kalamata venkataramana
-
జనసేనకు టిక్కెట్ ఇస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : జనసేనపై టీడీపీ నాయకులు చులకన భావాన్ని చూపుతూనే ఉన్నారు. పొ త్తు కుదిరినా ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ తక్కువ చేస్తూ మాట్లాడుతూనే ఉన్నారు. శంఖారావం కార్యక్రమంలో భాగంగా లోకేష్ జిల్లాకు వచ్చినప్పుడు దాదాపు ప్రతి చోటా అవమాన పరిచారు. కొన్నిచోట్లైతే సభా ప్రాంగణంలోకి వచ్చిన జనసైనికులపై చేయి చేసుకున్నారు. అయినా అధినేత మాటకు తలొగ్గి ఇష్టం లేకపోయినా టీడీపీ నాయకులతో కలిసి వెళ్తున్నారు. కానీ జనసైనికులకు అంత సీన్ లేదంటూ టీడీపీ నాయకులు తీసి పారేస్తున్నారు. తాజాగా పాతపట్నం నియోజకవర్గం మాజీ ఎమ్మె ల్యే, టీడీపీ ఇన్చార్జి కలమట వెంకటరమణ చేసిన వ్యాఖ్యలు జనసేన పార్టీ నాయకులను మరింత అవమానపరిచాయి. జనసేనలో ఇక్కడంత నాయకుల్లేరని, ఒకవేళ జనసేనకు టిక్కెట్ ఇస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానే తప్ప కలిసి పనిచేసే ది లేదని చెప్పడం చర్చనీయాంశమైంది. ‘టీడీపీ నాయకులతో కలిసి నడవండి... ఒక మాట అన్నా పడండి.. పొత్తులో భాగంగా సాగండి. నా విధానాలు నచ్చి నాతో నడిచే వారే నా మను షులు. కాదన్న వారంతా కోవర్టులే...నా వ్యూహం ప్రకారంగా నడుచుకోవాలి. లేదంటే పార్టీ నుంచి వెళ్లిపోవచ్చు’ తరచూ జనసైనికులను ఉద్దేశించి పవన్ కల్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలివి. ఈ వ్యాఖ్యలను అలుసుగా తీసుకుంటున్న టీడీపీ నాయకులు తర చూ జనసేన కార్యకర్తలను చులకనగా చూస్తున్నా రు. ఆ కారణంగా జిల్లాలో చాలాచోట్ల జనసైనికులు టీడీపీ నాయకులతో కలిసి వెళ్లడానికి ఆసక్తి చూపడం లేదు. కొందరు తప్పదనే పరిస్థితుల్లో వెళ్తున్నారు. అయిష్టంగా కలిసి వస్తున్న చోట కూడా ఆ పార్టీ నాయకులను టీడీపీ నాయకులు తేలికగా తీసుకోవడమేకాకుండా అవమానపరుస్తున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటా.. తాజాగా పాతపట్నం నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి కలమట వెంకటరమణ ఓ మీడియాతో మా ట్లాడుతూ జనసేన పరువు తీసేశారు. పొత్తులో భాగంగా పాతపట్నం జనసేనకు కేటాయిస్తే మీరే మి చేస్తారని ఆ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ అసలు పాతపట్నంలో జనసేనకు అంత నాయకులు ఎక్కడున్నారని ప్రశ్నించారు. అంతటితో ఆగలేదు ఒకవేళ పొత్తులో భాగంగా జనసేనకు ఇస్తే రాజకీయాలకు నమస్కారం పెట్టి రాజకీయాల నుంచి తప్పుకుంటానే తప్ప ఈ కలమటోళ్లు ఎప్పుడూ కూడా ఇలా కింద చేయి ఉండే పరిస్థితి లేదని తేల్చి చెప్పేశారు. ఇప్పుడీ వ్యాఖ్య లు నియోజకవర్గంలోనే కాదు జిల్లాలోనే చర్చనీయాంశంగా మారాయి. ఆవేదనలో జనసైనికులు తనకు టిక్కెట్ ఇస్తే జనసేన పనిచేయాలే తప్ప తా ను మాత్రం పొత్తులో భాగంగా జనసేనకు టిక్కెట్ ఇస్తే చేసేది లేదని చెప్పడం తమను అవమాన పరచడమేనని జనసైనికులు భావిస్తున్నారు. తమకు ఇష్టం లేకపోయినా అధినేత మాటకు కట్టుబడి టీడీపీతో ముందుకు సాగుతుంటే అడుగడుగునా తమను అవమానపరుస్తున్నారని, ఓటేసినప్పుడు బుద్ధి చెబుతామంటూ కొందరు జనసైనికులు వాపోతున్నారు. తమ పరిస్థితి చూస్తుంటే పిలవని పేరంటానికి వెళ్తున్నట్టుగా ఉందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. -
తపట్నం అసెంబ్లీ టికెట్ కలమట కుటుంబానికి దక్కుతుందా?
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పాతపట్నంలో టీడీపీ టికెట్ రేసు అనేక మలుపులు తిరుగుతోంది. కింజరాపు కుటుంబం ఒకరికి హ్యాండ్ ఇవ్వడంతో ఇక్కడ రాజకీయం రసకందాయంలో పడింది. పార్టీ కోసం పనిచేస్తున్న మామిడి గోవిందరావును లక్ష్యంగా చేసుకుని కింజరాపు ఫ్యామిలీ రాజకీయాలు చేస్తోంది. అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణను అచ్చెన్నాయుడుతో పాటు ఎంపీ రామ్మోహన్నాయుడు వెనకేసుకొస్తున్నారు. అచ్చెన్నాయుడు ఇంతకుముందు చెప్పినట్టు మామిడి గోవిందరావు చేత డబ్బులు ఖర్చు పెట్టించుకుని, కొన్నాళ్లు వాడుకుని ఆ తర్వాత వదిలేస్తామన్న వ్యాఖ్యలు నిజం చేస్తున్నారు. దీన్ని పసిగట్టిన మామిడి కూడా అప్రమత్తమయ్యారు. వీళ్లని కాదని ఏకంగా లోకేష్‌తో టచ్‌లోకి వెళ్లారు. తనకే సీటు వస్తుందని నియోజకవర్గంలో పార్టీ పరంగా బల నిరూపణ చేసుకుంటున్నారు. దానికి తన పుట్టిన రోజున వేదికగా చేసుకుని కలమట వెంకటరమణకు, ఆయనకు మద్దతుగా ఉన్న కింజరాపు ఫ్యామిలీకి పరోక్షంగా సవాల్ విసిరారు. రెండు వర్గాలుగా విడిపోయి.. పాతపట్నంలో టీడీపీ గ్రూపు రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. కార్యకర్తలు ఎవరివైపు ఉండాలో తేల్చుకోలేక సతమతమవుతున్నారు. జిల్లాకు పెద్ద దిక్కు అనుకుంటున్న కింజరాపు ఫ్యామిలీ ఎత్తుగడలను అంచనా వేయలేక తీవ్రంగా నలిగిపోతున్నారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, మామిడి గోవిందరావు రెండు వర్గాలుగా విడిపోయారు. మొదట్లో పార్టీ కేడర్‌లో కొంత బలంగా కలమట కనిపించినా మామిడి గోవిందరావు వ్యూహాత్మక రాజకీయాలతో ఆ పార్టీలోని కీలక నాయకులను తనవైపు తిప్పుకుంటున్నారు. చెప్పాలంటే టీడీపీ కేడర్‌ను నిట్టనిలువునా చీల్చేశారు. మొన్నటికి మొన్న ఎల్‌ఎన్‌పేట మండల పార్టీ నాయకులు వెలమల గోవిందరావు, కాగన మన్మధరావును తనవైపు తిప్పుకోగా, తాజాగా హిరమండలం పార్టీ నాయకులు యాళ్ల నాగేశ్వరరావును తనవైపు లాక్కున్నారు. ఇలా ఒక్కొక్కరిగా కలమట అనుచరులు, పార్టీ నాయకులను మామిడి గోవిందరావు తన వెంట తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఇలా జరుగుతుందని పసిగట్టే గతంలో కలమట వెంకటరమణ కింజరాపు ఫ్యామిలీ వద్ద పంచాయితీ పెట్టారు. మామిడిని ప్రోత్సహించవద్దని మొర పెట్టుకున్నారు. ఈ సమయంలో కింజరాపు అచ్చెన్నాయుడు, రామ్మోహన్నాయుడు డబుల్ గేమ్ ఆడారు. ‘వాడుకుని వదిలేద్దామని...పార్టీ కోసం బాగా ఖర్చు పెట్టించి, తద్వారా నీకు మేలు జరిగేలా చూస్తామని’ కలమట వెంకటరమణ వద్ద అచ్చెన్నాయుడు బాహాటంగానే వ్యాఖ్యానించారు. అప్పట్లో ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టి సంచలనం సృష్టించింది. ఇదే సమయంలో మామిడి గోవిందరావు వద్ద ‘నీకెందుకు మేమున్నాం.. కలమటను పట్టించుకోవద్దు.. ఆయన అలాగే మాట్లాడుతాడు. మేము అసలు పట్టించుకోం.. నీ పని నువ్వు చేయ్’ అంటూ ప్రోత్స హించారు. ఇలా ఇద్దరి మధ్య చిచ్చు పెడుతూ ఒకరికి తెలియకుండా మరొకరిని సమర్థించారు.తర్వాత పార్టీలో పరిణామాలు మారిపోయాయి. కింజరాపు ఫ్యామిలీని కలమట వెంకటరమణ ఏ రకంగా బ్లాక్ మెయిల్ చేశారో గానీ మామిడి గోవిందరావుకు మద్దతు లేకుండా చేయగలిగారు. అచ్చెన్నాయుడు, రామ్మోహన్నాయుడు కూడా మామిడిని దూరం పెడుతున్నారు. తరుచూ కలుద్దామని ప్రయత్నిస్తున్న మామిడి అండ్ కోకు అకాశమివ్వడం లేదు. డైరెక్ట్‌గా కలమటకు మద్దతు ఇచ్చేలా వ్యవహరిస్తున్నారు. ఇదంతా గమనించిన మామిడి కూడా తన రాజకీయ వైఖరిని మార్చుకున్నారు. కింజరాపు నీడ నుంచి బయటపడి లోకేష్ వద్దకు చేరుకున్నారు. లోకేష్‌తో టచ్‌లోకి వెళ్లి కింజరాపు ఫ్యామిలీ వ్యూహాలకు దీటుగా రాజకీయాలు చేస్తున్నారు. అదే సందర్భంలో కింజరాపు ఫ్యామిలీ మద్దతిస్తున్న కలమట వెంకటరమణకు నియోజకవర్గంలో బలం లేదని నిరూపించేందుకు తరచూ ప్రయత్నిస్తున్నారు. చెప్పాలంటే కింజరాపు అచ్చెన్నాయుడు, రామ్మోహన్నాయుడుకు సవాల్ విసిరేలా బల నిరూపణ చేస్తున్నారు. ఇటీవల జరిగిన తన పుట్టిన రోజు వేడుకను కూడా బల నిరూపణ సభగా మార్చేశారు. ఆ వేదికపై కలమట వెంకటరమణే లక్ష్యంగా చెలరేగిపోయారు. గతంలో అవినీతి చేసిన కలమటకు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వకూడదని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కింజరాపు ఫ్యామిలీ మద్దతిస్తున్న కలమట వెనక ఎవరూ లేరన్నట్టుగా మండలాల వారీగా నాయకులను తనవైపు తిప్పుకుని వేదికపైనే బల ప్రదర్శనగా చూపించారు. ఇదంతా చూసి మామిడిని కూడా అదును చూసే దెబ్బకొట్టే పనిలో కింజరాపు ఫ్యామిలీ ఉన్నట్టుగా నియోజకవర్గంలో చర్చ నడుస్తోంది. -
Kalamata Venkataramana: మాజీ ఎమ్మెల్యే కలమట వీరంగం
పరాజయాలతో కాలు నిలవని అసహనం.. ప్రజాక్షేత్రంలో ఎదురవుతున్న పరాభావాలను తట్టుకోలేని మనస్తత్వం.. ఏం చేయాలో పాలుపోని భయం. ఇవన్నీ టీడీపీ నాయకుల్లో రోజురోజుకీ అసహనాన్ని రేకెత్తిస్తున్నాయి. అందుకే వారేం చేస్తున్నారో.. ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియకుండా పోతోంది. తాజాగా శనివారం రాత్రి పాతపట్నంలో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. సాక్షి, శ్రీకాకుళం: పాతపట్నంలో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ వీరంగా సృష్టించారు. ఎప్పుడో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించేందుకు వెళ్లిన అధికారులతో దురుసుగా ప్రవర్తించారు. నోటికి వచ్చినట్లు పరుష పదజాలంతో మాట్లాడుతూ బెదిరింపులకు దిగారు. తన మద్దతుదారులతో గుంపుగా వెళ్లి, అధికారులపై దాడి చేసేలాగా ప్రయత్నం చేశారు. వివరాల్లోకి వెళ్తే... గత నెలలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పాతపట్నంలో అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం పూర్తయి, కొన్ని వారాలు గడుస్తున్నా నేటికీ వాటిని తీయలేదు. వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఎదురైతే ఎక్కడ ప్రజలకు ఇబ్బందికరంగా, ప్రమాదకరంగా మారుతాయనే ముందస్తు జాగ్రత్తలతో ఫ్లెక్సీలు తొలగించేందుకు ఎంపీడీఓ, ఈఓపీఆర్డీ, పంచాయతీ ఈఓ శనివారం రాత్రి ఉపక్రమించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కలమట, ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలివచ్చి, అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఒకానొక సందర్భంలో వారి విధులకు ఆటంకం కలిగిస్తూ పైకి దూసుకు వచ్చేలా వ్యవహరించారు. అధికారులు స్పష్టంగా చెబుతున్నప్పటికీ వినకుండా మాజీ ఎమ్మెల్యే పదే పదే అనుచితంగా వ్యవహరించారు. ఫ్లెక్సీలు ఎలా తొలగిస్తావో చూస్తామంటూ, మిమ్మల్ని వదలేది లేదంటూ.. మరికొన్ని దురుసు మాటలతో బెదిరింపులకు దిగారు. అక్కడికి వచ్చిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధికారులను ఒక్కొక్కరూ ఒక్కో విధంగా అసభ్య పదజాలంతో దూషించారు. ఆ సమయంలో అక్కడ లేని పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. -
టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు
కొత్తూరు: నూతన సచివాలయ భవనానికి రంగులు వేస్తుండగా అడ్డుకొని, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారన్న అభియోగంపై టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ నెల 13వ తేదీన జరిగిన ఈ సంఘటనపై కొత్తూరు మండలం మాతలకు చెందిన గ్రామ వలంటీర్ బూరాడ నాగరాజు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు అనంతరం శుక్రవారం కలమట సహా టీడీపీకి చెందిన మొత్తం 19మందిని అరెస్టు చేశారు. ఎస్ఐ బాలకృష్ణ వీరిని స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరు పరిచారు. అనంతరం బెయిల్‌పై వారిని విడుదల చేశారు. అరెస్టయిన వారిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణతోపాటు కలమట సాగర్, రేగేటి మోహనరావు, మాతల గాంధీ, గండివల్స తేజేశ్వరరావు, రేగేటి సూర్యం, కలమట చంద్రశేఖర్, మన్మధరావు, జమ్మినాయుడు, బుడ్డు హేమసుందరరావు, బెహరా పోలారావు, గోవిందరావు, ఇరింజిలి రామారావు, కానీ తవిటయ్య, సారిపల్లి భాస్కరరావులు ఉన్నారు. ఇంటి వద్ద అరెస్టు.. ఇన్చార్జి సీఐ రవిప్రసాద్, ఎస్ఐ బాలకృష్ణ మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణను ఇంటి వద్ద అరెస్టు చేశారు. పోలీసు వాహనంలో తీసుకువెళ్లి స్టేషన్లో ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత మాజీ ఎమ్మెల్యేకు కొత్తూరు సీహెచ్‌సీలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కోర్టులో హాజరు పరిచారు. కోర్టు వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
కలమట కుమారుడిని కఠినంగా శిక్షించాలి
సాక్షి, శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): పాతపట్నం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ కుమారుడు సాగర్ ఆగడాలు రోజురోజుకూ మితిమీరి పోతున్నాయని, ఇటువంటి వారిపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని ఎమ్మెల్యే రెడ్డి శాంతి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఆర్ఎన్ అమ్మిరెడ్డిని కోరారు. ఈ మేరకు ఎస్పీ కార్యాలయంలో ఆయనను సోమవారం కలిసిన ఆమె.. వినతిపత్రం అందజేశారు. ఈనెల 9న కొత్తూరు మండలం మాతల గ్రామంలో సామాజిక భవనం వద్ద శ్రమదానం చేస్తున్న వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, ప్రభుత్వం నియమించిన వలంటీర్లపై కలమట కుమారుడు తన అనుచరులతో కలిసి దాడికి దిగారని తెలిపారు. అసభ్య పదజాలంతో దుర్బాషలాడుతూ కర్రలతో దాడి చేసి, గాయాలపాలు చేశారన్నారు. బాధితుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని, కొంతమంది నిందితులను అదుపులోకి తీసుకున్నారన్నారు. అక్కడి నుంచి తప్పించుకున్న ప్రధాన నిందితుడైన సాగర్‌ను ముమ్మరంగా గాలించి, పట్టుకోగా.. బెయిల్‌తో ఇంటికి చేరుకున్నారని పేర్కొన్నారు. సామాన్యులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్న ఇటువంటి వారికి బెయిల్ నిరకరించడంతో పాటు కఠినంగా శిక్షించాలని ఆమె విన్నవించారు. దీనిపై స్పందించిన ఎస్పీ.. ఘటనపై వివరాలు సేకరించి, బాధ్యులపై చర్యలు చేపడతామని హామీ ఇచ్చారన్నారు. -
ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్ కలమట వెంకటరణ
-
టీడీపీలో చేరుతున్నా: కలమట
శ్రీకాకుళం: పాటపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఈ విషయాన్ని ఆయన మంగళవారం ధ్రువీకరించారు. మార్చి 4న టీడీపీలో చేరుతున్నట్లు కలమట వెంకటరమణ తెలిపారు. కొత్తూరు మండలం మాతాలలో ఆయన ఈరోజు ఉదయం మాట్లాడారు. కాగా కొద్దిరోజులుగా కలమట టీడీపీలో చేరుతున్నట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. -
పాతపట్నం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అరెస్ట్
కొత్తూరు (శ్రీకాకుళం జిల్లా) : అంగన్వాడీ అదనపు కార్యకర్తల నియామకం విషయంలో ధర్నా చేపట్టాలని పిలుపునిచ్చిన పాతపట్నం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన ఆదివారం శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండల కేంద్రంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. అంగన్వాడీ అదనపు కార్యకర్తల నియామకంలో జాప్యాన్ని నిరసిస్తూ సీతంపేటలోని ఐటీడీఏ కార్యాలయం ఎదట ధర్నాకు వెంకటరమణ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన సీతంపేట వెళ్తుండగా కొత్తూరులో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొత్తూరులోని నాలుగు రోడ్ల కూడలిలో ఆయన ధర్నాకు దిగారు. పోలీసులు ధర్నా చేస్తున్న ఎమ్మెల్యేను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
ఏజెన్సీలో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పర్యటన
శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కె.వెంకటరమణ మంగళవారం తన నియోజకవర్గంలోని ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించారు. ఆయా ప్రాంతాల్లోని గిరిజనుల సమస్యలపై ఆయన సానుకూలంగా స్పందించారు. వారి సమస్యలను సాధ్యమైనంత త్వరగా తీర్చుతానని ఆయన గిరిజనులకు హామీ ఇచ్చారు. గతంలో తమ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఎవరు తమ సమస్యలు పట్టించుకోలేదని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించి...తమ సమస్యలు... తెలుసుకుని..వాటిని నెరవేరుస్తానని హామీ ఇచ్చిన మొట్టమొదటి ఎమ్మెల్యే వెంకటరమణ అని గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
'మహేంద్ర తనయ'పై అక్రమ నిర్మాణం: కలమట ఆందోళన
శ్రీకాకుళం/గజపతి: ఒడిస్సాలోని గజపతి జిల్లా దంబాపూర్ వద్ద మహేంద్ర తనయ నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టు పనులను శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వైఎస్ఆర్ సీపీ శాసనసభ్యుడు కలమట వెంకట రమణ ఈరోజు పరిశీలించారు. ఈ నదిపై 29 కోట్ల రూపాయలతో ప్రాజెక్టుని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా వెంకట రమణ మాట్లాడుతూ ఒడిస్సా అక్రమ నిర్మాణం వల్ల పాతపట్నం నియోజవకర్గంలో తాగునీటి కొరత ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. -
ఆ ఊరికి.. తొలిసారి ఓ ఎమ్మెల్యే!
