
మాజీ ఎమ్మెల్యే కలమటను అరెస్టు చేసి తీసుకువస్తున్న పోలీసులు
కొత్తూరు: నూతన సచివాలయ భవనానికి రంగులు వేస్తుండగా అడ్డుకొని, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారన్న అభియోగంపై టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ నెల 13వ తేదీన జరిగిన ఈ సంఘటనపై కొత్తూరు మండలం మాతలకు చెందిన గ్రామ వలంటీర్ బూరాడ నాగరాజు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు అనంతరం శుక్రవారం కలమట సహా టీడీపీకి చెందిన మొత్తం 19మందిని అరెస్టు చేశారు. ఎస్‌ఐ బాలకృష్ణ వీరిని స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరు పరిచారు. అనంతరం బెయిల్‌పై వారిని విడుదల చేశారు. అరెస్టయిన వారిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణతోపాటు కలమట సాగర్, రేగేటి మోహనరావు, మాతల గాంధీ, గండివల్స తేజేశ్వరరావు, రేగేటి సూర్యం, కలమట చంద్రశేఖర్, మన్మధరావు, జమ్మినాయుడు, బుడ్డు హేమసుందరరావు, బెహరా పోలారావు, గోవిందరావు, ఇరింజిలి రామారావు, కానీ తవిటయ్య, సారిపల్లి భాస్కరరావులు ఉన్నారు.
ఇంటి వద్ద అరెస్టు..
ఇన్‌చార్జి సీఐ రవిప్రసాద్, ఎస్‌ఐ బాలకృష్ణ మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణను ఇంటి వద్ద అరెస్టు చేశారు. పోలీసు వాహనంలో తీసుకువెళ్లి స్టేషన్‌లో ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత మాజీ ఎమ్మెల్యేకు కొత్తూరు సీహెచ్‌సీలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కోర్టులో హాజరు పరిచారు. కోర్టు వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment