టీడీపీ, బీజేపీ మధ్య పబ్లిసిటీ లొల్లి!
టీడీపీ, బీజేపీ మధ్య పబ్లిసిటీ లొల్లి!
Published Fri, Dec 4 2015 9:12 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
విజయవాడ: ఇంద్రకీలాద్రి వద్ద ఫ్లై ఓవర్ శంకుస్థాపన కార్యక్రమం కోసం ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు బీజేపీ, టీడీపీల మధ్య వివాదాన్ని రాజేస్తోంది. ప్లై ఓవర్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.282 కోట్ల నిధులు మంజూరు చేసిన విషయం విదితమే. ఈ ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పనులకు ఈ నెల 5న కేంద్ర భూ ఉపరతల రవాణా శాఖమంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేయనున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు హాజరవుతారు. ఈ సందర్భంగా జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి సుజనాచౌదరి తదితరులు పాల్గొంటారని భావిస్తున్నారు.
ఫ్లెక్సీల్లో ప్రధానికి ప్రాధాన్యత నిల్
కేంద్ర ప్రభుత్వం నిధులతో ఫ్లై ఓవర్ నిర్మిస్తున్నప్పటికీ ప్రధాని నరేంద్రమోదీకి ప్లై ఓవర్ శంకుస్థాప కార్యక్రమం సందర్భంగా వేసిన ఫ్లెక్సీల్లో తగిన ప్రాధాన్యం కనపడలేదు. ప్రధాన రహదార్లలో ఏర్పాటు చేసే ఫ్లెక్సీల్లోనూ ప్రధాని ఫొటోనే పెట్టకుండా కేవలం కేంద్రమంత్రులు నితీన్ గడ్కరీ, వెంకయ్యనాయుడు, చంద్రబాబు ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని) ఫోటోలు పెట్టడం, మరికొన్ని ఫోటోల్లో లోకేష్, ఎన్టీఆర్ ఫోటోల వద్ద ప్రధాని ఫొటోను పెట్టడం బీజేపీ నేతలకు ఆగ్రహం తెప్పిస్తోంది. ప్రధాని ఫొటో కంటే ముఖ్యమంత్రి ఫొటో పెద్దగా ఉండడంపై సీరియస్ అవుతున్నారు. టీడీపీ నేతలు కావాలనే ప్రధానిని చిన్నచూపు చూస్తూ ఈ విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది బీజేపీ నేతలు నగరంలో ఇప్పటికే ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వీడియో తీయించి, ఆ వీడియోలను ప్రధానమంత్రి కార్యాలయానికి మెయిల్ ద్వారా పంపించినట్లు పార్టీ వర్గాల సమాచారం.
తమ ఘనతేనని టీడీపీ నేతల ప్రచారం
కేంద్ర ప్రభుత్వం ఫ్లై ఓవర్‌కు రూ.282 కోట్లు ఇస్తే.. ఈ విషయాన్ని పక్కన పెట్టి ప్లై ఓవర్ సాధించిన ఘనత తమదేనని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. ఫ్లై ఓవర్ కోసం ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న పోరాటం చేశారని, దాని ఫలితంగానే ఫ్లై ఓవర్ మంజూరైందని ప్రచారం చేస్తున్నారు. దీనికి తోడు ఫ్లై ఓవర్ మంజూరైన సందర్భంగా చంద్రబాబును పొగుడుతూ బుద్దా వెంకన్న ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు కూడా వివాదాస్పదమవుతున్నాయి. రాష్ట్రానికి రూ.కోట్లు ఇచ్చిన నరేంద్రమోదీని పక్కన పెట్టి చంద్రబాబునాయుడు, బుద్దా వెంకన్న ప్రజల్లో హైలైట్ అవుతున్నారంటూ ఇప్పటికే బీజేపీ నేతలు ఒక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపారు. ఇదిలా ఉండగా గడ్కరీ చేత శంకుస్థాపన కార్యక్రమం చేయించకుండానే... పుష్కరాలకు ఫ్లై ఓవర్ పూర్తి చేయాలన్న సూచన మేరకు అధికారులు పనులు ప్రారంభించడాన్ని కూడా కమలదళం తప్పుపడుతోంది.
Advertisement