
ప్రభుత్వ వైఫల్యమే కారణం
రాజమహేంద్రవరం క్రైం : రూ.10 కోట్ల రూపాయలతో వీఐపీ ఘాట్ నిర్మించి, ముఖ్యమంత్రిని పుష్కర ఘాట్‌లోకి ఎలా అనుమతించారని న్యాయవాదులు, ప్రజా సంఘాల నాయకులు నిలదీశారు. మంగళవారం రాజమహేంద్రవరంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో పుష్కర తొక్కిసలాటపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ సీవై సోమయాజులు కమిషన్ బహిరంగ విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా అఫిడవిట్లు వేసిన న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి తదితరులు ఆనాటి సంఘటనకు సంబంధించి సమర్పించిన వివిధ చానళ్లలో ప్రసారమైన వీడియో క్లిప్పింగ్‌లు, ఫొటోలను, ఆధారాలను జస్టిస్ సోమయాజులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పరిశీలించారు. ప్రభుత్వ శాఖలకు ఆధారాలు సమర్పించేందుకు అవకాశం కల్పిస్తున్నామని, ఆధారాలు సమర్పించకపోతే సమన్లు జారీ చేసే విషయాన్ని పరిశీలిస్తామని ఈ విచారణను ఈ నెల 23కు వాయిదా వేశారు.
రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు ముప్పాళ్ల సుబ్బారావు తన వాదనలు వినిపిస్తూ, భారీ జనం ఉన్న ప్రాంతాల్లో ప్రముఖులు ప్రవేశించకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ, లక్షలాది మంది ఉన్న పుష్కర ఘాట్‌లోకి ముఖ్యమంత్రి కాన్వాయ్‌ని ఎలా అనుమతించారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఎక్కువ సేపు ఘాట్‌లో ఉండిపోవడం వల్లే గేట్లు మూయాల్సి వచ్చిందని, ఒక్కసారిగా గేట్లు తెరవడంతో ఎక్కువ సేపు క్యూలో నిలబడిన భక్తులు ఘాట్‌లోకి ప్రవేశించిన క్రమంలో తొక్కిసలాట చోటుచేసుకుందని పేర్కొన్నారు. చిన్న గేటుకు తోడు ఏడు మెట్లు ఘాట్ మొదట్లో ఉన్నాయని, దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు అవి కనిపించకపోవడంతో ఒకరిపై మరొకరు పడి నలిగిపోయారని వివరించారు.
మతపర కార్యక్రమాల్లో సీఎం పాల్గొనరాదు
భారత రాజ్యాగం ప్రకారం మత సంబంధ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొనకూడదని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు టి.అరుణ్ కమిషన్‌కు వివరించారు. మరో న్యాయవాది శ్రీనివాస్ తన వాదన వినిపిస్తూ ఒకటిన్న కి.మీ. కోటిలింగాల ఘాట్ ఉండగా, ముఖ్యమంత్రిని ఇరుకుగా ఉన్న పుష్కర ఘాట్‌లోకి అనుమతించడం వల్లే ఈ సంఘటన చోటు చేసుకుందని, పుష్కరాలకు స్పెషల్ ఆఫీసర్‌గా పని చేసిన ధనుంజయరెడ్డిని కమిషన్ విచారణ చేయాలని కోరారు. విచారణలో కమిషన్‌కు సహాయకుడిగా మద్దూరి శివసుబ్బారావు వ్యవహరించారు. ప్రభుత్వ ప్లీడర్ చింతపెంట ప్రభాకరరావు తన వాదనలు వినిపించారు. నగరపాలక సంస్థ వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకుడు లంక సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
శిక్షించకపోగా..అవార్డులు ఇచ్చారు : ఉండవల్లి
పుష్కర తొక్కిసలాటలో తొలి రోజు 29 మంది మరణించి, 52 మంది గాయాలపాలయ్యారని, ఈ సంఘటనలో ఎవరినీ సస్పెండ్ చేయకపోగా, పుష్కరాలు ముగిసిన అనంతరం అధికారులకు ముఖ్యమంత్రి అవార్డులు ఇచ్చారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ విమర్శించారు. 2005 కృష్ణా పుష్కరాల సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్‌లో రెయిలింగ్ పడిపోయిన సంఘటనలో ఐదుగురు మరణించగా, కలెక్టర్‌ను, ఎస్పీని, ఈఈని సస్పెండ్ చేశారని గుర్తుచేశారు.
సీఎం చంద్రబాబు దీనికి పూర్తి విరుద్ధంగా పుష్కరాలు ముగిసిన అనంతరం అధికారులకు అవార్డులు ఇచ్చారని పేర్కొన్నారు. సంఘటన జరిగిన వెంటనే ఆక్సిజన్, మంచినీరు సరఫరా చేసినా మరి కొందరు బతికేవారని చెప్పారు. ఈ సంఘటనకు పూర్తిగా ముఖ్యమంత్రే కారణమని పేర్కొన్నారు. పుష్కరాల సమయంలో తానే ఐ విట్‌నెస్ అని చెప్పారని, ఆయనను, కలెక్టర్, ఎస్పీలను కమిషన్ ముందు ప్రవేశపెట్టి, విచారణ జరపాలని కోరారు.