ఇన్‌పుట్ సబ్సిడీ, వాతావరణ బీమా పరిహారం ఈ ఏడాది రైతులకు మంజూరు చేస్తారా, లేదా అన్నది అంతుచిక్కడం లేదు.
అనంతపురం అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : ఇన్‌పుట్ సబ్సిడీ, వాతావరణ బీమా పరిహారం ఈ ఏడాది రైతులకు మంజూరు చేస్తారా, లేదా అన్నది అంతుచిక్కడం లేదు. ఈ రెండింటి కింద జిల్లా రైతులకు సుమారు రూ.900 కోట్ల వరకు విడుదల కావాల్సి ఉంది. ఇన్‌పుట్, ఇన్సూరెన్స్ కింద పరిహారం తప్పకుండా అందజేస్తామని గతంలో మంత్రిగా ఎన్.రఘువీరారెడ్డి స్పష్టమైన ప్రకటన చేశారు.
కానీ... సార్వత్రిక ఎన్నికలు ముగిసి రాష్ట్రంలో, కేంద్రంలో కొత్తగా టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలు కొలువులోకి వస్తుండటంతో పరిహారం పరిస్థితి అర్థంకాకుండా పోయింది. 2013 ఖరీఫ్‌లో జిల్లాలో పంటల వారీగా, రైతుల వారీగా ఎంత నష్టం జరిగిందనే కరువు నివేదికను అధికారులు ప్రభుత్వానికి పంపారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా గత ఖరీఫ్‌లో పంటలు దారుణంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జిల్లాలో ఉన్న 63 మండలాలనూ రెండు విడతలుగా కరువు ప్రాంతాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
గతేడాది ఖరీఫ్‌లో 9.54 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగులోకి రాగా అందులో 6.70 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు నివేదికలో పొందుపరిచారు. 6.21 లక్షల మంది రైతులకు రూ.643.37 కోట్లు నష్టం జరిగినట్లు నివేదిక రూపొందించారు. అందులో కేవలం వేరుశనగ రైతులు 5.15 లక్షల మందికి రూ.592.66 కోట్లు నష్టం జరిగినట్లు నివేదిక అందజేశారు. మిగిలిన 11 పంటలకు రూ.51 కోట్ల వరకు నష్టం జరిగినట్లు కరువు నివేదిక పంపారు. సెప్టెంబర్ నెల మినహా తక్కిన నెలల్లో వర్షపాతం చాలా తక్కువగా కురవడంతో తప్పనిసరిగా గతేడాదికి వాతావరణ బీమా పథకం కింద పరిహారం వస్తుందని రైతులు ఆశలు పెట్టుకున్నారు. 2011లో రూ.98 కోట్లు, 2012లో రూ.181 కోట్లు విడుదలైన విషయం తెలిసిందే.
2011, 2012 సంవత్సరాల్లో కన్నా ఎక్కువ మొత్తంలో వాతావరణ బీమా విడుదల కావచ్చని గతంలో ప్రచారం జరిగింది. ఎంతలేదన్నా రూ.250 కోట్లకు పైగా బీమా పరిహారం రావచ్చని అనధికార వర్గాలు ప్రచారం చేశారు. ఈ లెక్కన కనీసం రూ.900 కోట్ల వరకు పరిహారం జిల్లాకు రావాల్సివున్న నేపథ్యంలో విడుదల చేస్తారా? లేదా? అన్నది అయోమయంగా మారింది. ఇదిలా ఉండగా ఇన్‌పుట్‌సబ్సిడీ కింద 2011లో రూ.398 కోట్లు, 2012లో రూ.648 కోట్లు విడుదలైన విషయం తెలిసిందే. మరి ఈ సారి ఇన్‌పుట్, ఇన్సూరెన్స్ కింద రైతులను ఆదుకుంటారా లేదా? అనే అంశంపై సందిగ్ధత నెలకొంది.