అరుణ సభలో రభస
తలకొండపల్లి, న్యూస్‌లైన్: తలకొండపల్లి మండలం పడకల్‌లో మంత్రి డీకే అరుణ వచ్చిన సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో రభస చోటుచేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌ను వేదికమీదకు ఆహ్వానించకుండా అవమానించారని ఆరోపిస్తూ తెలుగుదేశం కార్యకర్తలు సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు మంత్రి డీకే అరుణ ఇక్కడికి గురువారం వచ్చారు. ఈ సందర్భంగా జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాలలో జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతుండగా టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ను పిలువాలని, ఆయన లేకుండా సమావేశాన్ని ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తూ సభా ప్రాంగణలోకి చొచ్చుకు వచ్చారు. అప్రమత్తమైన పోలీస్‌లు వారిని అడ్డుకున్నారు.
ఇంతలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఇది అధికారిక సమావేశం కాదనీ, పార్టీ కార్యకర్తల సమావేశమని ఈ విషయం తెలిపామని చెప్పారు. అధికారికి సమావేశం కాకుంటే ప్రభుత్వ పాఠశాలలో ఎందుకు నిర్వహిస్తున్నారని టీడీపీ నాయకులు ప్రశ్నిస్తూ అక్కడే బైఠాయించి ధర్నా చేపట్టారు. దీంతో టీడీపీ, కాంగ్రెస్ నాయకులు బాహాబాహీకి దిగి గొడవపడ్డారు. కుర్చీలు విసురుకొన్నారు. ఫలితంగా సమావేశం గందరగోళంగా తయారైంది. పరిస్థితి విషమించడంతో పోలీస్‌లు లాఠీలు ఝలిపించి టీడీపీ నాయకులను చెదరగొట్టి సమావేశ ప్రాంగణం నుంచి బయటికి పంపించి వేశారు. తదుపరి సమావేశం ప్రశాంతంగా కొనసాగింది.