
రాయవరం (మండపేట): ప్రభుత్వం డీఎస్సీపై దోబూచులాడుతోందనే విమర్శలు సర్వత్రా విన్పిస్తున్నాయి. పూటకో మాట..రోజుకో నిర్ణయంతో నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటోందని శిక్షణ పొందిన నిరుద్యోగ బీఎడ్, డీఎడ్ అభ్యర్థులు మండిపడుతున్నారు. డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటనలు గుప్పిస్తున్న ప్రభుత్వం ఇప్పటి వరకు కచ్చితమైన షెడ్యూల్ ప్రకటించక పోవడాన్ని వారు తప్పుబడుతున్నారు. వాయిదాలు పడుతూ వస్తున్న ప్రభుత్వ నిర్ణయంతో ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న శిక్షణ పొందిన బీఎడ్, డీఎడ్ అభ్యర్థుల్లో అసహనం పెరిగిపోతోంది. ఇదిలా ఉంటే డీఎస్సీ అభ్యర్థులకు పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామంటూ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇటీవల ప్రకటించారు. పరీక్ష నిర్వహణపై స్పష్టమైన ప్రకటన చేయాలని, ఆఫ్‌లైన్‌లోనే పరీక్ష నిర్వహించాలంటూ పలువురు అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
ఆన్‌లైన్ వద్దు..
డీఎస్సీ–2018 నియామకం కోసం ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్‌లో పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఇందులో ఎస్‌జీటీ పరీక్షను ఆన్‌లైన్‌లో వారం రోజుల పాటు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారనే వాదనలు బలంగా విన్పిస్తున్నాయి. వారం రోజుల్లో ఒకరోజు సులభంగా, మరొక రోజు కఠినంగా పరీక్ష పేపర్ వస్తుందని గత అనుభవాల దృష్ట్యా అభ్యర్థులు పేర్కొంటున్నారు. పరీక్ష పారదర్శకంగా జరిగినా కొంతమంది అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందనే వాదన బలంగా విన్పిస్తోంది. డీఎస్సీ పరీక్షను ఆఫ్‌లైన్‌లో నిర్వహించడం వల్ల అభ్యర్థులందరికీ న్యాయం జరుగుతుందని పలువురు పేర్కొంటున్నారు.
స్పష్టం చేయాలి
డీఎస్సీ అభ్యర్థులకు పరీక్ష విధానం ఆన్‌లైనా, ఆఫ్‌లైనా అనేది ప్రభుత్వం ప్రకటించాలని నిరుద్యోగ బీఎడ్, డీఎడ్ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. చాలామందికి ఆన్‌లైన్ విధానంపై పూర్తి అవగాహన లేదు. దీంతో కొంతమంది అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది. జిల్లాలో సుమారు 50వేల మందికి పైబడి శిక్షణ పొందిన డీఎడ్, బీఎడ్, పండిట్, వ్యాయామ అభ్యర్థులు నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. అసలే తగ్గిన పోస్టులతో తీవ్ర ఆందోళన పడుతున్న అభ్యర్థులు పరీక్షా విధానంపై స్పష్టమైన ప్రకటన లేకపోవడంతో మరింత గందరగోళ పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment