ఆశే వారి శ్వాస | VIP Reporter with Kalamata Venkataramana | Sakshi
Sakshi News home page

ఆశే వారి శ్వాస

Published Sun, Dec 28 2014 1:06 AM | Last Updated on Sat, Sep 2 2017 6:50 PM

ఆశే వారి శ్వాస

ఆశే వారి శ్వాస

చుట్టూ ఎటు చూసినా పచ్చని పొలాలు.. జీడిమామిడి తోటలు.. పక్కనే గలగల పారే వంశధార. చూడ్డానికి ఎంతో ఆహ్లాదకరంగా కనిపించే ఆ గ్రామ ప్రజల  మనస్సుల్లో మాత్రం గుండెలు పిండేసే వ్యథ గూడుకట్టుకుంది. గ్రామ భూములను సస్యశ్యామలం చేయాల్సిన వంశధార ఏటా వరదల రూపంలో దాడి చేస్తూ గ్రామానికిప్రపంచంతో సంబంధాలను తుంచేస్తోంది. ఇసుక మేటల రూపంలో సారవంతమైన భూములను బీళ్లుగా మార్చేస్తోంది. విలువైన పంట భూములు రెల్లు తుప్పలుగా మారిపోయాయి. 2006 నుంచి ఏటా ఇదే చేదు అనుభవం. ఆ ఏడాది వరదలకు వరదగట్టుకు సుమారు 400 మీటర్ల గండి పడి గ్రామ స్వరూపాన్నే మార్చేసింది. ప్రజల జీవనాన్ని దుర్భరం చేసింది. ప్రతి ఏటా వరదల సమయంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఎందరో వస్తున్నారు.. ఏవేవో హామీలు ఇస్తున్నారు.. వెళుతున్నారు.. అంతే.. ఆ తర్వాత పరిస్థితి మళ్లీ మామూలే. అయినా ఆ గ్రామస్తులు ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని ఆశపడుతున్నారు. దాన్నే శ్వాసగా చేసుకొని కాలం వెళ్లదీస్తున్నారు. జిల్లాకు శివారున, ఒడిశా సరిహద్దుకు ఆనుకొని ఉన్న ఆ బాధాతప్త పెనుగొటివాడ గ్రామాన్ని పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ సందర్శించారు. ప్రజాప్రతినిధిగా కాకుండా ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా గ్రామంలోకి అడుగుపెట్టి వంశధార సృష్టించిన విలయాన్ని.. స్థానికుల కన్నీటి గాథలను స్వయంగా చూశారు.. విన్నారు.. రెండేళ్లలో సమస్యకు పరిష్కారం చూపిస్తానని భరోసా ఇచ్చిన ఆయన గ్రామస్తులతో జరిపిన మాటామంతీ యథాతథంగా..
 
  కలమట: నువ్వు రైతువేనా? పంటలు ఎలా పండుతున్నాయి?
 కె.మృత్యుంజయ(రైతు): నేను రైతునే బాబు ఒకప్పుడు. మా పంట పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. ఇంక పంటలేమి పండుతాయి. అన్నీ రెల్లి తుప్పలు వేశాయి. మా బాధలు ఎవరూ పట్టించుకోవడం లేదు. అధికారులు, నాయకులు వచ్చి చూసెల్లిపోతున్నారు.
 కలమట: ఇసుక మేటలు ఎంత మేర వేశాయి. వాటిని ఎలా తొలగించాలనుకుంటున్నారు?
 కె.జమ్మినాయుడు(రైతు): ఇసుక మేటలు 2006 నుంచి ఉన్నాయి. వీటిని తొలగించేందుకు ప్రభుత్వాలు ఎలాంటి సహాయం ఇవ్వలేదు. ఇప్పుడైనా పంట పొలాల్లో ఉన్న ఇసుక మేటలను తొలగించుకునేందుకు సాయం చేయమని కోరుతున్నాం.
 కలమట: ఎంత విస్తీర్ణంలో మేటలు వేసి ఉంటాయి. ఇంకా మిగిలి ఉన్న భూములు ఏమైనా ఉన్నాయా?
 జి.ఆనందరావు: పెనుగొటివాడ, మాతల రెవెన్యూ గ్రామాల్లో సుమారు 1250 ఎకరాల్లో ఇసుక మేటలు వేశాయి. మిగిలిన పొలాలు వరద నీటిలోనే ఉంటాయి. చిన్న చినుకు పడితే మునిగిపోతాయి. మేటలు తొలగించడంతో పాటు వంశధార నదికి కరకట్టలు కట్టేందుకు ఎమ్మెల్యేగా మీరే చర్యలు తీసుకోవాలి.
 కలమట: గతంలో అధికారులు గ్రామానికి వచ్చారా.. ఎలాంటి చర్యలు తీసుకుంటామని చెప్పారు?
 రేగేటి మురళి: వరదలు వచ్చినప్పుడే జిల్లా కలెక్టర్‌తో పాటు ఎంతో మంది అధికారులు మా గ్రామాలకు వస్తున్నారు. ఆప్పుడు  ఎన్నో మాటలు చెపుతున్నారు. అందులో ఒక్కటీ అమలు కాలేదు. మాది సుమారు 35 ఎకరాల భూమి. వరదనీరు, ఇసుక మేటల కారణంగా పంటలు పండటంలేదు.
 వృద్ధురాలితో...
 కలమట: అమ్మా బాగున్నావా.. ఆరోగ్యం బాగుందా. వరదలు వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది?
 గవర వరలక్ష్మి: ఎం బాగు నాయనా.. మా ఊరికి ఒక ఆటో కూడా రాదు. ఎవరికైనా బాగులేనప్పుడు మంచానికి కట్టి మోసుకెళతారు. వరదలు వచ్చినప్పుడు ఊరి చుట్టు నీరే ఉంటుంది. భయం భయంగా బతుకుతున్నాం. 8 సంవత్సరాలుగా ఇదే తీరు నాయనా.. మీరైనా పట్టించుకోండి.
 కలమట: మీ పిల్లలు ఏమి చేస్తున్నారు. ఆరోగ్యం బాగుందా?
 నూలు అంకమ్మ: మా ఊరికి వరదలని, చేసేందుకు పనుల్లేక పోవడంతో పిల్లలు వలస వెళ్లిపోతున్నారు. ముసలోల్లమే ఊరు పట్టుకుని ఉన్నాం. ఆరోగ్యం అంతంత మాత్రమే. ఏదో నాయనా నువ్వు వచ్చి మా కట్టాలు అడిగావయ్యా.. సంతోసంగా ఉంది.
 పింఛను లబ్ధిదారులతో..
 కలమట: ప్రతి నెల పింఛను డబ్బులు వస్తున్నాయా.. ఎంత ఇస్తున్నారు?  
 బొంతల సూర్యకాంతం: ప్రతి నెల డబ్బులు వత్తన్నాయి. నెలకు రూ.వెయ్యి ఇత్తన్నారు బాబు. మా పొలాలే పండకుండా పోతున్నాయి. మీరైనా మంచి చేయండి.
 జడగ గణపతి(వికలాంగుడు): ఎమ్మెల్యే బాబూ.. నాకు ప్రతి నెల రూ.200 పింఛను అందేది. నాకు కాలు వంకర పోయింది. అది తక్కువగా ఉందని పింఛను ఆపేశారు. దాంతో పూట గడవడం కట్టంగా ఉందయ్యా. మీరైనా పింఛను వచ్చేలా చేయండయ్యా..
