రిజిస్ట్రేషన్‌కే పరిమితం ! | Criticisms of selection of inspection projects | Sakshi
Sakshi News home page

రిజిస్ట్రేషన్‌కే పరిమితం !

Published Fri, Feb 9 2018 9:16 AM | Last Updated on Fri, Feb 9 2018 9:16 AM

Criticisms of selection of inspection projects - Sakshi

సోలార్‌ కార్‌ ప్రాజెక్టును ప్రదర్శిస్తున్న గుంటూరు జిల్లా పెదకాకాని విద్యార్థి టి.తరుణ్‌కుమార్‌

ఒంగోలు: ఇన్‌స్పయిర్‌ ప్రాజెక్టుల ప్రదర్శన తొలిరోజు కేవలం రిజిస్ట్రేషన్‌కే పరిమితమైంది. బంద్‌ ప్రభావంతో ఎంపికైన ప్రాజెక్టులను ప్రదర్శించేందుకు రావాల్సిన విద్యార్థులు, గైడ్‌లు రాలేకపోవడంతో ప్రారంభ కార్యక్రమాన్ని మంత్రి శిద్దా రాఘవరావు అనుమతి మేరకు శుక్రవారానికి వాయిదా వేశారు. స్థానిక సెయింట్‌ ఆగ్జీలియం అఖిల వికాస్‌ ఇంగ్లిషు మీడియం పాఠశాలలో ఈ కార్యక్రమానికి హాజరైన విద్యార్థులకు వసతి సౌకర్యంతోపాటు భోజన సౌకర్యం కల్పించింది. గురువారం రాత్రికి గుంటూరు నుంచి 106కుగాను 91 ప్రాజెక్టులు, ప్రకాశం జిల్లా నుంచి 321కిగాను 248 ప్రాజెక్టులు నమోదయ్యాయి. మిగిలినవి కూడా శుక్రవారం ఉదయానికల్లా వస్తాయని డీఈవో తెలిపారు.

ప్రాజెక్టుల ఎంపికపై విమర్శలు..
ఇన్‌స్పయిర్‌కు ఆన్‌లైన్‌లో పాఠశాలల విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకుంటారు. రిజిస్ట్రేషన్‌ చేసుకున్న అనంతరం వాటిని పరిశీలించి ఉత్తమమైనవిగా భావిస్తే జాతీయ కమిటీ ఎంపిక చేసి వాటి నిర్వహణకు అనుమతి ఇస్తుంది. ప్రాజెక్టు నిర్మాణానికి రూ.5 వేలు, విద్యార్థి, గైడ్‌ టీచర్‌ రవాణా తదితర ఖర్చులకు మరో రూ.5 వేలు కేంద్రం విడుదల చేస్తుంది. కానీ ఈ సారి ఎంపికైన ప్రాజెక్టులను పరిశీలిస్తే మార్కాపురం మండలంలోని ఒక పాఠశాలకు ఒకే ప్రాజెక్టుకు ఐదుగురు విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఐదుగురికి అదే ప్రాజెక్టు మంజూరైంది. అదే విధంగా ఒక కేజీబీవీ పాఠశాలకు 5 ప్రాజెక్టులు, మరో గొట్లగట్టుకు 5 ప్రాజెక్టులు మంజూరయ్యాయి. ఒకే పాఠశాలకు పెద్ద ఎత్తున ప్రాజెక్టులు మంజూరు చేశారని, వీటికంటే మంచి ప్రాజెక్టులను ప్రతిపాదించిన పాఠశాలలకు మొండిచేయ్యి చూపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తం 182 పాఠశాలల నుంచి 321 ప్రాజెక్టులను ఎంపిక చేయడం ద్వారా కేంద్ర స్థాయిలోనే ప్రాజెక్టుల ఎంపిక సరిగా జరగలేదనే వాదనలు లేకపోలేదు.

ఆకట్టుకున్న ప్రదర్శనలు..
గుంటూరు జిల్లా పెదకాకాని జెడ్పీస్కూలుకు చెందిన 10వ తరగతి విద్యార్థి టి.తరుణ్‌కుమార్‌ రూపొందించిన సోలార్‌ కారు ప్రాజెక్టు ఆకట్టుకుంది. సోలార్‌ ప్యానల్‌ ద్వారా మోర్టార్‌ కలిగిన చక్రాలు, బ్యాటరీల సాయంతో ఈ కారును తయారు చేశారు. అత్యంత తక్కువ వ్యయంతో ఇంధన సమస్యకు స్వస్తి చెప్పేందుకు తాను రూపొందించిన ప్రాజెక్టు ఉపయోగపడుతుదని విద్యార్థి చెబుతున్నాడు.
ప్రకాశం జిల్లా మంగమూరుకు చెందిన విద్యార్థిని రూపొందించిన పాసివ్‌ ఇన్‌ఫ్రారెడ్‌ సెక్యూరిటీ సిస్టం కూడా ఆకట్టుకుంది. ప్రస్తుతం సెక్యూరిటీ కోసం ఎక్కువగా సీసీ కెమెరాలను వినియోగిస్తున్నారు. దీని కారణంగా నిత్యం వీడియో రికార్డ చేయడం వల్ల ఎప్పుడైనా, ఏదైనా ఘటన జరిగిందీ లేనిదీ తెలుసుకోవాలంటే  మొత్తం వీడియో పరిశీలించుకోవాలి. అయితే ఈ విద్యార్థిని రూపొందించిన ప్రాజెక్టు కేవలం మనుషులు లేదా జంతువులు ఆ ప్రాంతాలకు వెళ్లినపుడు మాత్రమే ఫొటో తీస్తుంది. అంటే మనిషి లేదా జంతువులో ఉన్న ఉష్ణోగ్రతలను గ్రహిస్తూ పనిచేస్తుంది. అదే విధంగా పొలాల్లో మోటార్లు ఆన్‌చేస్తూ విద్యుత్‌షాక్‌కు గురై మరణించే రైతులను ఎంతోమందిని చూస్తుంటాం. దానికి కూడా కేవలం మొబైల్‌ ద్వారా నీటి పంపింగ్‌ ప్రక్రియను చేపట్టేందుకు డ్యూయల్‌టోన్‌ మల్టిపుల్‌ ఫ్రీక్వెన్సీ ప్రాజెక్టును ఇంకొల్లు మండలం పావులూరుకు చెందిన 9వ తరగతి విద్యార్థి తయారుచేసి ఆకట్టుకున్నాడు. కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి వీఎస్‌ సుబ్బారావు   పర్యవేక్షిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement