పిఠాపురం/తుని : పొరుగు జిల్లాలతో పోల్చినప్పుడు చాలావరకూ కనికరించినట్టే అయినా.. హుద్‌హుద్ తుపాను జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో గట్టిదెబ్బే కొట్టింది. ఆ దెబ్బకు ఇళ్లు, చేలు ధ్వంసమై ఎందరో ఆర్థికంగా కుదేలయ్యారు. మత్స్యకారులకు వారం రోజుల పాటు వేట లేక పూట గడవక కటకటపడ్డారు. జిల్లాలోని పిఠాపురం, తుని నియోజకవర్గాలలోని తీరప్రాంతంలో హుద్‌హుద్ నష్టం కొట్టొచ్చినట్టు కనిపించింది. కొత్తపల్లి మండలం పొన్నాడ శివారు కోనపాపపేటతో పాటు ఉప్పాడ, సుబ్బంపేట, సూరాడపేట, మాయాపట్నం వంటి గ్రామాలు తుపాను తాకిడికి అతలాకుతలమయ్యాయి. మత్స్యకార కుటుంబాలు విలవిలలాడాయి. బాధితులంతా ప్రభుత్వం ఆసరా ఇస్తుందని ఆశించారు. కానీ ఇప్పటి వరకూ వారిలో కొందరికి 25 కేజీల బియ్యం తప్ప ఎటువంటి సహాయం అందక పోవడంతో వారు లబోదిబో మంటున్నారు.
ఒక్క కోనపాపపేటలోనే దాదాపు 50 గృహాలు నేలమట్టం కాగా 25 గృహాలు పూర్తిగా దెబ్బ తిని సుమారు రూ.కోటి ఆస్తినష్టం సంభివించిందని అంచనా. ఉప్పాడ, సుబ్బంపేట, సూరాడపేట, మాయాపట్నం వంటి గ్రామాల్లో సుమారు 100 గృహాలు, వలలు, బోట్లు పాక్షికంగా దెబ్బతిని రూ.1.50 కోట్ల వరకు ఆస్తినష్టం సంభవించినట్టు అంచనా. ఉప్పాడ నుంచి కాకినాడ మధ్య ఉన్న బీచ్‌రోడ్డు పూర్తిగా దెబ్బతిని సుమారు రూ.3 కోట్ల మేర నష్టం వాటిల్లింది. తీరం వెంబడి ఉన్న పంటపొలాల్లోకి సముద్రపునీరు చొచ్చుకురావడంతో సుమారు 100 ఎకరాల పంటపొలాలు చవుడు బారిపోయాయి. అనేక చోట్ల వరి పంట నేలనంటి నాశనమైంది. రైతులకు ఇప్పటి వరకూ ఏ విధమైన పరిహారం అందలేదు. పలు విద్యుత్ స్తంభాలు, వృక్షాలు నేలకొరిగాయి.
తుని, తొండంగి, గొల్లప్రోలు, పిఠాపురం మండలాల్లో సుమారు 2300 ఎకరాల్లో అరటి, పత్తి, ఉల్లి, మల్బరీ, పచ్చిమిర్చి, పెండ్లం వంటి పంటలు దెబ్బతిన్నాయి. రెండు నియోజకవర్గాల పరిధిలో కొబ్బరి, టేకు, పామాయిల్, మామిడి, జీడిమామిడి చెట్లు సుమారు 12 వేల వరకు దెబ్బ తిన్నాయి. అధికారిక అంచనా ప్రకారం తుని, తొండంగి మండలాల్లో 350 గృహాలు దెబ్బ తిన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం హుద్‌హుద్ తుపాను పీడిత ప్రాంతంగా దృష్టినంతా ఉత్తరాంధ్రపైనే కేంద్రీకరించిందని, తమను ఉపేక్షించిందని జిల్లాలోని తుపాను బాధితులు వాపోతున్నారు. తుపాను నష్టాన్ని పరిశీలించడానికి గురువారం జిల్లాలో పర్యటించనున్న కేంద్ర బృందమైనా తమకు జరిగిన నష్టాన్ని పరిగణన లోకి తీసుకుని, న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.
మీరైనా క ళ్లు తుడవండి ఢిల్లీ దొరలూ!
Published Thu, Nov 27 2014 1:27 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM
Advertisement
Advertisement