వలేటివారిపాలెం, న్యూస్‌లైన్ : మండలంలోని కొండసముద్రంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు శనివారం రాత్రి దాడికి దిగారు. సార్వత్రిక ఎన్నికల్లో కందుకూరు ఎమ్మెల్యేగా వైఎస్సార్ సీపీ అభ్యర్థి పోతుల రామారావు విజయం సాధించడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామంలో ఊరేగింపు నిర్వహించాలని ప్రయత్నించగా టీడీపీ నాయకులు భయభ్రాంతులకు గురి చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది.
గ్రామస్తులు కలుగజేసుకుని అందరికీ సర్ది చెప్పారు. ఆ రోజు నుంచి వైఎస్సార్ సీపీ నాయకుడు కొల్లి మాధవ ఇంటి ముందు టీడీపీ నాయకుడు కావాలనే ట్రాక్టర్ అడ్డు పెట్టి రోజూ ఇబ్బంది పెడుతున్నాడు. ఈ నేపథ్యంలో ముందస్తు ప్రణాళిక ప్రకారం గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు మన్నం వెంకట రమేష్‌ను మాట్లాడాలని పక్కకు పిలిచి ఒక్కసారిగా అతనిపై టీడీపీ నేతలు దాడి చేశారు. ఏమి చేయాలో అర్థంకాని రమేష్.. అందరినీ నెట్టుకుంటూ తన ఇంటివరకు వెళ్లాడు. గమనించిన అతని తల్లి పెద్దగా కేకలు వేయగా రమేష్ అనుచరులు వచ్చి టీడీపీ నాయకులను అడ్డుకున్నారు.
అప్పటికే సిద్ధంగా ఉన్న కారం, కర్రలతో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడి చేశారు. నిందితుల్లో మన్నం నాగేశ్వరరావు, కొల్లి గోపి, మన్నం చిరంజీవి, మాదాల మాల్యాద్రి, ఉన్నం సురేష్, పరుచూరి మాలకొండయ్య, ఉన్నం వెంకటేశ్వర్లు, మాదాల కొండయ్య, నువ్వుల చిన బ్రహ్మయ్య, నలమోతు రాంబాబు, గట్టమనేని శివన్నారాయణ ఉన్నారని వైఎస్సార్ సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. వివాదం ముదరడంతో గ్రామస్తులు ఎస్సై సాంబశివయ్యకు సమాచారం అందించారు.
ఎస్సై తన సిబ్బందితో శనివారం రాత్రి గ్రామంలోకి వెళ్లి గొడవ పెద్దది కాకుండా చర్యలు తీసుకున్నారు. అనంతరం 144 సెక్షన్ విధించారు. ఆదివారం ఇరువర్గాల నాయకులను పోలీసు స్టేషన్‌కు పిలిచి మాట్లాడారు. గ్రామంలో అలజడులు సృష్టిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ మేరకు నాయకుల నుంచి రాత పూర్వక హామీ తీసుకున్నారు. ఇరువర్గాల నాయకులపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు ఎస్సై సాంబశివయ్య తెలిపారు.
కుంకలమర్రులో..
చీరాల రూర ల్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ సీపీ మహిళా కార్యకర్తపై టీడీపీ వర్గీయులు దాడి చేసి గాయపరిచారు. ఈ సంఘటన కారంచేడు మండలం కుంకలమర్రులో ఆదివారం జరిగింది. బాధితురాలు ఔట్‌పోస్టు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పందరబోయిన లక్ష్మి తన భర్తకు అనారోగ్యంగా ఉండటంతో చీరాల వెళ్లి చికిత్స చేయించి భర్తతో కలిసి తిరిగి స్వగ్రామానికి వస్తోం ది. ఇంటికి వెళ్తున్న దంపతులను టీడీపీకి చెందిన పి.కల్పన, శ్రీకాంత్‌తో పాటు మరో ముగ్గురు కలిసి దాడి చేశారు. ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి ఎందుకు పని చేశారంటూ దుర్భాషలాడారు. అంతటితో ఆగకుండా కత్తితో దాడిచేయబోగా చేయి అడ్డుపెట్టడంతో లక్ష్మి చేయి తెగింది. క్షతగాత్రురాలిని చికిత్స కోసం చీరాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
కొండసముద్రంలో టీడీపీ నాయకుల దాష్టీకం
Published Mon, May 19 2014 2:24 AM | Last Updated on Fri, Aug 10 2018 9:40 PM
Advertisement
Advertisement