సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పాతపట్నంలో టీడీపీ టికెట్ రేసు అనేక మలుపులు తిరుగుతోంది. కింజరాపు కుటుంబం ఒకరికి హ్యాండ్ ఇవ్వడంతో ఇక్కడ రాజకీయం రసకందాయంలో పడింది. పార్టీ కోసం పనిచేస్తున్న మామిడి గోవిందరావును లక్ష్యంగా చేసుకుని కింజరాపు ఫ్యామిలీ రాజకీయాలు చేస్తోంది. అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణను అచ్చెన్నాయుడుతో పాటు ఎంపీ రామ్మోహన్‌నాయుడు వెనకేసుకొస్తున్నారు. అచ్చెన్నాయుడు ఇంతకుముందు చెప్పినట్టు మామిడి గోవిందరావు చేత డబ్బులు ఖర్చు పెట్టించుకుని, కొన్నాళ్లు వాడుకుని ఆ తర్వాత వదిలేస్తామన్న వ్యాఖ్యలు నిజం చేస్తున్నారు. దీన్ని పసిగట్టిన మామిడి కూడా అప్రమత్తమయ్యారు. వీళ్లని కాదని ఏకంగా లోకేష్‌తో టచ్‌లోకి వెళ్లారు. తనకే సీటు వస్తుందని నియోజకవర్గంలో పార్టీ పరంగా బల నిరూపణ చేసుకుంటున్నారు. దానికి తన పుట్టిన రోజున వేదికగా చేసుకుని కలమట వెంకటరమణకు, ఆయనకు మద్దతుగా ఉన్న కింజరాపు ఫ్యామిలీకి పరోక్షంగా సవాల్ విసిరారు.
రెండు వర్గాలుగా విడిపోయి.. పాతపట్నంలో టీడీపీ గ్రూపు రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. కార్యకర్తలు ఎవరివైపు ఉండాలో తేల్చుకోలేక సతమతమవుతున్నారు. జిల్లాకు పెద్ద దిక్కు అనుకుంటున్న కింజరాపు ఫ్యామిలీ ఎత్తుగడలను అంచనా వేయలేక తీవ్రంగా నలిగిపోతున్నారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, మామిడి గోవిందరావు రెండు వర్గాలుగా విడిపోయారు. మొదట్లో పార్టీ కేడర్‌లో కొంత బలంగా కలమట కనిపించినా మామిడి గోవిందరావు వ్యూహాత్మక రాజకీయాలతో ఆ పార్టీలోని కీలక నాయకులను తనవైపు తిప్పుకుంటున్నారు. చెప్పాలంటే టీడీపీ కేడర్‌ను నిట్టనిలువునా చీల్చేశారు. మొన్నటికి మొన్న ఎల్‌ఎన్‌పేట మండల పార్టీ నాయకులు వెలమల గోవిందరావు, కాగన మన్మధరావును తనవైపు తిప్పుకోగా, తాజాగా హిరమండలం పార్టీ నాయకులు యాళ్ల నాగేశ్వరరావును తనవైపు లాక్కున్నారు. ఇలా ఒక్కొక్కరిగా కలమట అనుచరులు, పార్టీ నాయకులను మామిడి గోవిందరావు తన వెంట తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు.
ఇలా జరుగుతుందని పసిగట్టే గతంలో కలమట వెంకటరమణ కింజరాపు ఫ్యామిలీ వద్ద పంచాయితీ పెట్టారు. మామిడిని ప్రోత్సహించవద్దని మొర పెట్టుకున్నారు. ఈ సమయంలో కింజరాపు అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌నాయుడు డబుల్ గేమ్ ఆడారు. ‘వాడుకుని వదిలేద్దామని...పార్టీ కోసం బాగా ఖర్చు పెట్టించి, తద్వారా నీకు మేలు జరిగేలా చూస్తామని’ కలమట వెంకటరమణ వద్ద అచ్చెన్నాయుడు బాహాటంగానే వ్యాఖ్యానించారు. అప్పట్లో ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టి సంచలనం సృష్టించింది. ఇదే సమయంలో మామిడి గోవిందరావు వద్ద ‘నీకెందుకు మేమున్నాం.. కలమటను పట్టించుకోవద్దు.. ఆయన అలాగే మాట్లాడుతాడు. మేము అసలు పట్టించుకోం.. నీ పని నువ్వు చేయ్’ అంటూ ప్రోత్స హించారు.
ఇలా ఇద్దరి మధ్య చిచ్చు పెడుతూ ఒకరికి తెలియకుండా మరొకరిని సమర్థించారు.తర్వాత పార్టీలో పరిణామాలు మారిపోయాయి. కింజరాపు ఫ్యామిలీని కలమట వెంకటరమణ ఏ రకంగా బ్లాక్ మెయిల్ చేశారో గానీ మామిడి గోవిందరావుకు మద్దతు లేకుండా చేయగలిగారు. అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌నాయుడు కూడా మామిడిని దూరం పెడుతున్నారు. తరుచూ కలుద్దామని ప్రయత్నిస్తున్న మామిడి అండ్ కోకు అకాశమివ్వడం లేదు. డైరెక్ట్‌గా కలమటకు మద్దతు ఇచ్చేలా వ్యవహరిస్తున్నారు. ఇదంతా గమనించిన మామిడి కూడా తన రాజకీయ వైఖరిని మార్చుకున్నారు. కింజరాపు నీడ నుంచి బయటపడి లోకేష్ వద్దకు చేరుకున్నారు. లోకేష్‌తో టచ్‌లోకి వెళ్లి కింజరాపు ఫ్యామిలీ వ్యూహాలకు దీటుగా రాజకీయాలు చేస్తున్నారు.
అదే సందర్భంలో కింజరాపు ఫ్యామిలీ మద్దతిస్తున్న కలమట వెంకటరమణకు నియోజకవర్గంలో బలం లేదని నిరూపించేందుకు తరచూ ప్రయత్నిస్తున్నారు. చెప్పాలంటే కింజరాపు అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌నాయుడుకు సవాల్ విసిరేలా బల నిరూపణ చేస్తున్నారు. ఇటీవల జరిగిన తన పుట్టిన రోజు వేడుకను కూడా బల నిరూపణ సభగా మార్చేశారు. ఆ వేదికపై కలమట వెంకటరమణే లక్ష్యంగా చెలరేగిపోయారు. గతంలో అవినీతి చేసిన కలమటకు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వకూడదని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కింజరాపు ఫ్యామిలీ మద్దతిస్తున్న కలమట వెనక ఎవరూ లేరన్నట్టుగా మండలాల వారీగా నాయకులను తనవైపు తిప్పుకుని వేదికపైనే బల ప్రదర్శనగా చూపించారు. ఇదంతా చూసి మామిడిని కూడా అదును చూసే దెబ్బకొట్టే పనిలో కింజరాపు ఫ్యామిలీ ఉన్నట్టుగా నియోజకవర్గంలో చర్చ నడుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment