కోడెలకు టీడీపీ నేతల ఝలక్ | TDP Cadre Complaint On Kodela Siva Prasad Rao In Guntur | Sakshi
Sakshi News home page

 కోడెలను తప్పించండి

Published Wed, Aug 7 2019 8:27 AM | Last Updated on Wed, Aug 7 2019 12:54 PM

TDP Cadre Complaint On Kodela Siva Prasad Rao In Guntur - Sakshi

కోడెల శివప్రసాద్‌ను ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిపించినందుకు నియోజకవర్గాన్ని పదేళ్లు వెనక్కు నెట్టారు. కే–ట్యాక్స్‌ల పేరుతో సొంత పార్టీ నేతలను కూడా వదలకుండా దోచుకున్నారు. ఇక చాలు. ఆ కుటుంబ పెత్తనం మేం భరించలేమ’ని సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం ఆ నియోజకవర్గ నాయకులు చంద్రబాబును కలవడం ఇదే తొలిసారి. కే–ట్యాక్స్‌ కారణంగా నియోజకవర్గంలో పార్టీ పరువుపోయిందని, కోడెల నాయకత్వంతో పని చేయలేమని చెప్పబోతున్నట్లు టీడీపీ నేతలు వెల్లడించారు.

సాక్షి, గుంటూరు: గత ఎన్నికల్లో సత్తెనపల్లి ఎమ్మెల్యేగా కోడెల ప్రసాదరావు గెలుపొందారు. అప్పటి నుంచి ఆయన కుమారుడు, కుమార్తె కే–ట్యాక్స్‌ల పేరుతో నియోజకవర్గంలోని ప్రజలతోపాటు, సొంత పార్టీ నాయకులను సైతం దోచుకున్నారని ఆ పార్టీ నాయకులే బాహాటంగా ప్రకటించారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో మాజీ స్పీకర్‌ కోడెల శిప్రసాదరావుకు సత్తెనపల్లి అసెంబ్లీ టికెట్‌ ఇవ్వద్దని ఆ పార్టీ నాయకులు నిరసనలు, ధర్నాలు చేసిన విషయం తెలిసిందే. కోడెలకు టికెట్‌ ఇవ్వద్దని సొంత పార్టీ నేతలే తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ అధినేత ఆయనకే సీటు కట్టబెట్టారు. ఎన్నికల్లో ఆయన ఘోర పరాజయం పాలయ్యారు. ఐదేళ్ల పాలనలో కోడెల, ఆయన కుమారుడు, కుమార్తెలు కే–ట్యాక్స్‌ల పేరుతో దోచుకున్నారని బాధితులు పోలీస్‌స్టేషన్‌లకు క్యూ కట్టారు. నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గంలో కోడెల కుటుంబంపై 18 కేసులు నమోదయ్యాయి.  

లేటుగా.. లేటెస్టుగా..
తాజాగా మరో కోడెల కే–ట్యాక్స్‌ వ్యవహారం సోషల్‌ మీడియా వేదికగా వెలుగులోకి వచ్చింది. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం వైరల్‌ అవుతున్న కే–ట్యాక్స్‌కు సంబంధించిన వివరాలు ఇలా.. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక సత్తెనపల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ నిర్మాణం పనులకు టెండర్లు ఆహ్వానించారు. ఈ భవన నిర్మాణ కాంట్రాక్టు కోసం ప్రస్తుత టీడీపీ జిల్లా కార్యదర్శి కోమటినేని శ్రీనివాసరావు ప్రయత్నించారు. కోడెల వాగ్దానం ఇవ్వడంతో శంకుస్థాపనకు రూ.లక్షలు ఖర్చుపెట్టి శిలాఫలకం తదితర ఏర్పాట్లు చేశారు. అయితే పనులు కట్టబెట్టడానికి రూ.5 లక్షలు కావాలని కోడెల శివప్రసాద్‌ డిమాండ్‌ చేశారు, ఆ డబ్బును ఇవ్వకవడంతో శంకుస్థాపన వాయిదా వేయించారు. దీంతో కోమటినేని శ్రీనివాసరావు తీవ్రంగా నష్టపోయారు. ఈ కే–ట్యాక్స్‌ వ్యవహారాన్ని శ్రీనివాసరావు ఇటీవల వాట్సప్‌లో తన సన్నిహితులకు పంపారు. సత్తెనపల్లి మండల పార్టీ అధ్యక్షుడుగా కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన శ్రీనివాసరావునే డబ్బులు డిమాండ్‌ చేశారన్న విషయం బయటికి రావడం జిల్లా టీడీపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారాన్ని సైతం నేడు కోడెల వ్యతిరేక వర్గ నాయకులు అధినేత దష్టికి తీసుకువెళ్లనున్నారు. 

కొత్త ఇన్‌చార్జులు కావాలి
సత్తెనపల్లిలో టీడీపీ ఘోర పరాజయానికి కోడెల కుటుంబం అరాచకాలే కారణమని, రాజ్యాంగబద్ధ పదవికి కలంకం తీసుకొచ్చారని సత్తెనపల్లి టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక మీదట నియోజకవర్గ ఇన్‌చార్జిగా కోడెల కొనసాగితే పార్టీకి మరింత నష్టం చేకూరే అవకాశముందని బాహాటంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జిగా కొత్త వ్యక్తికి బాధ్యతలు అప్పగించాలని చంద్రబాబును కోరనున్నట్లు సమాచారం.

బాబును కలవకుండా అడ్డుకునే ప్రయత్నాలు 
కోడెలకు వ్యతిరేకంగా సత్తెనపల్లిలో పాత నియోజకవర్గ పార్టీ కార్యాలయాన్ని పునఃప్రారంభించిన అసమ్మతి నాయకులు నేడు పార్టీ అధినేతను కలిసేందుకు వెళ్తుండటంతో వారిని అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. 20 వాహనాల్లో ర్యాలీగా బయల్దేరి సుమారు 200 మంది కోడెల వ్యతిరేక వర్గ నాయకులు చంద్రబాబును కలిసేందుకు కార్యచరణ రూపొందించుకున్నారు. అయితే తమను అడ్డుకునేందుకు కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నిస్తున్నాయని, ఎవరు అడ్డుకోవాలని ప్రయత్నించినా చంద్రబాబును కలుస్తామని వారు చెబుతున్నారు. వీరికి సాయంత్రం నాలుగు గంటలకు చంద్రబాబు అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement