సాగునీటి సంఘాల ఎన్నికలకు నామినేషన్ వేసేందుకు వెళ్లిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ వారు దాడులకు పాల్పడ్డారు.
తొండంగి (తూర్పు గోదావరి) : సాగునీటి సంఘాల ఎన్నికలకు నామినేషన్ వేసేందుకు వెళ్లిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ వారు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో ముగ్గురు కార్యకర్తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం ఎ.కొత్తపల్లి గ్రామానికి జరగబోయే సాగు నీటి సంఘాల ఎన్నికలకుగాను సోమవారం మధ్యాహ్నం నామినేషన్ వేసేందుకు వైఎస్సార్‌సీపీ నాయకులు పంచాయతీ కార్యాలయానికి వెళ్లారు.
అయితే అక్కడే ఉన్న టీడీపీ నాయకులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తోపులాట జరిగింది. రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో వైఎస్సార్‌సీపీకి చెందిన ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసుల బలగాలను మోహరించారు.