శ్రీకాకుళం: అది ఒక మారుమూల గ్రామం. ఆ గ్రామాన్ని స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఏ ప్రజాప్రతినిధీ సందర్శించిన పాపాన పోలేదు. అలాంటి గ్రామానికి ఇన్నాళ్లకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వెళ్లారు. శ్రీకాకుళం జిల్లాలోని మిలియాకుట్టి మండలం నవరజెర్రు భద్ర గ్రామాన్ని వైఎస్సార్సీపీకి చెందిన పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే కలమల వెంకటరమణ సందర్శించారు. ఇప్పటివరకు తమ గ్రామంలో అడుగుపెట్టిన ఎమ్మెల్యే అంటూ ఎవరూ లేకపోవడంతో తొలుత గ్రామస్థులు ఇది నిజమేనా అని అనుమానపడ్డారు. అనంతరం హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. -
ఆశే వారి శ్వాస
చుట్టూ ఎటు చూసినా పచ్చని పొలాలు.. జీడిమామిడి తోటలు.. పక్కనే గలగల పారే వంశధార. చూడ్డానికి ఎంతో ఆహ్లాదకరంగా కనిపించే ఆ గ్రామ ప్రజల మనస్సుల్లో మాత్రం గుండెలు పిండేసే వ్యథ గూడుకట్టుకుంది. గ్రామ భూములను సస్యశ్యామలం చేయాల్సిన వంశధార ఏటా వరదల రూపంలో దాడి చేస్తూ గ్రామానికిప్రపంచంతో సంబంధాలను తుంచేస్తోంది. ఇసుక మేటల రూపంలో సారవంతమైన భూములను బీళ్లుగా మార్చేస్తోంది. విలువైన పంట భూములు రెల్లు తుప్పలుగా మారిపోయాయి. 2006 నుంచి ఏటా ఇదే చేదు అనుభవం. ఆ ఏడాది వరదలకు వరదగట్టుకు సుమారు 400 మీటర్ల గండి పడి గ్రామ స్వరూపాన్నే మార్చేసింది. ప్రజల జీవనాన్ని దుర్భరం చేసింది. ప్రతి ఏటా వరదల సమయంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఎందరో వస్తున్నారు.. ఏవేవో హామీలు ఇస్తున్నారు.. వెళుతున్నారు.. అంతే.. ఆ తర్వాత పరిస్థితి మళ్లీ మామూలే. అయినా ఆ గ్రామస్తులు ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని ఆశపడుతున్నారు. దాన్నే శ్వాసగా చేసుకొని కాలం వెళ్లదీస్తున్నారు. జిల్లాకు శివారున, ఒడిశా సరిహద్దుకు ఆనుకొని ఉన్న ఆ బాధాతప్త పెనుగొటివాడ గ్రామాన్ని పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ సందర్శించారు. ప్రజాప్రతినిధిగా కాకుండా ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా గ్రామంలోకి అడుగుపెట్టి వంశధార సృష్టించిన విలయాన్ని.. స్థానికుల కన్నీటి గాథలను స్వయంగా చూశారు.. విన్నారు.. రెండేళ్లలో సమస్యకు పరిష్కారం చూపిస్తానని భరోసా ఇచ్చిన ఆయన గ్రామస్తులతో జరిపిన మాటామంతీ యథాతథంగా.. కలమట: నువ్వు రైతువేనా? పంటలు ఎలా పండుతున్నాయి? కె.మృత్యుంజయ(రైతు): నేను రైతునే బాబు ఒకప్పుడు. మా పంట పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. ఇంక పంటలేమి పండుతాయి. అన్నీ రెల్లి తుప్పలు వేశాయి. మా బాధలు ఎవరూ పట్టించుకోవడం లేదు. అధికారులు, నాయకులు వచ్చి చూసెల్లిపోతున్నారు. కలమట: ఇసుక మేటలు ఎంత మేర వేశాయి. వాటిని ఎలా తొలగించాలనుకుంటున్నారు? కె.జమ్మినాయుడు(రైతు): ఇసుక మేటలు 2006 నుంచి ఉన్నాయి. వీటిని తొలగించేందుకు ప్రభుత్వాలు ఎలాంటి సహాయం ఇవ్వలేదు. ఇప్పుడైనా పంట పొలాల్లో ఉన్న ఇసుక మేటలను తొలగించుకునేందుకు సాయం చేయమని కోరుతున్నాం. కలమట: ఎంత విస్తీర్ణంలో మేటలు వేసి ఉంటాయి. ఇంకా మిగిలి ఉన్న భూములు ఏమైనా ఉన్నాయా? జి.ఆనందరావు: పెనుగొటివాడ, మాతల రెవెన్యూ గ్రామాల్లో సుమారు 1250 ఎకరాల్లో ఇసుక మేటలు వేశాయి. మిగిలిన పొలాలు వరద నీటిలోనే ఉంటాయి. చిన్న చినుకు పడితే మునిగిపోతాయి. మేటలు తొలగించడంతో పాటు వంశధార నదికి కరకట్టలు కట్టేందుకు ఎమ్మెల్యేగా మీరే చర్యలు తీసుకోవాలి. కలమట: గతంలో అధికారులు గ్రామానికి వచ్చారా.. ఎలాంటి చర్యలు తీసుకుంటామని చెప్పారు? రేగేటి మురళి: వరదలు వచ్చినప్పుడే జిల్లా కలెక్టర్‌తో పాటు ఎంతో మంది అధికారులు మా గ్రామాలకు వస్తున్నారు. ఆప్పుడు ఎన్నో మాటలు చెపుతున్నారు. అందులో ఒక్కటీ అమలు కాలేదు. మాది సుమారు 35 ఎకరాల భూమి. వరదనీరు, ఇసుక మేటల కారణంగా పంటలు పండటంలేదు. వృద్ధురాలితో... కలమట: అమ్మా బాగున్నావా.. ఆరోగ్యం బాగుందా. వరదలు వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది? గవర వరలక్ష్మి: ఎం బాగు నాయనా.. మా ఊరికి ఒక ఆటో కూడా రాదు. ఎవరికైనా బాగులేనప్పుడు మంచానికి కట్టి మోసుకెళతారు. వరదలు వచ్చినప్పుడు ఊరి చుట్టు నీరే ఉంటుంది. భయం భయంగా బతుకుతున్నాం. 