‘పెండింగ్‌’ పాపం ఎవరిది? | TDP government negligence on irrigation projects | Sakshi
Sakshi News home page

‘పెండింగ్‌’ పాపం ఎవరిది?

Published Sun, Sep 15 2019 4:17 AM | Last Updated on Sun, Sep 15 2019 5:33 AM

TDP government negligence on irrigation projects - Sakshi

సాక్షి, అమరావతి: ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న టీడీపీ సర్కారు సాగునీటి ప్రాజెక్టులను గాలికి వదిలేయటంతో ప్రస్తుత నీటి సంవత్సరం (జూన్‌ 1 నుంచి మే 31 వరకు)లో శనివారం ఉదయం ఆరు గంటల వరకు కృష్ణా, గోదావరి, వంశధార నుంచి 3,128.08 టీఎంసీలు బంగాళాఖాతం పాలయ్యాయి. ప్రకాశం బ్యారేజీ నుంచి 365.47 టీఎంసీలు, ధవళేశ్వరం నుంచి 2701.04 టీఎంసీలు, గొట్టా బ్యారేజీ నుంచి 61.57 టీఎంసీలు కడలిలో కలిశాయి. దివంగత వైఎస్సార్‌ జలయజ్ఞంలో భాగంగా చేపట్టి సింహభాగం పూర్తి చేసిన ప్రాజెక్టుల్లో మిగిలిన పనులను పూర్తి చేస్తే కృష్ణా, గోదావరి జలాలతో బంజరు భూములు సిరులు కురిపించేవి. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లు కమీషన్లు వచ్చే పనులకే ప్రాధాన్యం ఇవ్వడంతో పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో ఎన్నికల అనంతరం అధికారం చేపట్టిన సీఎం వైఎస్‌ జగన్‌ వరద నీటిని ఒడిసిపట్టి పెండింగ్‌ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేయడానికి నడుం బిగించారు. 

ఈ దుస్థితి గత సర్కారు నిర్వాకమే..
వరద వచ్చినప్పుడు ఒడిసిపట్టి శ్రీశైలం జలాశయం ద్వారా రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు తరలించేందుకు పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని 11 వేల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచే పనులను 2004లో చేపట్టిన దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2009 నాటికే పూర్తి చేశారు. రూ.15 కోట్ల పనులు మాత్రమే మిగిలాయి. 2009 నాటికే గాలేరు–నగరి, తెలుగుగంగ పనులు సింహభాగం పూర్తి చేశారు. అవుకు టన్నెళ్లలో కొంత భాగం, గండికోట సహాయ, పునరావాస ప్యాకేజీలో కొంత భాగం మాత్రమే మిగిలాయి.

ఆ తరువాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు 2019 మే వరకు పూర్తి చేయలేకపోయాయి. అవుకు టన్నెళ్ల పనులు చేయకుండా ఒక లూప్‌ మాత్రమే వేశారు. గండికోట నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడం వల్ల 12 టీఎంసీలకు మించి నిల్వ చేయలేని దుస్థితి నెలకొంది. తెలుగు గంగ ప్రధాన కాలువ లైనింగ్‌ పనులు పూర్తి చేసి ఉంటే బ్రహ్మంసాగర్‌లో 17.76 టీఎంసీలు నిల్వ చేసుకునే అవకాశం లభించేది. హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకంలోనూ ఇదే తీరు. వెలిగొండ ఒకటో సొరంగం పనుల్లో 3.6 కి.మీ.లు, రెండో సొరంగంలో 8.037 కి.మీ.ల పనులే మిగిలాయి. ఐదేళ్లు అధికారంలో ఉన్నా వీటిని పూర్తి చేయలేకపోయారు. వీటిని పూర్తి చేసి ఉంటే 43 టీఎంసీల కృష్ణా జలాలను ఒడిసిపట్టి దుర్భిక్ష ప్రకాశం, నెల్లూరు జిల్లాలను సస్యశ్యామలం చేయడానికి అవకాశం ఉండేది. 

కమీషన్ల కోసం పోలవరం దక్కించుకుని.. 
దివంగత వైఎస్సార్‌ 2009 నాటికే పుష్కర, తాడిపూడి, చాగల్నాడు ఎత్తిపోతల పథకాలను పూర్తి చేశారు. పోలవరంలో కుడి, ఎడమ కాలువల పనులను సింహభాగం పూర్తి చేశారు. కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టును పట్టుబట్టి కేంద్రం నుంచి దక్కించుకున్న టీడీపీ ఐదేళ్లు అధికారంలో ఉన్నా పూర్తి చేయలేదు. ఇది పూర్తైతే 301 టీఎంసీలను వినియోగించుకునే అవకాశం ఉండేది. ఉత్తరాంధ్ర, సుజల స్రవంతి, చింతలపూడి ఎత్తిపోతలను పూర్తిచేసి ఉంటే మరో 130 టీఎంసీలు వినియోగించుకునే అవకాశం దక్కేది. 

పునరావాసం కల్పించకపోవడంతో..
వంశధార, తోటపల్లి పనుల్లో సింహభాగం పనులను దివంగత వైఎస్సార్‌ 2009 నాటికే పూర్తి చేశారు. కేవలం రూ.236.17 కోట్లు ఖర్చు చేసి పునరావాసం కల్పించి ఉంటే తోటపల్లిలో పూర్తి సామర్థ్యం మేరకు 2.10 టీఎంసీలు నిల్వ చేసే అవకాశం ఉండేది. పునరావాసం కల్పించకపోవడం వల్ల 1.7 టీఎంసీలను మాత్రమే నిల్వ చేస్తున్నారు. వంశధారలో మిగిలిన పనులకు రూ.462.31 కోట్లు ఖర్చు చేసి ఉంటే 2.10 లక్షల ఎకరాలు సస్యశ్యామలమయ్యేవి. గత ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి పెండింగ్‌ పనులు పూర్తి చేసి ఉంటే సముద్రంలో కలిసిన వంశధార జలాల్లో కనీసం 40 టీఎంసీలు వినియోగించుకుని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను సస్యశ్యామలం చేసే అవకాశం ఉండేది.

వరద నీటిని ఒడిసిపట్టే ప్రణాళిక..
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక పెండింగ్‌ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు శ్రీకారం చుట్టారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీళ్లందించే ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి శరవేగంగా పూర్తి చేయాలని నిర్ణయించారు. 2020 జూన్‌ నాటికి వంశధార, తోటపల్లి, వెలిగొండ తొలిదశ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, చింతలపూడి తొలిదశ, నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ తదితర ప్రాజెక్టులను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. 2021 నాటికి పోలవరంతోపాటు సింహభాగం పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా వరద నీటిని ఒడిసిపట్టి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని నిర్ణయించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement