ఎవరో ఇస్తారని..
అన్నీ ఉన్నా..అల్లుడి నోట్లో శని అన్నట్లు తయారయ్యింది అన్నదాతల పరిస్థితి. అన్నదాతకు రెండు పంటలకు పూర్తిస్థాయిలో పుష్కలంగా సాగునీరు ఇచ్చేందుకు జలాశయం ఉంది. అయితే ఇరిగేషన్ అధికారుల అంచనాల పెంపుదల..పాలకుల నిర్లక్ష్యపు వ్యవహారం వల్ల అన్నదాతకు ఏటా కష్టాలే మిగులుతున్నాయి. జలాశయం కాలువల్లో అడ్డుకట్ట లేని నీటి ప్రవాహం..ఆ నీటిని నిల్వ చేయడానికి కాలువల్లో కానరాని షట్టర్లు..మరమ్మతుకు నోచుకోని కాలువలు..నిధులు విదల్చని నీటిపారుదలశాఖ..ఇదీ వెంగళరాయ సాగర్ జలాశయం పరిధిలోని రైతుల దీనస్థితి.
బొబ్బిలి:వెంగళరాయ సాగర్ జలాశయం ద్వారా ప్రధానంగా మక్కువ, బొబ్బిలి, సీతానగరం మండలాలకు సాగునీరు అందుతుంది. 30 ఏళ్లు దాటిన రిజర్వాయర్లను ఆధునికీకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో నిధుల కోసం ప్రతిపాదనలు పంపమని 15 ఏళ్ల క్రితం జపాన్ ప్రభుత్వం కోరింది. దీంతో జిల్లాలోని తాటిపూడి, వట్టిగెడ్డ,వెంగళరాయ సాగర్,పెదఅంకలాం ప్రాజెక్ట్‌లను ప్రభుత్వం ఆ ప్రతిపాదనల్లో చేర్చింది. వీటిలో ఒక్క తాటిపూడికే జపాన్ నిధులు వచ్చాయి. జపాన్ నిధులు అనే ఒకే ఒక్క మాట పట్టుకుని ప్రభుత్వం ఈ జలాశయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. అప్పటినుంచి వెంగళరాయ సాగర్ ఆధునికీకరణ కోసం ప్రభుత్వం ఏటా ప్రతిపాదనలు పంపిస్తూనే ఉంది. ఏటికేడాది ఇక్కడి అధికారులు కేంద్ర జల వనరుల సంఘానికి ప్రతిపాదనలు పంపడం, అవి అక్కడ మురగడం, మళ్లీ కొత్తవి కావాలని వారు అడగడం, పెంపుదలతో తాజాఅంచనాలు పంపిస్తుండడంతోనే కాలం గడిచిపోతోంది. ఇప్పుడు తాజాగా జపాన్ నిధుల కోసం పంపే ప్రతిపాదనలు రూ.63 కోట్లకు చేరాయి.
ఈ జలాశయానికి సంబంధించి ప్రధానకాలువ నుంచి పిల్ల కాలువల వరకూ ఎక్కడా సరైన మరమ్మతులు జరగలేదు. 90 శాతం షట్టర్లు లే కపోవడంతో నీరంతా వృథాగా పోతోంది. వృథా నీటిని కళ్లారా చూస్తున్న అన్నదాత అడుగడుగునా ఇబ్బందులకు గురవుతున్నాడు. నీరు వృథాగా పోకుండా ఎలాగైనా పొలాలకు మళ్లించాలని అన్నదాత వృథాగా పోతున్న నీటికి ఇసుక బస్తాలతో అడ్డుకట్ట కట్టుకుని నీటి నిల్వకు తాపత్ర య పడుతున్నాడు. కాలువలకు ఉండే రివిట్‌మెంట్‌లు జారి నీరు పోతున్నా అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి. ఇటీవల ఇక్కడ అక్విడెక్టు కూలిపోతే రైతులే ఇంజినీర్ల అవతారం ఎత్తి సొంత నిధులు సమకూర్చుకుని నీటిని వారి ప్రాంతాలకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. జపాన్ నిధులు వస్తాయి కదా అని రాష్ర్ట ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిధులు ఇవ్వక రైతులను ఇబ్బందులకు గురి చేస్తోంది. దీంతో రెండు పంటలకు ఇవ్వాల్సిన నీటిని కనీసం ఖరీఫ్‌కు కూడా సక్రమంగా ఇవ్వలేని దుస్థితి. అన్నదాతలకు కడుపుమండి ఇరిగేషన్ అధికారుల కార్యా లయాలకు వెళ్లి ఆందోళనలు చేసినా ఫలితం కనిపించడం లేదు.
అదనపు జలాల పరిస్థితీ అంతే..
ఇదిలా ఉండగా సాగర్ జలాశయం ద్వారా అదనపు జలాలను రైతులకు ఇవ్వొచ్చు అని అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆలోచన చేసి శంకుస్థాపన చేసినా జిల్లాకు చెందిన అప్పటి అధికార పార్టీ నాయకుల రాజకీయాలు..అధికారుల నిర్లక్ష్యం.. కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యంతో అది నేటికీ పూర్తి కాలేదు. 5 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వడానికి 2006లో గొల్లపల్లి వద్ద వైఎస్ శంకుస్థాపన చేసి రూ.పది కోట్లు నిధులు ఇచ్చారు. ఆ నిధులను సకాలంలో వినియోగించకపోవడం వల్ల అంచనాలు పెరిగి ఇప్పుడు అది రూ.11కోట్లకు చేరింది. సరే దానితోనైనా పనులు పూర్తవుతాయని అన్నదాత ఆశిస్తే కాంటాక్ట్రర్ల మధ్య విభేదాలు రావడంతో ఎక్కడి పనులక్కడే ఆగిపోయాయి. వీటిని సరిదిద్దడంలో ఇరిగేషన్ అధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఈ అదనపు జలాలను హైలెవెల్ కెనాల్ ద్వారా 3, 600 ఎకరాలకు, గొల్లపల్లి లింకు చానల్ ద్వారా 700 ఎకరాలకు, 5ఏఆర్ మైనర్ కాలువ ద్వారా 677 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని నిర్ణయించారు. వీటికి దాదాపు 40.35 ఎకరాల స్థలం కావాలని గుర్తించారు. వనరులు అందుబాటులో ఉన్నా వినియోగించుకోవడంలో ప్రభుత్వం విఫలమవ్వడంతో అన్నదాత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.