారం చేయడంలో ఆరితేరిన చంద్రబాబును ఆదర్శంగా తీసుకొని ఆ పార్టీ నేతలు పయ్యావుల కేశవ్, రేవంత్ లాంటివారు నిత్యం అబద్ధాలను చెప్పడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. గట్టు రామచంద్రరావు ఆదివారమిక్కడ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ మైనారిటీ ప్రభుత్వం కొనసాగడానికి ముఖ్య కారణం చంద్రబాబేనని స్పష్టం చేశారు.
అవిశ్వాసం సందర్భంగా బాబు విప్‌జారీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడి ప్రజల పాలిట గుదిబండలా తయారు చేశారన్నా రు. ఎఫ్‌డీఐలపై పార్లమెంట్‌లో ఓటింగ్ సందర్భంగా కాంగ్రెస్‌కు సహకరించిన ముగ్గురు టీడీపీ ఎంపీలపై ఇప్పటిదాకా చంద్రబాబు చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. నాలుగేళ్లుగా కాంగ్రెస్, టీడీపీ రెండూ కలిసి పనిచేస్తున్నాయన్నారు. బాబు టీడీపీని కాంగ్రెస్ పార్టీకి బ్రాంచి ఆఫీసుగా మార్చారన్నారు. పయ్యావుల వ్యాఖ్యల్ని మీడియా ప్రస్తావించగా గట్టు స్పందిస్తూ.. రాష్ట్ర విభజనపై టీడీపీ వైఖరేంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో చంద్రబాబు చేసిన దీక్ష విభజన కోసమా? సమైక్యం కోసమా? అనేది చెప్పాలన్నారు. టీడీపీ నేతలు పయ్యావుల, ఎర్రబెల్లి ఇద్దరూ ఒకేమాట చెప్పగలరా? అని ప్రశ్నించారు.