8 సంవత్సరాలుగా ఇదే తీరు నాయనా.. మీరైనా పట్టించుకోండి. కలమట: మీ పిల్లలు ఏమి చేస్తున్నారు. ఆరోగ్యం బాగుందా? నూలు అంకమ్మ: మా ఊరికి వరదలని, చేసేందుకు పనుల్లేక పోవడంతో పిల్లలు వలస వెళ్లిపోతున్నారు. ముసలోల్లమే ఊరు పట్టుకుని ఉన్నాం. ఆరోగ్యం అంతంత మాత్రమే. ఏదో నాయనా నువ్వు వచ్చి మా కట్టాలు అడిగావయ్యా.. సంతోసంగా ఉంది. పింఛను లబ్ధిదారులతో.. కలమట: ప్రతి నెల పింఛను డబ్బులు వస్తున్నాయా.. ఎంత ఇస్తున్నారు? బొంతల సూర్యకాంతం: ప్రతి నెల డబ్బులు వత్తన్నాయి. నెలకు రూ.వెయ్యి ఇత్తన్నారు బాబు. మా పొలాలే పండకుండా పోతున్నాయి. మీరైనా మంచి చేయండి. జడగ గణపతి(వికలాంగుడు): ఎమ్మెల్యే బాబూ.. నాకు ప్రతి నెల రూ.200 పింఛను అందేది. నాకు కాలు వంకర పోయింది. అది తక్కువగా ఉందని పింఛను ఆపేశారు. దాంతో పూట గడవడం కట్టంగా ఉందయ్యా. మీరైనా పింఛను వచ్చేలా చేయండయ్యా.. కలమట: జిల్లా కలెక్టర్లు, అనేక మంది అధికారులు మీ ఊరు వచ్చి సమస్యలు విని వెళ్లారు. ఊరు బాగు కోసం ఏం చేస్తే బాగుంటుందని మీరనుకుంటున్నారు? ఇతర గ్రామస్తులతో.. కందుకూరి పాపారావు: ఆయ్యా నేను విశ్రాంత ఉపాధ్యాయుడ్ని. వరదల కారణంగా ఇసుక మేటలు వేయడంతో ప్రస్తుతం మా పొలం ఎక్కడుందో కూడా తెలియదు. తుప్పలు ఉండటంతో అడవి పందులు, విష పురుగులు చేరాయి. అటువైపు వెళ్లలేని దుస్థితి. పంట భూములకు పరిహారం ఇచ్చి మా గ్రామానికి పునరావాస ప్యాకేజీ కల్పిస్తే మేమంతా మరో చోటికి వెళ్లిపోతాం. స్థానిక ఎమ్మెల్యేగా మీరు, ప్రజా సమస్యలపై పోరాడే పత్రికగా ‘సాక్షి’ ఈ విషయంలో మాకు సహాయం చేయాలి. కలమట: ప్రస్తుతం ఏం పనులు చేస్తున్నారు. మీ జీవనం ఎలా సాగుతోంది? కొప్పిశెట్టి సుబ్బారావు: మమ్మల్ని ఉపాధి హామీ పథకం కొంత ఆదుకుంటోంది. వేసవిలో పనులు దొరుకుతున్నాయి. ఇబ్బందులు ఉండటంలేదు. జూన్ నుంచి పనులు ఉండవు. దీంతో పూట గడవటం కష్టంగా ఉంటుంది. మా ఊరికి ఏడాదంతా పనులు ఉండేలా చర్యలు తీసుకోవాలి. కలమట: గ్రామంలో యువకుడువి నువ్వొక్కడివే కనిపించావు. ఏం చేస్తున్నావు? కందుకూరి ఫల్గుణరావు: సార్ నేను ఆటో నడుపుకొని జీవిస్తున్నాను. ఆటో మా ఊరి వరకు రాదు. పక్కనున్న మాతలలో ఆటో ఉంటుంది. అక్కడి నుంచి నివగాం మీదుగా కొత్తూరు వరకు, లేకుంటే పాతపట్నం, పర్లాకిమిడి వరకు నడిపి జీవిస్తున్నారు. మా ఊరి వరకు రోడ్డు వేసేలా చర్యలు తీసుకోవాలి. చేనేత కార్మికుడితో.. కలమట: అయ్యా.. నువ్వు నేత కార్మికుడివని విన్నాను. ఇప్పుడు బట్టలు నేస్తున్నావా.. పింఛను వస్తుందా? అలక చంద్రరావు: ఇప్పుడు బట్టలు నేయడంలేదు. ఒకప్పుడు కుటుంబమంతా నేసేవారం. ఇప్పుడంతా కొత్తకొత్త రకాల బట్టలు వచ్చాయి. మాకు పనిలేకుండా పోయింది. ఎవరైనా సరుకు ఇచ్చి నేయమంటే నేస్తాను. నాకు పింఛను వస్తోంది. కలమట: మీ కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి. గ్రామంలో మీరంతా ఎలా జీవిస్తున్నారు? కె.శ్రీరాములు: 2006 తరువాత మా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మా ఊరిలోని ఆడపిల్లలను పెళ్లి చేసుకునేందుకు, మా ఊరికి కోడళ్లుగా వచ్చేందుకు ఎవరు ముందుకు రావడలేదు. మా పిల్లలు ఎక్కడో పట్టణ ప్రాంతాల్లో కూలి పనులు చేసుకుని పంపించిన డబ్బులతో గ్రామంలో ముసలి వాళ్లమంతా జీవిస్తున్నాం. వంశధార వరదలు మా జీవితాలను దుర్భరం చేస్తున్నాయి. విద్యార్థులతో.. కటమట: మీరంతా బడికి వెళ్లడం లేదా? పిల్లలు: వెళ్తున్నాం. ఇప్పుడు క్రిస్మస్ హాలిడేస్ ఇచ్చారు. కలమట: మీ బడికి టీచర్లు రోజూ వస్తున్నారా..ప్రతి రోజూ తెరుస్తున్నారా? పిల్లలు: మా టీచరు రోజూ వస్తారు. వర్షం పడితే మాత్రం బడికి సెలవే. ఊరి చుట్టూ నీరు వచ్చేస్తుంది. టీచరు ఊరిలోకి రాలేరు. అప్పుడు మా ఊరి వాళ్లు ఎక్కడికీ వెళ్లడం అవ్వదు. -
'విఠలాచార్య మాయలను తలపిస్తున్నారు'
శ్రీకాకుళం : చంద్రబాబు నాయుడు మాటలు విఠలాచార్య మాయలను తలపిస్తున్నాయని పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ వ్యాఖ్యానించారు. బాబు మాయమాటలను తెలుసుకున్న ప్రజలు ...వైఎస్ఆర్ సీపీ చేపట్టిన మహాధర్నాకు స్వచ్ఛందంగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారన్నారు. మహాధర్నాను అడ్డుకోవడానికి ప్రభుత్వం అడుగడుగునా ప్రయత్నిస్తుందని ప్రయత్నించిందని ... పోలీసుల సాయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అడ్డుకుంటుందని విమర్శించారు. ప్రభుత్వ కుయుక్తులు ఫలించవని కలమట వెంకటరమణ స్పష్టం చేశారు. -
సమస్యలు ఉన్నా సర్దుకుపోండి!
శ్రీకాకుళం/రిమ్స్ క్యాంపస్: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్‌సీల్లో వైద్యసేవలు సక్రమంగా అందకపోవడానికి ప్రభుత్వ లోపం కూడా కారణమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ అన్నారు. మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందుబాటులో ఉన్న సౌకర్యాలను ఉపయోగించుకుని రోగులకు సేవలందించాలని వైద్యులకు సూచిం చారు. జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ, ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలల పనితీరు సంతృప్తికరంగా లేదని, పొరపాట్లను సరిదిద్దుకోవాలని సూచించారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధులు ఎక్కువని, దీనిపై తక్షణమే సర్వే చేరుుస్తామన్నారు. రాష్ట్ర స్థాయిలో అన్ని ఆరోగ్యశాఖలను డైరక్టర్ ఆఫ్ హాస్పిటల్స్ పేరిట ఓ గొడుగు కిందకు తీసుకురావాల్సి ఉందన్నారు. ప్రతి జిల్లాకూ ఒక ఐఏఎస్ స్థాయి అధికారిని కో-ఆర్డినేటర్‌గా నియమిస్తున్నట్టు ప్రకటించారు. సిగ్గుచేటు... మంత్రి స్థాయిలో జరిగిన సమీక్షల్లో వైద్యాధికారులు, కిందిస్థాయి సిబ్బంది పనితీరు బాగులేదన్న ఆరోపణలపై మాట్లాడుకోవాల్సి రావడం సిగ్గు చేటని కార్మికశాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సిబ్బందిపై ఫిర్యాదులు వస్తున్నా ఎందుకు స్పందించడం లేదని డీఎంహెచ్‌వో, డీసీహెచ్‌లను నిలదీశారు. ఇటువంటి వాటిపై కలెక్టర్ దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సిబ్బంది, మౌలిక వసతుల కొరతపై ఫిర్యాదు... ఆస్పత్రుల్లో సిబ్బంది, మౌలిక వసతుల కొరత ఉందని, ఆముదాలవలస ఆస్పత్రిలో రెండేళ్లుగా శస్త్ర చికిత్సలు జరుగలేదని ప్రభుత్వ విప్ కూన రవికుమార్ చెప్పడంతో వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హిరమండలం, కొత్తూరు, పాతపట్నం ఏరియా ఆస్పత్రులు, పీహెచ్‌సీలు, సీహెచ్సీలలో అధికారులకు తెలిసి వైద్యులు, సిబ్బంది గైర్హాజరు అవుతుండడాన్ని పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. హిరమండలంలో జూనియర్ అసిస్టెంట్ తరచూ విధులకు గైర్హాజరు అవుతున్నట్టు వైద్యాధికారి జిల్లా వైద్యాధికారుల దృష్టికి తీసుకువచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదని డీఎంహెచ్‌వోను మంత్రులు నిలదీశారు. అనేక సందర్భాల్లో డీసీహెచ్ఎస్, డీఎంహెచ్వోలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోగా సరికాదని హితవు పలికారు. పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి మాట్లాడుతూ పాలకొండ ఆస్పత్రిని జిల్లా స్థాయికి పెంచుతామని చెప్పినా ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదన్నారు. సీతంపేటతో పాటు గిరిజన ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలు అధ్వానంగా ఉన్నాయని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు మాట్లాడుతూ రాజాం ఆస్పత్రి స్థాయి పెంచినా పోస్టులను పెంచకపోవడంతో వైద్యసేవలు సక్రమంగా అందడం లేదని, భవనాల మరమ్మతులు, సీజనల్ వ్యాధులకు సంబంధిం చిన మందులు అందించాలని కోరారు. తాను ఇటీవలే జిల్లాకు రావడం వలన ప్రస్తుత సమావేశంలో వచ్చిన సమస్యలేవీ తన దృష్టికి రాలేదని తక్షణం వీటిని పరిశీలించి సరిచేస్తామని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. దీనికి స్పందిం చిన మంత్రులు కేవలం సరిచేయడమే కాదని ఎవరిదైనా తప్పనుకుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో శాసనసభ్యులు గుండ లక్ష్మీదేవి, బెం దాళం అశోక్, బగ్గు రమణమూర్తులు కూడా ప్రసంగించగా రాష్ట్ర ప్రజారోగ్యశాఖ సంచాలకులు డాక్టర్ అరుణకుమారి డీఎంహెచ్‌వో డాక్టర్ గీతాం జలి, డీసీహెచ్ఎస్ సునీలా పాల్గొన్నారు. రిమ్స్ పరిశీలన... రిమ్స్ ఆస్పత్రిలోని పలు ఓపీ విభాగాలు, వార్డులను మంత్రి కామినేని పరిశీలించారు. ముందుగా గైనిక్ ఓపిని పరిశీలించారు. సేవలపై ఆరా తీశారు. నిర్మాణం మధ్యలో నిలిచిపోయిన బ్లాకులను పరిశీలించి, అక్కడ నెలకొన్న అపారిశుద్ధ్యం నెలకొని ఉండడంతో అసహనం వ్యక్తం చేశారు. ఆపరేషన్ థియేటర్, డయాలసిస్ సెంటర్‌ను పరిశీలించి అక్కడి సేవలను తెలుసుకున్నారు. అనంతరం ఆరోగ్యశ్రీ వార్డు ను పరిశీలించారు. అక్కడ తక్కువ మంది రోగులు ఉండటంతో ఆరోగ్యశ్రీ సేవలను విసృ్తతం చేయాలని సూచించారు. రిమ్స్ తీరును మార్చాలని డెరైక్టర్‌ను ఆదేశించారు. పలు ప్రారంభోత్సవాలు రిమ్స్‌లో పునర్నిర్మించిన అత్యవసర విభాగాన్ని తొలుత మంత్రి ప్రారంభించారు. క్యాజువాల్టికే రంగులు వేసి, పునర్నిర్మించినట్టు శిలాఫలకం ఏర్పాటు చేసి మంత్రితో ప్రారంభోత్సవం జరిపించడంతో విమర్శలు వినిపించాయి. తరువాత రిమ్స్ ఆడిటోరింయలో స్టాఫ్ అండ్ స్టూడెంట్ క్యాంటీన్‌ను ప్రారంభించారు. అక్కడే కాఫీ పాయింట్‌ను, రిమ్స్ ఉద్యోగుల కోసం ‘మ్యూచ్యువల్ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ స్టోర్సు’ను ప్రారంభించారు. అన్నపూర్ణ పథకం బాగుంది రిమ్స్ ఆసుపత్రి ఆవరణలో శ్రీసత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీసత్యసాయి ఆన్నపూర్ణ నిత్యఅన్నదాన సేవా పథ కం నిర్వహణ బాగుందని మంత్రి కితా బిచ్చారు. వీటి నిర్వహణపై సేవా సంస్థల జిల్లా అధ్యక్షుడు గంగుల రమణబాబుని అడిగి తెలుసుకున్నారు. ఆర్ఎస్ఎస్ నాయకుడు శ్రీనివాస్‌కు మంత్రి పరామర్శ... రిమ్స్ ఆస్పత్రి ఆరోగ్యశ్రీ వార్డులో చికిత్స పొందుతున్న రాష్రీయ స్వయం సేవక సంఘం(ఆర్.ఎస్.ఎస్) నాయకులు శ్రీనివాస్‌ను మంత్రి పలకరించారు. కళ్లు తిరిగి కిందపడిన ఘటనలో శ్రీనివాస్‌కు రెండు చేతులు భుజాలు తప్పిపోవటంతో శస్త్రచికిత్స చేశారు. దీంతో ఆయన్ను పరామర్శించారు. కిడ్నీ వ్యాధులపై జిల్లాకు ప్రత్యేక బృందం అరసవల్లి: జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలోని కిడ్నీ వ్యాధులపై త్వరలో ప్రత్యేక బృందం రానుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కా మినేని శ్రీనివాసరావు అన్నారు. బీజేపీ నాయకులతో స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి కమిటీలోనూ పార్టీ సభ్యుడు ఒక్కరైనా ఉండేలా కృషి చేస్తానన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పైడి వేణుగోపాలం, పూడి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.