 కలమట: జిల్లా కలెక్టర్లు, అనేక మంది అధికారులు మీ ఊరు వచ్చి సమస్యలు విని వెళ్లారు. ఊరు బాగు కోసం ఏం చేస్తే బాగుంటుందని మీరనుకుంటున్నారు?
 ఇతర గ్రామస్తులతో..
 కందుకూరి పాపారావు: ఆయ్యా నేను విశ్రాంత ఉపాధ్యాయుడ్ని. వరదల కారణంగా ఇసుక మేటలు వేయడంతో ప్రస్తుతం మా పొలం ఎక్కడుందో కూడా తెలియదు. తుప్పలు ఉండటంతో అడవి పందులు, విష పురుగులు చేరాయి. అటువైపు వెళ్లలేని దుస్థితి. పంట భూములకు పరిహారం ఇచ్చి మా గ్రామానికి పునరావాస ప్యాకేజీ కల్పిస్తే మేమంతా మరో చోటికి వెళ్లిపోతాం. స్థానిక ఎమ్మెల్యేగా మీరు, ప్రజా సమస్యలపై పోరాడే పత్రికగా ‘సాక్షి’ ఈ విషయంలో మాకు సహాయం చేయాలి.
 కలమట: ప్రస్తుతం ఏం పనులు చేస్తున్నారు. మీ జీవనం ఎలా సాగుతోంది?
 కొప్పిశెట్టి సుబ్బారావు: మమ్మల్ని ఉపాధి హామీ పథకం కొంత ఆదుకుంటోంది. వేసవిలో పనులు దొరుకుతున్నాయి. ఇబ్బందులు ఉండటంలేదు. జూన్ నుంచి పనులు ఉండవు. దీంతో పూట గడవటం కష్టంగా ఉంటుంది. మా ఊరికి ఏడాదంతా పనులు ఉండేలా చర్యలు తీసుకోవాలి.
 కలమట: గ్రామంలో యువకుడువి నువ్వొక్కడివే కనిపించావు. ఏం చేస్తున్నావు?
 కందుకూరి ఫల్గుణరావు: సార్ నేను ఆటో నడుపుకొని జీవిస్తున్నాను. ఆటో మా ఊరి వరకు రాదు. పక్కనున్న మాతలలో ఆటో ఉంటుంది. అక్కడి నుంచి నివగాం మీదుగా కొత్తూరు వరకు, లేకుంటే పాతపట్నం, పర్లాకిమిడి వరకు నడిపి జీవిస్తున్నారు. మా ఊరి వరకు రోడ్డు వేసేలా చర్యలు తీసుకోవాలి.
 చేనేత కార్మికుడితో..
 కలమట: అయ్యా.. నువ్వు నేత కార్మికుడివని విన్నాను. ఇప్పుడు బట్టలు నేస్తున్నావా.. పింఛను వస్తుందా?
 అలక చంద్రరావు: ఇప్పుడు బట్టలు నేయడంలేదు. ఒకప్పుడు కుటుంబమంతా నేసేవారం. ఇప్పుడంతా కొత్తకొత్త రకాల బట్టలు వచ్చాయి. మాకు పనిలేకుండా పోయింది. ఎవరైనా సరుకు ఇచ్చి నేయమంటే నేస్తాను. నాకు పింఛను వస్తోంది.
 కలమట: మీ కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి. గ్రామంలో మీరంతా ఎలా జీవిస్తున్నారు?
 కె.శ్రీరాములు: 2006 తరువాత మా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మా ఊరిలోని ఆడపిల్లలను పెళ్లి చేసుకునేందుకు, మా ఊరికి కోడళ్లుగా వచ్చేందుకు ఎవరు ముందుకు రావడలేదు. మా పిల్లలు ఎక్కడో పట్టణ ప్రాంతాల్లో కూలి పనులు చేసుకుని పంపించిన డబ్బులతో గ్రామంలో ముసలి వాళ్లమంతా జీవిస్తున్నాం. వంశధార వరదలు మా జీవితాలను దుర్భరం చేస్తున్నాయి.
 విద్యార్థులతో..
 కటమట: మీరంతా బడికి వెళ్లడం లేదా?
 పిల్లలు: వెళ్తున్నాం. ఇప్పుడు క్రిస్మస్ హాలిడేస్ ఇచ్చారు.
 కలమట: మీ బడికి టీచర్లు రోజూ వస్తున్నారా..ప్రతి రోజూ తెరుస్తున్నారా?
 పిల్లలు: మా టీచరు రోజూ వస్తారు. వర్షం పడితే మాత్రం బడికి సెలవే. ఊరి చుట్టూ నీరు వచ్చేస్తుంది. టీచరు ఊరిలోకి రాలేరు. అప్పుడు మా ఊరి వాళ్లు ఎక్కడికీ వెళ్లడం అవ్వదు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement