
పరాకాష్టకు చేరిన కాంగ్రెస్, టిడిపి డ్రామాలు:గట్టు
హైదరాబాద్: యుపిఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ఒక పక్క రాష్ట్రాన్ని ముక్కలు చేస్తుంటే మరో పక్క కాంగ్రెస్, టీడీపీ నేతల డ్రామాలు పరాకాష్ఠకు చేరాయని వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు విభజనవాదా? సమైక్యవాదా? ఏవాదో ఆయన ఎందుకు స్పష్టం చేయడంలేదు? అని ప్రశ్నించారు.
వైఎస్ఆర్ సిపి గతంలో అవిశ్వాసం పెట్టినప్పుడు టీడీపీ మద్దతిచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా? విప్ జారీ చేసి ప్రభుత్వాన్ని కాపాడింది మీరు కాదా? అని అడిగారు. చంద్రబాబు,కిరణ్‌లు సోనియాకు రెండు చేతుల్లా వ్యవహారిస్తున్నారని విమర్శించారు. సోనియా కనుసన్నల్లోనే సీమాంధ్ర ఎంపీలు నడుస్తున్నారని చెప్పారు. టిడిపి సభ్యులు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంలో మిగతా ఎంపీలు ఎందుకు సంతకం చేయలేదు? అని ప్రశ్నించారు. టీడీపీ ఎంపీలు ఢిల్లీలో డ్రామాకు బదులు చంద్రబాబు ఇంటిముందు ధర్నా ఎందుకు చేయడం లేదు అని గట్టు అడిగారు.